
న్యూఢిల్లీ, డిసెంబర్ 28: కొత్త సంవత్సరం శర వేగంగా దూసుకొస్తున్న తరుణంలో మన దేశ టెన్నిస్ దారి ఎటు అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈఏడాది అఖిల భారత టెన్నిస్ సంఘం (ఎఐటిఎ)పై ఆటగాళ్ల తిరుగుబాటు సంచలనం సృష్టించింది. అనంతరం భారత టెన్నిస్ క్రీడాకారుల సంఘం (ఐటిపిఎ) ఏర్పడింది. నిన్న మొన్నటి వరకూ టెన్నిస్ రంగాన్ని ఒక్క తాటిపై నడిపించిన ఎఐటిఎ ఇప్పుడు ఐటిపిఎ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నది. ఈఏడాది మొత్తంలో సోద్‌దేవ్ దేవ్‌వర్మన్ నేతృత్వంలో భారత టెన్నిస్ ఆటగాళ్లు తిరుగుబాటు బావుటా ఎగరేయడం, డేవిస్ కప్ పోటీలకు గైర్హాజరు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. త్వరలోనే ఈ సమస్యకు తెరపడినట్టు కనిపించింది. ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదన్నది వాస్తవం. కానీ, ఏ క్షణంలోనైనా ఎఐటిఎపై ఐటిపిఎ మళ్లీ నిరసన గళం విప్పే ప్రమాదం లేకపోలేదు. టెన్నిస్ కోర్టు వెలుపల వివాదాలు ఎలావున్నా, వివిధ టోర్నీల్లో సానియా మీర్జా, సోమ్‌దేవ్, లియాండర్ పేస్ చిరస్మరణీయ విజయాలు సాధించడం అభిమానులకు ఊరటనిస్తోంది. ఈఏడాది సానియా మంచి ఫామ్‌ను కొనసాగించింది. ఐదు టైటిళ్లు కైవసం చేసుకుంది. మహిళల డబుల్స్‌లో పార్ట్‌నర్స్‌ను పదేపదే మార్చినప్పటికీ, ఉత్తమ ఫలితాలను రాబట్టడంతో ఈ విషయానికి ప్రాధాన్యం లేకపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో మాంటెక్ సాండ్స్‌తో కలిసి బ్రిస్బేన్ ఓపెన్ టైటిల్ సాధించిన సానియా చివరిలోచైనా ఓపెన్ టైటిల్‌ను అందుకుంది. సోమ్‌దేవ్ కూడా ఈఏడాది మెరుగైన ప్రదర్శనతో రాణించాడు. ఏడాది ఆరంభంలో ప్రపంచ ర్యాంకింగ్స్ ఆరు వందలకుపైగా ఉన్న ర్యాంక్ నుంచి అతను ‘టాప్-100’లోకి దూసుకొచ్చాడు. ఎటిపి 500 వాషింగ్టన్ ఈవెంట్‌లో ప్రపంచ 23వ ర్యాంక్ ఆటగాడు అలెగ్జాండర్ డొగ్లొపొలొవ్‌ను, ఫ్రాన్స్ ఈవెంట్‌లో 39వ ర్యాంకర్ బెనోట్ పైరేని ఓడించాడు. యుఎస్ ఓపెన్ క్వాలిఫయర్స్ అడ్డంకిని అధిగమించడమేగాక, మెయిన్ డ్రాలో రెండో రౌండ్‌కు చేరడం అతని ర్యాంక్ మెరుగుపడేందుకు దోహదపడింది. ఫిట్నెస్‌కు అత్యధిక ప్రాధాన్యమిచ్చే సోమ్‌దేవ్ యువ ఆటగాళ్లకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు. ఇక 40 ఏళ్ల వయసులోనూ లియాండర్ పేస్ చక్కటి ప్రతిభ కనబరిచాడు. రాడెక్ స్టెపానెక్‌తో కలిసి యుఎస్ ఓపెన్ డబుల్స్ టైటిల్ అందుకున్నాడు. 2016 రియో ఒలింపిక్స్ వరకూ టెన్నిస్‌లో కొనసాగే సత్తా తనకు ఉందని నిరూపించుకున్నాడు. మరో వెటరన్ ఆటగాడు మహేష్ భూపతి ఈఏడాది అద్భుతాలేవీ సృష్టించలేకపోయినా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) క్రికెట్ టోర్నమెంట్ తరహాలో టెన్నిస్ టోర్నీని నిర్వహించేందుకు అంతర్జాతీయంగా అన్ని వర్గాల నుంచి మద్దతు కూడగట్టుకున్నాడు. అతని పర్యవేక్షణలో ఇండియన్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపిటిఎల్) ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. రోహన్ బొపన్న, యుకీ భంబ్రీ, జీవన్ నెడుంజనియన్, శ్రీరాం బాలాజీ తదితరులు కూడా సత్తా చాటుతున్నారు. అయితే, పేస్, భూపతి, సానియా, సోమ్‌దేవ్ స్థాయిలో ఎవరూ ఆడలేకపోవడం ఆందోళన కలిగిస్తున్న అంశం.