
ఒకప్పుడు ఆంధ్ర రాజకీయ నాయకులు వివిధ రాష్ట్రాలకు గవర్నర్లుగా వ్యవహరించారు. పట్ట్భాసీతారామయ్య, బెజవాడ గోపాలరెడ్డి, అనంత శయనం అయ్యంగార్, మర్రి చెన్నారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, వి.ఎస్.రామారావు, సత్యనారాయణరెడ్డి, వి.వి.గిరి, వి.ఎస్.రమాదేవి. కానీ ఇప్పుడు రాష్ట్ర గవర్నర్లుగా విశ్రాంత ఐపిఎస్ అధికారులు, కాగ్, ఆర్‌బిఐ విశ్రాంత అధ్యక్షులను గవర్నర్లుగా నియమిస్తున్నారు. కొందరు కాంగ్రెస్ గవర్నర్లు కాంగ్రెసేతర రాష్ట్ర గవర్నర్లుగా అక్కడ ముఖ్యమంత్రులకు పలు రకాల ఇబ్బందులు కలగజేస్తూ అసలు రాజ్యాంగంలో గవర్నర్ల వ్యవస్త రద్దుచేయాలనేదాకా వెళ్లారు. మన రాష్ట్రంలో ఎం.ఆర్.సత్యనారాయణరావుగారు గవర్నర్ కావాలని ఆశిస్తే బస్ భవన్‌తో తృప్తిపడాల్సి వచ్చింది. గవర్నర్ల నియామకానికి యిప్పుడు ఆంధ్రులు రోశయ్యగారు తప్ప ఇతర రాజకీయ నాయకుల అవసరం రాలేదు. మళ్లీ ఆంధ్రులు గవర్నర్లుగా వ్యవహరించే మంచి కాలం ముందు ముందు వస్తుందేమో చూడాలి.
- కె.హెచ్.శివాజీరావు, హైదరాబాద్
అమెరికా అమానుషం
21.12.2013 సాక్షి వీక్‌పాయింట్ వ్యాసంలో పేర్కొన్నట్టు అమెరికా అధ్యక్షుడి కుక్కలకిచ్చే గౌరవం మన దౌత్య ప్రతినిధులకు దక్కడపోవటానికి కారణం - మన విదేశాం గ విధానంలో లోపాలు - అమెరికా అంటే వల్లమానిన భయం, ప్రేమ. కొన్ని చిన్న దేశాలయిన వియత్నాం, కొరియాలు అమెరికా వల్ల ఏ చిన్న తగాదా వచ్చినా ఎదురొడ్డి పోరాడుతున్నాయి. తమ దేశ సైనికుడ్ని చంపితే యుద్ధానికి సన్నద్ధం అవుతున్నాయి. ఆసియాలోనే పెద్ద దేశమైన భారతదేశం మాత్రం ప్రతి అవమానకర సంఘటనకు స ద్దుకుపోతున్నది. అబ్దుల్ కలాం, జార్జిఫెర్నాండెస్, షారూఖ్‌ఖాన్‌లకు జరిగిన అవమానాలు చాలవా అమెరికాతో సంబంధాలు తెంచుకోవడానికైనా, గట్టిగా బుద్ధి చెప్పడానికయినా! యుపిఎ, ఎన్‌డిఎలు పవరులో కొచ్చినా అమెరికా విషయంలో ఏమనలేక చతికిల పడిపోయాయి. మన దౌత్యాధికారిణి దేవయాని దీనావస్థను మాతృదేశం, చిన్న విషయంగా భావిస్తే అది దేశానికే అవమానం. అది ఆమెకు జరిగిన పరాభవమే కాదు - దేశ ప్రజలందరిది.
-ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
స్కూళ్ళకు నేషనల్ ఫెస్టివల్ గ్రాంటు ఇవ్వాలి
మన దేశంలో గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాలను ఘనంగా జరుపుకునేది పాఠశాలలే. ఇతర చోట్ల జాతీయ పతాకాలు ఎగురవేసినప్పటికీ పాఠశాలల్లో ఘనంగా జరిపినట్లు జాతీయ పండుగలను ఇంత వేడుకగా జరపరు. విద్యాశాఖ యాజమాన్యంలో పనిచేసే విద్యాలయాలలో వీటిని నిర్వహించుకొనడం, విద్యార్థులు తరగతి గదులను అలంకరించుకొనటం, ఆటల పోటీలు, బహుమతులు, మిఠాయి పంపకాలు ఇత్యాది కార్యక్రమాలు, ఖర్చులు ఉంటాయి. అయితే ఈ పండుగల నిర్వహణకోసం విద్యాశాఖనుంచి ఒక్క పైసా విడుదల కాకపోవటం అసమంజసం. పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, విద్యార్థులే ఈ ఖర్చును భరించే పరిస్థితి నెలకొంది. భావి భారత పౌరులకు ఈ పండుగల పరమార్థాన్ని వివరించే ఈ సందర్భాలకు రాజీవ్ విద్యామిషన్ అధికారులు నిధులందించాలి. విద్యార్థులలో జాతీయ భావాలను పెంపొందించే ఈ పర్వదినాలను నిర్లక్ష్యం చేయడం, తమకు పట్టనట్టు చూస్తుండటం ప్రభుత్వానికి తగదు. కనుక సంవత్సరానికొకసారి నేషనల్ ఫెస్టివల్ గ్రాంటును విద్యార్థుల సంఖ్యనుబట్టి పాఠశాలలకు అందించాలి.
- గోదూరు అశోక్, మెట్‌పల్లి
సర్దుబాటు అవసరం
‘‘మాతృదేవోభవ- పితృదేవోభవ’’ అన్నది వేదవాక్కు. తల్లి, తండ్రి దైవంతో సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి. నోరులేని జంతువులలో కూడా తల్లిదండ్రులు- బిడ్డల మధ్య అనిర్వచనీయమైన బంధం నెలకొని వుం టుంది. తల్లిదండ్రులు తమ సంతానం పురోభివృద్ధికోసం అనేక త్యాగాలను చేస్తారు. తమ అవసాన దశలో పిల్లలు తమను కనిపెట్టుకొని వుండాలన్న తల్లిదండ్రుల కోరిక అత్యాశ ఏం కాదు.
కాని ప్రస్తుత తరుణంలో ధనార్జన, కెరీర్ లక్ష్యంగా బ్రతుకుతున్న పిల్లలు తమ తల్లిదండ్రులను పనికిరాని వస్తువులుగా భావిస్తున్నారు. శాస్త్రంలో చెప్పినట్లు గౌరవ మర్యాదలు, భక్తిశ్రద్ధలతో చూడడం అటుంచి వయసు ఉడిగిన వెంటనే వారిని ఒక అవరోధంగా భావించి అనాధాశ్రమాలలో చేర్పించేస్తున్నారు. తల్లిదండ్రులు స్వర్గస్తులయ్యాక భక్తితో స్మరించడం, శ్రాద్ధాది కర్మకాండలు చేయడం మానివేస్తున్నారు.
అయితే పిల్లలవద్ద జీవించాలనుకునే తల్లిదండ్రులు కూడా తమ ఆలోచనలలో కొంత మార్పు చేసుకొని కాలానుగుణంగా జీవించడం నేర్చుకోవాలి. కుటుంబ వ్యవస్థ, ప్రేమానురాగాలు, భవబంధాలు ఆరోగ్యకరంగా వర్ధిల్లాలంటే పరస్పరం అడ్జెస్ట్‌మెంట్‌తో జీవించడం అత్యావశ్యకం. లేకుం టే సమాజం విచ్ఛిన్నానికి మనమే పరోక్షంగా కారకులౌతాం.
- సి.ప్రతాప్, విశాఖపట్నం