మోడీ వ్యవహారంపై బిసిసిఐ వర్కింగ్ కమిటీ నిర్ణయం
చెన్నై, డిసెంబర్ 28: భారత క్రికెట్ రంగంలోకి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మాజీ కమిషనల్ లలిత్ మోడీ మళ్లీ అడుగుపెట్టకుండా చూసే వ్యవహారాన్ని సుప్రీం కోర్టులోనే తేల్చుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) వర్కింగ్ కమిటీ నిర్ణయించింది. సుప్రీం కోర్టు తీర్పుపైనే తదుపరి చర్యల భారాన్ని వేసింది. భారీగా నిధుల కుంభకోణానికి పాల్పడడ్డాడని, అధికారాన్ని దుర్వినియోగం చేశాడని ఆరోపిస్తూ మోడీపై బోర్డు జీవితకాల సస్పెన్షన్‌ను విధించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఈనిర్ణయాన్ని మోడీ సుప్రీం కోర్టులో సవాలు చేశాడు. అక్కడ స్టే లభించడంతో, రాజస్థాన్ క్రికెట్ సంఘం (ఆర్‌సిఎ) అధ్యక్ష పదవికి పోటీ చేశాడు. మోడీని పోటీ చేయడానికి అనుమతిస్తే కఠినంగా వ్యవహరిస్తామని బోర్డు హెచ్చరించినప్పటికీ ఆర్‌సిఎ స్పందించలేదు. సుప్రీం కోర్టు నియమించిన పరిశీలకుడి ఆధ్వర్యంలో ఈనెల 19న ఎన్నికలు జరిగాయని, మోడీ అభ్యర్థిత్వానికి ఎవరూ అభ్యంతరం పెట్టలేదని ఆర్‌సిఎ వాదిస్తోంది. శనివారం జరిగిన బిసిసిఐ అత్యవసర కార్యవర్గ భేటీకి మోడీ తరఫు లాయర్, ఉపాధ్య పదవికి పోటీపడిన మహమూద్ అబ్దీని ప్రతినిధిగా పంపింది. అయితే, అతనికి సమావేశంలో పాల్గొనే అవకాశాన్ని బోర్డు ఇవ్వలేదు. ఇలావుంటే, మోడీ వ్యవహారాన్ని సుప్రీం కోర్టులోనే తేల్చుకోవాలని బోర్డు కార్యవర్గం నిర్ణయించింది. ఆర్‌సిఎ ఎన్నికల వ్యవహారంపై ఇప్పటికే సుప్రీం కోర్టులో పిఎం రుంగ్తా పిటిషన్ దాఖలు చేశాడు. దానికే అనుబంధంగా తమ పిటిషన్‌ను దాఖలు చేయాలని తీర్మానించినట్టు బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపాడు. మోడీపై జీవితకాల సస్పెన్షన్‌ను విధించాలన్న నిర్ణయాన్ని సభ్యులంతా మరోసారి సమర్థించారని పేర్కొన్నాడు. ప్రస్తుతం కేసు సుప్రీం కోర్టులో ఉన్నందున, రుంగ్తా వేసిన స్పెషల్ లీవ్ పటిషన్ (ఎస్‌ఎల్‌పి)ను అనుబంధంగా పిటిషన్ వేయాలని అంతా ఏకీగ్రీవంగా తీర్మానించారని పటేల్ తెలిపాడు. ఈ ఏడాది సెప్టెంబర్ 25న మోడీపై జీవితకాల సస్పెన్షన్ వేటు విధించిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదన్నాడు. సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి, మోడీపై క్రమశిక్షణ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని అన్నాడు.
అబ్దీని అవమానించారు: ఆర్‌సిఎ
బిసిసిఐ కార్యవర్గ సమావేశంలో వాదన వినిపించేందుకు తమ ప్రతినిధిగా హాజరైన మహమూద్ అబ్దీని అవమానించారని రాజస్థాన్ క్రికెట్ సంఘం (ఆర్‌సిఎ) కార్యదర్శి కెకె శర్మ ఒక ప్రకటనలో ఆరోపించాడు. సమావేశం జరిగిన హోటల్ వద్ద ఉన్న భద్రతా సిబ్బంది అబ్దీతో వ్యవహరించిన తీరు గర్హనీయమని ఆ ప్రకటనలో పేర్కొన్నాడు. అబ్దీని అవమానించినందుకు క్షమాపణ చెప్పాలని బిసిసిఐ కార్యదర్శి సంజయ్ పటేల్‌ను డిమాండ్ చేశాడు. సుప్రీం కోర్టు ఉత్తర్వులను అనుసరించే ఆర్‌సిఎ కార్యవర్గానికి ఎన్నికలు జరిగాయని పేర్కొన్నాడు. కోర్టు నుంచి ప్రత్యేకంగా వచ్చిన పరిశీలకుడి పర్యవేక్షణలో జరిగిన ఎన్నికలను పట్టించుకోకపోవడం కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని శర్మ తన ప్రకటనలో బిసిసిఐని హెచ్చరించాడు. సుప్రీం కోర్టు నేరుగా జోక్యం చేసుకున్న తర్వాత, అధ్యక్ష స్థానానికి పోటీ చేసేందుకు మోడీ అర్హుడా కాదా అన్న విషయం తమ పరిధిలోకి రాదని స్పష్టం చేశాడు. సుప్రీం కోర్టు పరిశీలకుడి ఆమోదంతోనే మోడీ ఎన్నికల బరిలోకి దిగాడని, ఈ విషయంలో ఆర్‌సిఎను తప్పుపట్టడం సరికాదని అన్నాడు. అబ్దీని అవమానించడం దురదృష్టకర సంఘటనగా శర్మ పేర్కొన్నాడు. అందుకే బిసిసిఐని క్షమా పణ కోరుతున్నామని తెలిపాడు.
మా వాదనా వినాలి ఆర్‌సిఎ ప్రతినిధి అబ్దీ
చెన్నై, డిసెంబర్ 28: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) తమ వాదన కూడా వినాలని రాజస్థాన్ క్రికెట్ సంఘం (ఆర్‌సిఎ) ప్రతినిధి మహమూద్ అబ్దీ వ్యాఖ్యానించాడు. తమ వాదన వినిపించడానికే తాను చెన్నై వచ్చానని, కానీ, తనను కార్యవర్గ సమావేశానికి అనుమతించలేదని తెలిపాడు. బోర్డు అధికారులను కలుసుకునేందుకు తాను చివరి క్షణం వరకూ ప్రయత్నించానని, ఇప్పుడు కూడా హోటల్ ఆవరణలోనే వేచి చూస్తున్నానని విలేఖరులతో మాట్లాడుతూ చెప్పాడు. కార్యవర్గ ఎన్నికల్లో మోడీ పోటీ చేస్తే ఆర్‌సిఎపై కఠినంగా వ్యవహరిస్తామని, గుర్తింపు రద్దు చేస్తామని బోర్డు హెచ్చరించడం విచిత్రంగా ఉందని అన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, సుప్రీం కోర్టు పర్యవేక్షణలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో ఆర్‌సిఎ పాత్ర ఏమీ ఉండదని స్పష్టం చేశాడు. తనను సమావేశానికి అనుమతిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. తమ వాదన వినకుండా బోర్డు మొండిపట్టు పట్టడం భావ్యం కాదన్నాడు. మోడీపై చర్య తీసుకునే అధికారం బోర్డు అధ్యక్షుడు శ్రీనివాసన్‌కు లేదని అన్నాడు. న్యాయ పరమైన అనేక అంశాలు ముడిపడి ఉన్న ఒక వ్యవహారంపై ఒక వ్యక్తి నిర్ణయాలు తీసుకోవడం తగదని హితవు పలికాడు. ఇప్పటికైనా తమ వాదనను బోర్డు వినాలని కోరాడు.
సుప్రీం పైనే భారం
english title:
supreme court is final
Date:
Sunday, December 29, 2013