
న్యూఢిల్లీ, జనవరి 3: దేశానికి దిశ, దశను నిర్దేశించడంలో దారుణంగా విఫలమైన ప్రధాని మన్మోహన్ తన పదేళ్ల పాలనపై చరిత్రకారులు తగిన తీర్పు చెప్తారని అనడం హాస్యాస్పదంగా ఉందని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు అరుణ్ జైట్లీ ఎద్దేవా చేశారు. చరిత్రకారుల సంగతేమో కానీ, రాబోయే సాధారణ ఎన్నికల్లో జనమే కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించి సరైన తీర్పు ఇస్తారని శుక్రవారం విలేఖరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఇటీవల నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు ఫలితాలే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురవుతాయన్నారు. కాంగ్రెస్‌కు ఇక అన్నీ దుర్వార్తలే తప్ప సంతోషకర క్షణాలు ఉండవన్నారు. దేశవ్యాప్తంగా ఓటమి తప్పదని గ్రహించినందునే ప్రధాని మీడియా సమావేశం నిజానికి వీడ్కోలు సమావేశంలా మారిందని జైట్లీ అభివర్ణించారు. పదేళ్ల తన పాలనలో కొనసాగిన అవినీతి, అవకతవకలకు మన్మోహన్ కొత్త్భాష్యం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
యూపీఏ-1 హయాంలో 2జి స్పెక్ట్రమ్‌తోపాటు అనేక కుంభకోణాలు జరిగినా పట్టించుకోకుండా ప్రజలు 2009లో రెండోసారి అధికారం ఇచ్చారని ప్రధాని చెప్పటం హాస్యాస్పదం అన్నారు. ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన అవినీతి పాపాలు తుడిచిపెట్టుకుని పోయినట్టు భావించరాదన్నారు. ప్రధాని వ్యక్తం చేసిన ఈ అభిప్రాయం గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి నూటికి నూరుశాతం వర్తిస్తుందని జైట్లీ అన్నారు. ఇంతవరకూ ఏ ముఖ్యమంత్రి ఎదుర్కోని ఆరోపణలను మోడీ భరించారని, అయినప్పటికీ ఆయన వరసగా మూడుసార్లు గుజరాత్‌లో ఘన విజయాలను సాధించారని గుర్తుచేశారు. దీన్నిబట్టి చూస్తే ప్రధాని ప్రవచించిన సరికొత్త సిద్ధాంతం మోడీకి మాత్రమే వర్తిస్తుందన్నారు. మోడీ ప్రధాని అయితే దేశం విధ్వంసకర పరిస్థితిని ఎదుర్కొంటుందని మన్మోహన్ తన స్థాయిని మరచి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రెండుసార్లు ప్రధాని పదవిని చేపట్టినా ఆ అవకాశాన్ని మన్మోహన్ వృథా చేసుకున్నారని వ్యాఖ్యానించారు. అధిక ధరలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలను పరిష్కరించడంలో ప్రధాని దారుణంగా వైఫల్యం చెందారన్నారు. అధిక ధరలతో జనం బాధ పడినా, ఉత్పత్తిదారులు లాభ పడ్డారని ప్రధాని చెప్పడం విడ్డూరంగా ఉందని, అదే నిజమైతే పంటలను ఉత్పత్తి చేసిన రైతులు భారీ సంఖ్యలో ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని జైట్లీ ప్రశ్నించారు.
అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవడం తన హయాంలో అత్యంత ఆనందకర సంఘటనని ప్రధాని చెప్పుకున్నారని, అయితే అణు ఒప్పందం బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేసుకోవడానికి సభ్యులకు లంచాలు ఎరవేయడం అత్యంత దురదృష్టకర సంఘటన అని జైట్లీ అన్నారు. తాను ప్రధాని పదవి రేసులో లేనని చెప్పడానికే నాలుగున్నరేళ్ల విరామం తర్వాత మీడియా సమావేశాన్ని మన్మోహన్ నిర్వహించారన్నారు. ప్రధాని అయ్యేందుకు రాహుల్ గాంధీకి అన్ని అర్హతలున్నాయని మన్మోహన్ చెప్పినా, నరేంద్ర మోడీ- రాహుల్ పోరులో ఎవరు గెలుస్తారన్నది కాలమే నిర్ణయిస్తుందని జైట్లీ వ్యాఖ్యానించారు.