
రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ వైకుంఠపాళి ఆటలో మునిగిపోయాయి. మరో మూడు రోజుల్లో 2013 సంవత్సరానికి గుడ్‌బై చెప్పనున్నందున పార్టీలన్నీ ఈ ఏడాది తీపి, చేదు జ్ఞాపకాలను మననం చేసుకుంటూ కొత్త సంవత్సరంలో అడుగిడనున్నాయి. ఈ సంవత్సరం దాదాపు తెలంగాణ అంశం చుట్టే తిరగడంతో, ఒకటి, రెండు పార్టీలు మినహా అన్ని పార్టీలకూ చేదు అనుభవాలే మిగిల్చాయి. కొత్త సంవత్సరం ప్రారంభమైన తర్వాత సార్వత్రిక ఎన్నికలకు మిగిలి ఉన్న గడువు రెండు నెలలే. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మే రెండో వారం వరకూ గడువు ఉన్నప్పటికీ, మార్చి మొదటి వారంలోనే కేంద్ర ఎన్నికల సంఘం (సిఇసి) దేశ వ్యాప్తంగా జరిగే లోక్‌సభ ఎన్నికల తేదీల షెడ్యూలును ప్రకటిస్తుంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేందుకు గడువు ఉన్నా, షెడ్యూలు ప్రకటనతోనే ‘కోడ్’ అమల్లోకి వచ్చేస్తుంది. దీంతో కొత్త పథకాలు చేపట్టడం, నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాదు. మిగిలింది రెండు నెలలే కాబట్టి అన్ని పార్టీలు ‘పదును’ పెడుతున్నాయి. వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు అన్ని పార్టీలకూ వైకుంఠపాళి ఆట మొదలైంది. అన్ని పార్టీలు జిమ్మిక్కులు ప్రారంభించాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుష్కర కాలం క్రితం ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి మినహా అన్ని పార్టీలూ వైకుంఠపాళిలో ఇబ్బంది పడుతున్నాయి. చిన్నా, పెద్ద పాములను అధిగమించి ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్నాయి. మధ్య, మధ్యలో చిన్న పాములు మింగినా, మళ్లీ మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నాయి. చివరకు 98 మెట్లు ఎక్కి 99వ స్థానంలో ఉండే అతి పెద్ద పామును దాటుకుని, వందవ స్థానం (అధికార పీఠం)లోకి చేరుకోవడానికి పోరాడుతున్నాయి. రాజకీయంగా ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్ర సమితి పని హాయిగా ఉంది. సార్వత్రిక ఎన్నికలలోగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగితే ఇదంతా తమ కృషి ఫలితమేనని చెప్పుకోవడానికి ఆ పార్టీకి ఆస్కారం ఉంది. ఏదైనా కారణాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగకుండా జాప్యం జరిగితే, ఎన్నికల ముందు ఆ పార్టీ అధికారంలో ఉన్న పార్టీని కుమ్మేయడం ఖాయం.
ఇవన్నీ పసి గట్టడమే కాకుండా, రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనపడిందన్న భావనతో కాంగ్రెస్ అధిష్ఠానం వేగంగా పావులు కదిపింది. మిగతా పార్టీలను ఇబ్బంది పెట్టవచ్చన్న భావనతో కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నది. అయినప్పటికీ, ఆశిం చిన ఫలితం కనిపించడం లేదు. తెలంగాణ ముసాయిదా బిల్లు అసెంబ్లీ నుంచి మళ్లీ రాష్టప్రతికి చేరుకోవాలి. ఆ తర్వాత రాష్టప్రతి ఆ బిల్లును కేంద్ర మంత్రివర్గానికి పంపించాలి. కేంద్రం ఉభయ సభలో ఆమోదింపజేయాలి. ఈ లోగా ఎనె్నన్ని కేసులో, ఎనె్నన్ని అవాంతరాలోనన్న భయం లేకపోలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ రాష్ట్రంలోనైనా అధికారం చేజిక్కించుకుని, మెజారిటీ ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవచ్చన్న ఆలోచనతో అధిష్ఠానం ముందడుగు వేసింది. కానీ ఒక ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయం కారణంగా సీమాంధ్రలో పార్టీ భారీగా నష్టపోవాల్సి వస్తుందని, పార్టీ అడ్రసు లేకుండా పోతుందని కాంగ్రెస్ సీనియర్లే కొందరు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎఐసిసి అధ్యక్షురాలు ఈ నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నా, తెలంగాణ రాష్ట్ర సమితిని విలీనం చేసుకోవడం లేదా ఆ పార్టీతో పొత్తు లేకపోతే ఫలితాలు మరోలా ఉంటాయని వివిధ పార్టీల నేతలు అంచనా వేస్తున్నారు.
ఈ వైకుంఠపాళిలో తెలుగు దేశం పార్టీ ఎక్కువ కష్టపడుతున్నది. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రెండు కళ్ళ సిద్ధాంతం గురించి చాలా కాలంగా చెబుతున్నా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం రాదన్న నమ్మకం ఉన్న ఆ పార్టీ సీమాంధ్ర నాయకులంతా సీరియస్‌గా పట్టించుకోలేదు. తీరా నిర్ణయం వచ్చిన తర్వాత గగ్గోలు పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావాలంటూ టి.టిడిపి నాయకులంతా వత్తిడి తీసుకుని వచ్చారు. ఈ వత్తిళ్ళతో బాబు సమన్యాయం కావాలంటూ పట్టుబడుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలుత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా మాట్లాడినా తెలంగాణపై కేంద్ర నిర్ణయం రావడంతో సమైక్య బాట పట్టింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని బిజెపి రాష్ట్ర శాఖ స్వాగతించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మొదటి నుంచి ఆ పార్టీ మద్దతునిస్తున్నందున, ఆ పార్టీ సీమాంధ్ర శాఖ నుంచి పెద్దగా వ్యతిరేకత రాలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంటుకు వస్తే మద్దతునిస్తామని ఆ పార్టీ అగ్రనేతలు ఇదివరకే కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా కాంగ్రెస్‌ను బంతిలా ఆడుకునేందుకు బిజెపి సిద్ధంగా ఉంది. ఇక సిపిఐ తెలంగాణకు మద్దతునిస్తోంది. సిపిఎం మాత్రం వ్యతిరేకిస్తోంది. మజ్లీస్ పార్టీ తొలుత తెలంగాణను వ్యతిరేకించినా, రాయల- తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించినా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు చేయగలిగింది ఏముందంటూ దాట వేస్తోంది. వీటన్నింటి నేపథ్యంలో అసెంబ్లీకి వచ్చిన టి.బిల్లుపై డిసెంబర్ 12 నుంచి 19వ తేదీ వరకు (మొదటి విడత) జరిగిన సమావేశాల్లో ఐదు నిమిషాలకు మించి సభ సమావేశం కాలేదు. రెండో విడత కొత్త సంవత్సరం ఆరంభంకాగానే 3వ తేదీ నుంచి సభ సమావేశం కాబోతున్నది. ఆ సమావేశాల్లోనైనా పార్టీలన్నీ టి.ముసాయిదా బిల్లుపై చర్చిస్తాయా? వైకుంఠపాళిలో ఆయా పార్టీలు ఎలా బయటపడతాయో చూద్దాం.