* మహిళలకు జస్టిస్ చలమేశ్వర్ పిలుపు
రాజమండ్రి, డిసెంబర్ 27: సమాన రాజ్యాధికారం కోసం మహిళలు ఉద్యమించాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పిలుపునిచ్చారు. ‘స్ర్తిలు-రాజ్యాంగపరమైన హక్కులు’ అంశంపై శుక్రవారం ఇక్కడ జరిగిన సదస్సులో ఆయన ప్రసంగిస్తూ, ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలకు సమాన రాజ్యాధికారం కష్టసాధ్యమన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం జరుగుతున్న ప్రయత్నాలు ఎప్పటికి ఫలిస్తాయో చెప్పలేమని, ఓటు హక్కు ఉన్న స్ర్తిలంతా వచ్చే ఎన్నికల్లో మహిళా అభ్యర్థులకే ఓట్లు వేసి, ఇతరులతో కూడా వేయంచి గెలిపించుకోవాలన్నారు. ఓట్లు వేసేందుకు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు మహిళలు చొరవ చూపితేనే రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ హక్కును వారు సాధించగలుగుతారన్నారు. ఎన్నికలపై డబ్బు, కులం, ప్రాంతం ప్రభావం వదలనంత వరకు సమానత్వం సాధించటం కష్టమన్నారు. ఆడపిల్లలను ఉన్నత చదువు చదివిస్తే పెళ్లి చేయలేమన్న భావనను విడనాడాలని చలమేశ్వర్ సూచించారు. దినసరి వేతనాల్లో ఇప్పటికీ పురుషులకు, మహిళలకు మధ్య వ్యత్యాసం ఉందని, దీనిని సరిచేసుకోవాలన్నారు. కేరళలో మహిళలు అన్ని రంగాల్లోను పురుషులతో సమానంగా ఉన్నారన్నారు. నేడు మన రాష్ట్రంలోనూ ఆడపిల్లలు బాగా చదువుకుని మగపిల్లలతో పోటీపడుతున్నారన్నారు. ఉద్యోగాల్లో 33శాతం రిజర్వేషన్లు కూడా మహిళలకు ఉండటం వల్ల కొంత ప్రత్యేక రక్షణ కలుగుతోందన్నారు. వ్యవస్థలో లోటుపాట్లను సరిచేసుకుని అధికారంలో మహిళలు సముచిత ప్రాతినిధ్యం పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లోని ప్రతిభావంతులైన మహిళలను జస్టిస్ చలమేశ్వర్ సన్మానించారు.
రాజ్యాధికారం కోసం పోరాడండి
english title:
justice chalameswar
Date:
Saturday, December 28, 2013