త్వరలో ఏడు ప్రత్యేక ఉపగ్రహాల ప్రయోగం
ఇస్రో శాస్తవ్రేత్త వైవిఎన్ కృష్ణమూర్తి
భీమవరం, డిసెంబర్ 27: అత్యాధునిక పరిజ్ఞానంతో భూమిపై ప్రతి కదలికను కుణ్ణంగా తెలుసుకునేందుకు ఉపగ్రహాలను సిద్ధం చేస్తున్నామని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్తవ్రేత్త, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (ఐఐఆర్‌ఎస్) డైరెక్టర్ డాక్టర్ వైవిఎన్ కృష్ణమూర్తి చెప్పారు. 2015 నాటికి ఏడు ప్రత్యేక ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెడతామని, ఈ ప్రయోగం పూర్తయితే భూమిమీద ప్రతి కదలికను తెలుసుకోవడం సునాయాసమవుతుందన్నారు. ఇక్కడి విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్టస్థ్రాయి సైన్స్‌ఫేర్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్) ద్వారా మరిన్ని పరిశోధనలకు అవకాశం కలుగుతోందన్నారు. జియోస్పేస్ టెక్నాలజీ ద్వారా వరి, పత్తి, గోధుమ, ఉల్లి వంటి సుమారు 20 పంటలపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. నేల స్వభావం, ఉత్పత్తి, వివిధ దశల్లో పంటల పరిస్థితులు తదితర అంశాలపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. పంటలు వేసే ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు, తెగుళ్లు తదితర వివరాలు ముందుగానే తెలుసుకునే అవకాశం కలుగుతుందని, దీనివల్ల నష్టనివారణ చర్యలు ముందే తీసుకోవచ్చునన్నారు. ఈ టెక్నాలజీ ద్వారా రైతులకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడనుంచైనా శాస్తవ్రేత్తలు సలహాలు, సూచనలు ఇవ్వవచ్చన్నారు. సముద్రంలో మత్స్య సంపదను సైతం రిమోట్ సెన్సింగ్‌లోని నావిగేషన్ విధానం ద్వారా తెలుసుకోవచ్చని, దీనివల్ల మత్స్యకారులకు వేట సులభమవుతుందన్నారు.
దేశంలో 7,500 కిలోమీటర్ల మేర సముద్ర తీరం విస్తరించి ఉందని, సముద్రంలో ఏ ప్రాంతంలోకి వెళ్ళాలి? ఏ దిక్కున మత్స్య సంపద ఉందనే విషయాలు ముందుగానే వెల్లడవుతాయన్నారు. పడవల్లో వేటకు వెళ్ళే వారికి వాతావరణం గురించి ముందస్తు వివరాలు ఇవ్వడం, ఏ దిక్కు నుండి ప్రమాదం పొంచి ఉందో తెలుసుకోవడానికి వీలవుతుందన్నారు. రానున్న రోజుల్లో సెల్‌ఫోన్లకు కూడా ఈవిధానం వర్తిస్తుందన్నారు. భువన్ అనే వెబ్‌సైట్ కూడా ఇస్రో ప్రారంభించిందన్నారు. ఇటీవల కేదార్‌నాథ్ ప్రమాద బాధితులను జిఐఎస్ విధానం ద్వారా కనిపెట్టారని, దేశంలో ఆరు లక్షల గ్రామాల్లో నిత్యం ఏం జరుగుతుందో ముందే తెలుస్తుందని కృష్ణమూర్తి తెలిపారు.
కాగా, ప్రతి విద్యార్థి ఒక శాస్తవ్రేత్త కావాలనే ఉద్దేశంతోనే మెదక్ జిల్లా నర్సాపూర్, పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో అసెస్టిట్ టెక్నాలజీ ల్యాబ్ (ఎటిఎల్) లను ప్రారంభించామని విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ఛైర్మన్ కెవి.విష్ణురాజు చెప్పారు.