
మాట ఎవరికైనా ఇవ్వొచ్చు. అదేమన్నా మనసా? ఎప్పుడు కావాలంటే అప్పుడు వెనక్కి తీసుకోవచ్చు.
కావాలంటే మనసు కూడా ఇచ్చి వెనక్కి తీసుకోవచ్చు కానీ, అదెలావుంటుందంటే, పర్సు ఇచ్చి వెనక్కి తీసుకున్నట్టుంటుంది. మన పర్సు మనకు వచ్చేస్తుంది. కానీ మన పైసలు మనకి రావు. మనసు అంతే, మన మనసు మనకి వచ్చేస్తుంది. అందులో ప్రేమ ఉండదు. ఆ తర్వాత అది మనకు కూడా పనికిరాదు.
మాట అలా కాదు. తీసేస్కోవచ్చు. పాలిటిష్యన్లను చూడండి. నోటూ ఇస్తారు. మాటా ఇస్తారు.
అయిదేళ్ళకోసారి వెయ్యిరూపాయల నోటు ఇస్తారు. మళ్ళీ వెనక్కి తీసకుంటారా? లేదే! కానీ మాటో..? వెంటనే వెనక్కి తీసేసుకుంటారు.
మన రాష్ట్రంలోని నేతలే చూడండి. రాష్ట్ర విభజన అంశం మీద ‘మాట’లెలా వెనక్కి తీసుకున్నారు. నిన్న ‘ప్రత్యేకం’ అన్నవాళ్ళు నేడు సమైక్యం అంటున్నారు. నిన్న ‘సమైక్యం’ అన్నవాళ్ళు ప్రత్యేకమంటున్నారు.
మాట అన్నది దేనికి తప్పటానికే కదా- అన్నది మనదేశంలో రాజనీతిగా సెటిలయిపోయింది. ఒక్క రాజనీతేమిటి? ఇదే సాంఘిక నీతి, ఆర్థిక నీతి, సాంస్కృతిక నీతి కూడా అయిపోయింది.
‘ ఈ హార్లిక్స్ తాగి పెడితే, నీకు చాక్లెట్ కొని పెడతా?’ ఇదీ మాటే. బిడ్డకు తల్లి ఇచ్చే మాట. ఈ మాట నమ్మే, వాడు హార్లిక్స్‌ను ‘గరళం’లా (అది ఎంత మధురంగా వున్నా సరే) తాగేస్తాడు. కానీ మాట వెంటనే తప్పేస్తాం. వాడికి చిన్నప్పుడే ఓ పాఠం అర్థమవుతుంది: హర్లిక్స్ ఉన్నది తాగటానికి: మాట ఉన్నది తప్పడానికి.
‘హోం వర్క్ చెయ్యక పొయ్యారో, రేపు తాట వలిచేస్తాను’ అని మొదటి క్లాసులో మాస్టారు అన్నప్పుడు నిజంగా భయం వేసి, వొళ్ళు వంచి హోంవర్క్ చేసుకుని వెళ్ళితే, ఆయన తీరిగ్గా క్లాసుకు వస్తాడు. వచ్చి హోం వర్క్ అడుగుతాడా? అడగడు. ‘హోం వర్క్ చేశారా?’ అని ఆయన అడిగి, మన హోంవర్క్‌ను చూసి ‘గుడ్’ అని మెచ్చుకుని, చెయ్యని వాళ్ళను లేపి, మన కళ్ళముందు వారి తాట వలుస్తుంటే చూడాలని కదా-ఆశపడింది! కానీ, అసలు ఆ విషయమే అడక్కుండా, ఎవరి తాటా వలవకుండా, తాను తెచ్చుకున్న నారింజ పండునే వలుచుకు తింటుంటే, ఏమర్థమవుతుంది? పండు వున్నది వలవడానికి: మాట వున్నది తప్పటానికి.
మూతి మీద మీసం లాంటి నీడవచ్చాక, ఏ కుర్రపిల్లనయినా ప్రేమిస్తే బాగుండునని అనిపిస్తుంది. ఎందుకనీ? ఎందుకనీ ఏమిటి!? రోజూ (బుల్లితెరమీదో, పెద్దతెర మీదో) సినిమాల్లో హీరోయిన్లను చూస్తే, ప్రేమించాలని అనిపిస్తుంది కానీ, సన్యాసం తీసుకోవాలని అనిపించదు కదా! (కానీ సన్యాసుల్ని చూసి ‘నిత్యానందాని’కి గురయిన రంజిత లాంటి హీరోయిన్లకు మాత్రం ప్రేమించాలని అని అనిపించకుండా సన్యాసం పుచ్చుకోవాలని అనిపిస్తుంది. అది వేరే విషయం.) ఓ మోస్తరు పిల్లను చూసి, వెనకబడగా, వెనకబడగా, పరీక్షలయ్యాక తీరిగ్గా ప్రేమించుకుందామని మాట ఇస్తుంది. పరీక్షలవుతాయి. సాయంత్రం అయిదుగంటలకు ‘కాఫీడే’ కలుద్దామంటుంది. ఇచ్చిన మాట తప్పకుండా, అయిదు గంటలకే వస్తుంది. మాట తప్పని ప్రేయసి దొరికినందుకు పొంగి పోతాడు. కానీ, ఆమె వెచ్చని కాఫీ తాగి, బ్యాగ్‌లోంచి చల్లగా ‘శుభం కార్డు’ ఒకటి తీసి ఇస్తుంది. ఈ లోగా తాగిన కాఫీకి బిల్లు వస్తుంది. అప్పుడు మనకో విషయం బోధ పడుతుంది: బిల్లు వున్నది కట్టడానికి: మాట ఉన్నది తప్పడానికి.
ఎవరో ఒకరిని తెంపు చేసుకుని, పెద్దలు కుదిర్చిన కుందనపు బొమ్మనే పెళ్ళి చేసుకుంటాం. కానీ ఎక్కడో లోన ‘్భగ్న ప్రేమికుడు’ ఉండిపోతాడు. వాడు రోజూ ఇంటికి తిన్నగా వెళ్ళనివ్వడు. ‘్భగ్న ప్రేమ’ వంక మీద, బార్లలోనో, రెస్టారెంట్లలోనో ఒకే ‘్ఫ్లష్ బ్యాక్’ను వందసార్లు చెబుతుంటాం. పాపం ఇంటావిడ ఎదురు చూస్తూ ఉంటుంది. ఇలా యేళ్ళు గడుస్తుంటాయి. ‘ఇవాళయినా సాయంత్రం తొందరగా వస్తారా? నేను భోంచెయ్యకుండా ఎదురు చూస్తుంటాను’ అని అడగడమూ, వస్తామని మాట ఇవ్వడమూ జరిగిపోతుంటాయి. కానీ రోజూ అదే ఆలస్యం. ఆమెకు అవే ఎదురు చూపులు. వయసు మళ్ళాక కానీ, అర్థం కాదు; మనం మాట తప్పితే ఆమె మాట తప్పకుండా వుంటుందా? ప్రతీ రోజూ ఆమె ముందు కాస్త భోంచేసే ఎదురు చూస్తుండేది. మళ్ళీ మనమొచ్చాక మనతో కూడా భోంచేసేది. భోజనం ఉన్నది తినడానికి: మాట వున్నది తప్పడానికి.
ఇలా ఎవరికి మాట ఇచ్చినా, తప్పడానికి వెయ్యిన్నొక్క ఉపాయాలున్నాయి. మరి మనకి మనం- అనగా నాకు నేనూ, నీకు నువ్వూ- మాట ఇచ్చుకుంటే తప్పటానికి ఉపాయం వుంటుందా?
కొత్త సంవత్సరం వస్తుండగానే, ఎవరికి వారు మాట ఇచ్చుకుంటారు. వీటి నే ‘కొత్త సవంత్సర తీర్మానాలు’ (న్యూ యియర్ రిజల్యూషన్స్) అంటారు.
డిశంబరు 31వ తేదీ 12 గంటల తర్వాత..‘తాగను’, ‘పొగ పీల్చను’, ‘నాన్ వెజ్ తినను’...ఇలాంటి వొట్టు పెట్టుకుంటారు. ఇవి వదిలిపెట్టేవి. అలా గే...‘యోగా చేస్తాను, డైటింగ్ చేస్తాను, రోజుకో పుస్తకం చదువుతాను’ అలవర్చుకునేవి.
మనకి మనం ఇచ్చుకున్న విషయం పక్కవాడికి తెలియనవసరం లేదు. కాబట్టి తప్పటం ఈజీయే.
అందుకే డిశంబరు 31వ రోజు అర్థరాత్రి వరకు ‘పీతలాగే తాగే’సి తర్వాత వదిలేద్దామనుకునే వారుంటారు. అంటే ఎంత కష్టంగా వదలుతున్నాడో చూశారా?
మనకి మనం ఇచ్చుకునే మాటలు ఇష్టంగా వుండాలి. మనకి బాగా నచ్చాలి. ‘నేను పొద్ద్ను లేచి అప్పుడే పూసిన పువ్వును కానీ, పసిపిల్ల మోమును కానీ చూడాలి.’ ఇలాంటి తీర్మాం చూడండి. ఎంత హాయిగా వుంది. ఇప్పుడు మాట తప్పుతానా? తప్పను. ఈ తీర్మానం ఏరోజు తీసుకుంటే ఆరోజే న్యూయియర్. అంతే కాని న్యూయియర్ రోజునే ఆ తీర్మానం తీసుకోవాల్సిన రూలు లేదు. హ్యాపీ న్యూ యియర్!