
ప్రధాని పదవికి రాహుల్ సమర్థుడు
నరేంద్ర మోడీ వస్తే దేశం సర్వనాశనం
నా సమర్థతపై అనుమానాలు అక్కర్లేదు
అవసరమైన ప్రతిసారీ నోరు విప్పా
ఎన్నికలకు ముందు రాజీనామా చేయను
తొమ్మిదిన్నరేళ్ల పాలన సంతృప్తికరం
అణు ఒప్పందం సంతోషాన్నిచ్చింది
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించాం
సోనియా సహకారం అనిర్వచనీయం
మీడియాతో ప్రధాని మన్మోహన్
===================
నరేంద్ర మోడీ ప్రధాని పీఠం ఎక్కితే దేశం నాశనమే. అహ్మదాబాద్‌లో మారణహోమం సృష్టించిన వ్యక్తి ప్రధాన మంత్రి ఎలా అవుతారు? వేలాదిమందిని హతమార్చటమే ధైర్యం అనుకుంటే, అలాంటి బలం మనకు అవసరం లేదు.
ఎవరేం అనుకున్నా, నేను సమర్థుడినే. తొమ్మిదిన్నరేళ్లు సంతృప్తికరమైన పాలనే అందించాను. అమెరికాతో అణు ఒప్పందం, భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నియంత్రణ పూర్తి సంతృప్తినిచ్చింది.
ప్రధాని పదవి నిర్వహణకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పూర్తి సమర్థుడు. లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏకే అధికారం లభించే అవకాశం ఉంది. మెజారిటీ లభిస్తే యువతకే ప్రధాని పదవి. రాహుల్ ప్రధాని అవుతారు.
---------------------
న్యూఢిల్లీ, జనవరి 3: ‘ప్రధాన మంత్రి పదవికి మూడోసారి పోటీలో లేను’ అని మన్మోహన్ సింగ్ విస్పష్టంగా ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం ప్రధాని పదవిని కొత్తవారికి అప్పగించి తప్పుకుంటానని శుక్రవారం మీడియా సమావేశంలో తేటతెల్లం చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందే పదవికి రాజీనామా చేయనున్నట్టు వస్తున్న వార్తలో నిజం లేదని ఖండించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని పదవి చేపట్టేందుకు పూర్తి సమర్థుడని మన్మోహన్ కితాబునిచ్చారు. యూపీఏ అధికారంలోకి వస్తే యువతరానికి ప్రధాని పదవి చేపట్టే అవకాశం లభిస్తుందని అంటూ, మెజారిటీ లభిస్తే రాహుల్ ప్రధాని అవుతారని సూచించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ యూపీఏ అధికారంలోకి వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిత్వాన్ని హైకమాండ్ సరైన సమయంలో ప్రకటిస్తుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపికి అధికారం దక్కి ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పీఠం ఎక్కితే దేశం నాశనం అవుతుందని మన్మోహన్ తీవ్రస్థాయిలో విమర్శించారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని జోస్యం చెప్పారు. అహ్మదాబాద్‌లో మారణ హోమం సృష్టించిన వ్యక్తి ప్రధాన మంత్రి ఎలా అవుతారంటూ మోడీపై విరుచుకుపడ్డారు. వేలాదిమందిని హతమార్చటమే ధైర్యమనుకుంటే అలాంటి ధైర్యం, బలం మనకు అవసరం లేదని ప్రధాని ఖండించారు.
మరో ఐదు నెలల్లో అధికారం నుంచి తప్పుకుంటున్న మన్మోహన్ శుక్రవారం మీడియా సమావేశంలో తన తొమ్మిదిన్నరేళ్ల పాలనను పూసగుచ్చారు. తాను రబ్బర్ స్టాంపు ప్రధానిననే ఆరోపణను తీవ్రంగా ఖండించారు. తీవ్ర సమస్యలు ఎదురైనప్పుడూ వౌనం వహించారు తప్ప నోరు విప్పలేదన్న మీడియా ప్రశ్నకు ‘అవసరమైన ప్రతిసారీ నోరు తెరిచాను. ఇకమీదటా తెరుస్తుంటాను’ అని చిరునవ్వుల మధ్య సమాధానమిచ్చారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సూచనల మేరకు ప్రభుత్వాన్ని నడిపించటాన్ని సమర్థించుకున్నారు. రెండు అధికార కేంద్రాల వ్యవస్థ మూలంగా లాభమే తప్ప నష్టం తలెత్తలేదని మన్మోహన్ స్పష్టం చేశారు. అదుపుతప్పిన నిత్యావసరాల ధరలవల్లే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి చవిచూడాల్సి వచ్చిందని అంగీకరించారు. ఆమ్ ఆద్మీకి ఢిల్లీవాసులు బ్రహ్మరథం పట్టటంపై ప్రధాని బదులిస్తూ ప్రజాస్వామ్య ప్రక్రియను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అయితే ఆమ్‌ఆద్మీ ప్రయోగాలు దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించగలుగుతాయా అనేది కాలమే చెబుతుందని మన్మోహన్ అభిప్రాయపడ్డారు. గత తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్న సమయంలో తాను అత్యంత సమర్థంగా పని చేసేందుకు ప్రయత్నించానన్నారు. తన హయాంలో అవినీతి, అక్రమాలు బాగా పెరిగిపోయాయనే ఆరోపణలను ఖండించారు. ‘కొన్ని తప్పులు అక్రమాలు జరిగి ఉండొచ్చు. అయితే ప్రతిపక్షాలు, పత్రికలు, కాగ్ చిన్న చిన్న తప్పులను సైతం భూతద్దంలో చూపించి ప్రతిష్టను దెబ్బ తీశాయని ప్రధాని ఆరోపించారు. కేంద్ర మంత్రులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నా చూసీచూడనట్టు వ్యవహరించారు. మంత్రులను అదుపు చేయటంలో ఘోరంగా విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని ఒక విలేఖరి ప్రశ్నించగా, ఆరోపణల్లో నిజం లేదన్నారు. కేంద్ర మంత్రివర్గంలో జరిగిన చర్చల వివరాలను వెల్లడించలేమని స్పష్టం చేశారు. తాను చాలా బలహీనమైన ప్రధానిననే ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ‘నా పని తీరు గురించి మీరేమైనా అనుకోవచ్చు. కానీ, నేనలా భావించటం లేదు’ అని మన్మోహన్ బదులిచ్చారు. అమెరికాతో అణు ఒప్పందం చేసుకోవటం తనకెంతో నంతోషాన్ని కలిగించిందన్నారు. ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపట్ల విచారాన్ని వ్యక్తం చేస్తూనే, ఓటర్లు పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొనటం ప్రజాస్వామ్యానికి మంచిదని ప్రధాని చెప్పారు.
అవినీతి అదుపునకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతూ, రాహుల్ గాంధీ సూచించిన మిగతా బిల్లులకూ పార్లమెంటు ఆమోదం తీసుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. 2జి స్పెక్ట్రం, బొగ్గు బ్లాకులు, భూ కేటాయింపుల కుంభకోణాలను ప్రస్తావిస్తూ నిందితులను శిక్షించేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుందన్నారు. యూపీఏ ప్రభుత్వం ఏర్పడకముందు అధికారంలో ఉన్న వారు తీసుకున్న నిర్ణయాల మూలంగానే ఈ కుంభకోణాలు తలెత్తాయని ఆయన ఎన్డీయేను తప్పుపట్టారు. తాను తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇచ్చిన సహాయ సహకారాలు మర్చిపోలేనని మన్మోహన్ కొనియాడారు. రాహుల్ గాంధీ సలహాలు కూడా తనకెంతో మేలు చేశాయన్నారు. సోనియాగాంధీ ఎల్లప్పుడూ తనకు అండగా నిలిచిందన్నారు. పదవీ విరమణ చేసిన అనంతరం ఏం చేస్తారు? రాజకీయాల్లో ఉంటారా? లేక రాజకీయాలకు దూరంగా ఉంటూ జీవిత చరిత్ర రాస్తారా? అనే ప్రశ్నకు మన్మోహన్ స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. తానింకా ఐదు నెలలపాటు అధికారంలో ఉంటాను కదా? అని ఎదురు ప్రశ్న వేశారు. రిటైరైన తరువాత ఏం చేయాలనేది అప్పుడు ఆలోచిస్తానన్నారు. తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్న సమయంలో ఎప్పుడూ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసి వెళ్లిపోవాలనే ఆలోచన రాలేదని చెప్పారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా తనను ఎప్పుడూ ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని కోరలేదని మన్మోహన్ స్పష్టం చేశారు. ప్రధానిగా పని చేసిన కాలానికి మీకుమీరు ఎన్ని మార్కులు ఇచ్చుకుంటారన్న ప్రశ్నకు, చరిత్రకారులు నిర్ణయించాలని మన్మోహన్ చెప్పారు. భారత్ పాక్ దేశాల మధ్య ఉద్రిక్తత తగ్గించేందుకు గట్టిగా కృషి చేశానన్నారు. కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాలను నిర్వహించలేదనే ఆరోపణ తప్పని నిరూపించినట్టు చెప్పుకున్నారు. ‘గత తొమ్మిదిన్నరేళ్లలో నాలో ఎలాంటి మార్పూ రాలేదు. ఆరోజు ఎలా ఉన్నానో ఈరోజూ అలాగే ఉన్నాను’ అని మన్మోహన్ చెప్పారు.