
విజయవాడ, డిసెంబర్ 27: గత 41 రోజులుగా కఠోర నిష్టతో ఉన్న భవానీ స్వాముల దీక్ష విరమణ కార్యక్రమం ఇక్కడి ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల ఆలయ ప్రాంగణంలో వేడుకగా ముగిసింది. శుక్రవారం ఉదయం 11గంటలకు యాగశాలలో ఆలయ ఇన్‌చార్జ్ ఇవో త్రినాథరావు సమక్షంలో ఆలయ స్థానాచార్యుడు విష్ణ్భుట్ల శివప్రసాద్, ప్రధాన అర్చకుడు లింగంబొట్ల దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో భక్తిప్రపత్తులతో పూర్ణాహుతి జరిగింది. హోమగుండం వద్ద విశేష పూజలు నిర్వహించి చివరగా పూజాసామాగ్రిని భవానీలు హోమగుండంలో వేశారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు భవానీలు దుర్గగుడికి తరలివస్తూనే ఉన్నారు. ముందుగా ఊహించిన దానికి భిన్నంగా ఈసారి ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి భక్తులు తక్కువ సంఖ్యలో వచ్చారు. వరుస తుపానులతో వ్యవసాయ రంగం అతలాకుతలం కావటంతో అత్యధికులు దీక్ష స్వీకరించలేదని చెబుతున్నారు. గత ఐదురోజుల్లో సుమారు 6లక్షల మందికి మించి భవానీలు రాలేదంటున్నారు. భవానీలు, వారి వెంట వచ్చే కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకుని 14 లక్షల లడ్డూలు సిద్ధం చేసినా, 7 లక్షలకు మించి విక్రయం జరగలేదని తెలుస్తోంది. అధికారికంగా దీక్ష విరమణ కార్యక్రమం ముగిసినా శని, ఆదివారాల్లో వచ్చే భక్తులను కూడా దృష్టిలో వుంచుకొని పోలీస్ బందోబస్తుతో పాటు క్యూలైన్లు, ఇతర ఏర్పాట్లన్నీ మరో రెండ్రోజులు కొనసాగేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఐదురోజులుగా విజయవాడ నగరంలో భవానీల రాకపోకలతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ట్రాఫిక్ మళ్లింపు వల్ల ఎదురైన ఇక్కట్లను సైతం నగరవాసులు పట్టించుకోలేదు.