
సర్వశక్తులు ఒడ్డుతున్న భారత్, దక్షిణాఫ్రికా
దర్బన్, డిసెంబర్ 28: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య చివరిదైన రెండో టెస్టులో పోరు హోరాహోరీగా సాగుతోంది. ఇరు జట్లు సర్వశక్తులు ఒడ్డడంతో, ఎవరిది పైచేయో చెప్పడం కష్టంగా మారింది. మ్యాచ్ మూడో రోజు ఆటలో స్పిన్నర్లకు పిచ్ అనుకూలించగా, రవీంద్ర జడేజా 37 ఓవర్లు బౌల్ చేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు. వర్షం కారణంగా మూడో రోజు ఆట ముగిసినట్టు ప్రకటించే సమయానికి దక్షిణాఫ్రికా ఐదు వికెట్లకు 299 పరుగులు చేసింది. కెరీర్‌లో చివరి టెస్టు ఆడుతున్న వెటరన్ ఆల్‌రౌండర్ జాక్వెస్ కాలిస్ 78 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. అతను సెంచరీ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 334 పరుగులకు సమాధానంగా బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా శుక్రవారం ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టం లేకుండా 82 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఆటను కొనసాగించి 103 పరుగుల వద్ద కెప్టెన్ గ్రేమ్ స్మిత్ వికెట్‌ను కోల్పోయింది. 120 నిమిషాలు క్రీజ్‌లో నిలిచి, 81 బంతులు ఎదుర్కొన్న అతను ఏడు ఫోర్లతో 47 పరుగులు చేసి, జడేజా బౌలింగ్‌లో శిఖర్ ధావన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కీలక బ్యాట్స్‌మన్ హషీం ఆమ్లా కేవలం మూడు పరుగులు చేసి మహమ్మద్ షమీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌కాగా, ఓపెనర్ అల్విరో పెటెర్సన్ 100 బంతుల్లో, ఎనిమిది ఫోర్లతో 62 పరుగులు సాధించి జడేజా బౌలింగ్‌లో మురళీ విజయ్‌కు చిక్కాడు. ఈ దశలో కాలిస్‌తో కలిసిన ఎబి డివిలియర్స్ దక్షిణాఫ్రికాను ఆదుకున్నాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు అత్యంత కీలకమైన 127 పరుగులు జోడించారు. 161 నిమిషాలు క్రీజ్‌లో ఉండి, 117 బంతులు ఎదుర్కొన్న డివిలియర్స్ తొమ్మిది ఫోర్ల సాయంతో 74 పరుగులు సాధించాడు. విరాట్ కోహ్లీ క్యాచ్ అందుకోగా జడేజా అతనిని పెవిలియన్ పంపాడు. అనంతరం జెపి డుమినీతో కలిసి కాలిస్ 29.2 ఓవర్లలో 58 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. 82 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లతో 28 పరుగులు చేసిన డుమినీ ఇన్నింగ్స్ జడేజా ఎల్‌బి చేయడంతో ముగిసింది. వర్షం కారణంగా ఆటను నిలిపివేసే సమయానికి దక్షిణాఫ్రికా ఐదు వికెట్లు కోల్పోయి 299 పరుగులు చేసింది. కాలిస్ 224 బంతులు ఎదుర్కొని, 10 ఫోర్లతో 78 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. డేల్ స్టెయిన్ ఇంకా పరుగుల ఖాతా తెరవలేదు. కాగా, వర్షం తగ్గుముఖం పట్టినా, అవుట్‌ఫీల్డ్ చిత్తడి కావడంతో మూడో రోజు ఆట ముగిసినట్టు అంపైర్లు ప్రకటించారు.
దర్బన్ పిచ్ అనూహ్యంగా స్పిన్నర్లకు అనుకూలంగా మారడం విశేషం. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్లు స్టెయిన్, మోర్న్ మోర్కెల్ రెచ్చిపోయి బౌలింగ్ చేసి మొత్తం పది వికెట్లలో తొమ్మిది వికెట్లను పంచుకున్న విషయం తెలిసిందే. స్టెయిన్ ఆరు, మోర్కెల్ మూడు వికెట్లు సాధించారు. మ్యాచ్ మూడో రోజు ఆటలోనూ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు సహకరిస్తుందని అంతా ఊహించారు. కానీ, వికెట్‌పై బంతి స్పిన్ అయింది. ఫాస్ట్ బౌలర్లు జహీర్ ఖాన్, మహమ్మద్ షమీ, ఇశాంత్ శర్మ భారీగానే పరుగులు సమర్పించుకున్నారు. షమీకి ఒక వికెట్ లభిస్తే, జహీర్, ఇశాంత్ వికెట్లు పడగొట్టలేకపోయారు. అయితే, అశ్విన్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన జడేజా నాలుగు వికెట్లు పడగొట్టాడు. పార్ట్‌టైమ్ బౌలర్ రోహిత్ శర్మ 9.5 ఓవర్లలో 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. పిచ్ స్పిన్‌కు అనుకూలించడాన్ని గమనించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి భారత కెప్టెన్ ధోనీ ప్రయత్నిస్తే, స్పిన్ బౌలింగ్‌లో సాధ్యమైనంత వరకు రక్షణాత్మక విధాన్నా అనుసరించడమే దక్షిణాఫ్రికా లక్ష్యంగా ఎంచుకుంది. దీనితో మ్యాచ్ ఉత్కంఠ రేపుతోంది.