
మెల్బోర్న్, డిసెంబర్ 28: ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులోనూ ఇంగ్లాండ్ ఒటమి ప్రమాదంలో చిక్కుకుంది. ఇప్పటికే సీరిస్‌ను 0-3 తేడాతో కోల్పోయిన ఇంగ్లాండ్ నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 179 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ ఐదు, పేసర్ మిచెల్ జాన్సన్ మూడు చొప్పున వికెట్లు పడగొట్టారు. 231 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించడానికి రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా శనివారం ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టం లేకుండా 30 పరుగులు చేసింది. మరో రెండు రోజుల ఆట మిగిలివుండగా, మొత్తం పది వికెట్లు చేతిలో ఉన్న ఆసీస్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొమ్మిది వికెట్లకు 164 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఉదం ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా 204 పరుగులకు ఆలౌటైంది. బ్రాడ్ హాడిన్, లియాన్ చివరి వికెట్‌కు అత్యంత విలువైన 40 పరుగులు జోడించడంతో ఆసీస్ 200 పరుగుల మైలురాయిని అధిగమించింది. జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ బెయిర్‌స్టో క్యాచ్ పట్టగా హాడిన్ అవుట్ కావడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. హాడిన్ 65 పరుగులు సాధించాడు. లియాన్ 18 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆండర్సన్ నాలుగు, స్టువర్ట్ బ్రాడ్ మూడు, టిమ్ బ్రెస్నెన్ రెండు చొప్పున వికెట్లు పడగొట్టి, ఇంగ్లాండ్‌కు 51 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించారు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయడం ద్వారా ఆసీస్‌ను ఇరుకున పెట్టే అద్భుతమైన అవకాశాన్ని ఇంగ్లాండ్ చేజార్చుకుంది. కెప్టెన్ అలిస్టర్ కుక్, మైఖేల్ కార్బెరీ మొదటి వికెట్‌కు 65 పరుగులు జోడించారు. టెస్టు చరిత్రలో 8,000 పరుగుల మైలురాయిని అధిగమించిన తక్కువ వయసుగల బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించిన 28 ఏళ్ల కుక్ 51 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద మిచెల్ జాన్సన్ బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరిగాడు. కార్బెరీ 12 పరుగులు చేసి, పీటర్ సిడిల్ బౌలింగ్‌లో ఇదే తీరులో ఎల్‌బిగా అవుట్‌కావడంతో 86 పరుగులకే ఇంగ్లాండ్ రెండు వికెట్లు కోల్పోయి, ఆతర్వాత కోలుకోలేకపోయింది. మిగతా ఎనిమిది వికెట్లకు 93 పరుగుల తేడాతో చేజార్చుకుంది. జో రూట్ (15), కెవిన్ పీటర్సన్ (48), ఇయాన్ బెల్ (0), బెన్ స్టోక్స్ (19), బెయిర్‌స్టో (21), బ్రెస్నన్ (0), బ్రాడ్ (0), మాంటీ పనేసర్ (0) ఒకరి తర్వాత మరొకరిగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. జేమ్స్ ఆండర్సన్ ఒక పరుగుతో నాటౌట్‌గా నిలవగా, ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ 179 పరుగులకే పరిమితమైంది. లియాన్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో రాణించాడు. అంతేగాక ఈ ఇన్నింగ్స్‌లో అతను కెరీర్‌లో 100వ టెస్టు వికెట్ మైలురాయిని చేరాడు. ఇంగ్లాండ్ ఒక దశలో ఒక పరుగు తేడాతో మూడు, మరోసారి ఆరు పరుగుల తేడాతో చివరి ఐదు వికెట్లు కోల్పోయి కష్టాలను కొనితెచ్చుకుంది. ప్రత్యర్థి ముందు కేవలం 231 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచగలిగింది. ఈ మైదానంలో ఇంగ్లాండ్ 1928లో 332 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. 1996లో పిచ్‌ని మార్చిన తర్వాత ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్‌ల్లో అత్యధిక ఛేజింగ్ దక్షిణాఫ్రికా పేరిట ఉంది. ఆ జట్టు 2008లో 183 పరుగుల లక్ష్యాన్ని అందుకొని ఆసీస్‌ను ఓడించింది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలివున్న నేపథ్యంలో, ఈ మ్యాచ్‌లో ఫలితం తేలడం ఖాయంగా కనిపిస్తున్నది. ఇప్పటికే వికెట్ నష్టం లేకుండా 30 పరుగులు చేసిన ఆసీస్ మిగతా 201 పరుగులను సాధించి ఇంగ్లాండ్‌పై క్వీన్ స్వీప్ దిశగా అడుగు ముందుకు వేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.