
* సమైక్య శంఖారావంలో జగన్
చిత్తూరు, డిసెంబర్ 27: ఓట్లు, సీట్ల కోసం చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ ధ్వజమెత్తారు. సమైక్యాంధ్ర ప్రజాగర్జన సందర్భంగా శుక్రవారం చిత్తూరు జిల్లా పలమనేరు, గంగవరం మండలాల్లో ఆయన పర్యటించారు. పలమనేరు మండలం పత్తికొండ వద్ద రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ, ఓట్ల కోసం త్వరలో చంద్రబాబు వస్తే ప్రజలంతా నీళ్ల కోసం నిలదీయాలని, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వస్తే ఉపాధి కోసం యువత నిలదీయాలన్నారు. రాష్టప్రతిని కలిసినప్పుడు కూడా చంద్రబాబు సమైక్యాంధ్ర గురించి మాట్లాడలేదన్నారు. నాలుగు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని, ఈ ఎన్నికలు తెలుగు వారి ఆత్మగౌరవానికి, ఢిల్లీ అహంకారానికి మధ్య యుద్ధం వంటివన్నారు. వైఎస్సార్‌సిపి చేపట్టిన ఉద్యమం ద్వారా దేశం మొత్తానికి రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించామన్నారు. రాష్ట్రం విడిపోతే విద్య, ఉపాధి అవకాశాలు కోల్పోయి ప్రజలు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు ఉప్పు నీరు తప్ప సాగునీరు, తాగునీరు దొరకదన్నారు. సమైక్యాంధ్ర కోసం తాను చేస్తున్న పోరాటానికి ప్రజలు మద్దతిచ్చి సహకరించాలని కోరారు. జగన్ వెంట మాజీ ఎమ్మెల్యేలు కరుణాకర్‌రెడ్డి, అమరనాథ్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, నారాయణస్వామి పాల్గొన్నారు.