
విజయవాడ, జనవరి 3: రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కరీంనగర్ జిల్లాకు వస్తే ఆయన ప్రయాణించే హెలికాప్టర్ గాలిలోనే పేల్చివేస్తామని హెచ్చరించిన ఎంపీ పొన్నం ప్రభాకర్‌పై కరీంనగర్ జిల్లా పోలీసులు సుమోటాగా కేసు నమోదు చేస్తున్నారని రాష్ట్ర డిజిపి ప్రసాదరావు తెలిపారు. రాష్ట్రంలో పలుచోట్ల పొన్నంపై వస్తున్న ఫిర్యాదులన్నీ ఎక్కడికక్కడ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు. రాజకీయ పక్షాలు, ఉద్యోగులు ప్రాంతాలవారీగా చీలిపోయినా పోలీస్‌శాఖలో మాత్రం ప్రాంతీయ వివక్ష ఎన్నటికీ ఉండదన్నారు. శుక్రవారం విజయవాడ వచ్చిన డిజిపి ప్రసాదరావు ముందుగా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పేట్రేగుతున్న కలప స్మగ్లర్లు, ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపనున్నట్టు చెప్పారు. చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో ఏడు అటవీశాఖ డివిజన్లు ఉన్నాయని, ఎర్ర చందనానికి విదేశాల్లో డిమాండ్ ఉండటంతో తమిళనాడు స్మగ్లర్లతోపాటు రాష్ట్రానికి చెందిన కొందరు వ్యక్తులు వారితో చేతులు కలుపుతున్నారని అన్నారు. ఏడు డివిజన్లలో ఏడు ఆర్మ్‌డ్ ప్లటూన్లను రక్షణగా పంపించామన్నారు. ప్రభుత్వపరంగా అటవీశాఖ అధికారులు, సిబ్బంది మొత్తానికి ప్రభుత్వం ఆయుధాలు సమకూర్చబోతోందన్నారు. వీరందరికీ 6నుంచి మూడువారాల పాటు జిల్లాల పోలీస్ శిక్షణ కేంద్రాల్లో ఆయుధాల వినియోగంపై శిక్షణ ఇస్తామన్నారు. చెక్‌పోస్టుల్లోనూ ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసులను నియమించబోతున్నట్టు చెప్పారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణలో తీవ్రవాద ప్రభావం పెరుగుతుందా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. హోంగార్డులకు సంక్రాంతిలోపు రోజువారీ వేతనం పెంచుతామన్నారు. గతంలో తెలంగాణవాదులపై కేసులు ఉపసంహరణ మాదిరిగా సమైక్యాంధ్ర ఉద్యమాల్లో నమోదైన కేసుల ఎత్తివేత ప్రభుత్వం పరిధిలో ఉందన్నారు. పోలీస్ అధికారుల బదిలీల్లో రాజకీయ జోక్యం ఉండదన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డును నెలకొల్పామని, పోలీస్ అధికారుల పనితీరును ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ తగువిధంగా చర్యలు ఉంటాయని తెలిపారు. మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, డిసిపి రవిప్రకాష్ పాల్గొన్నారు.
ఎంపి పొన్నంపై కేసు
కరీంనగర్: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కరీంనగర్ ఎంపి పొన్నం ప్రభాకర్‌పై కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సుమోటోగా కేసు నమోదైంది. మావోయిస్టు జగన్‌ను డంపర్ కోరతామంటూ చేసిన వ్యాఖ్యలు ప్రసారమాధ్యమాల్లో ప్రసారం కావడంతో హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నించడం, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడినందుకు సుమోటోగా స్వీకరించి ఐపిసి 153 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
ఎలాంటి విచారణకైనా సిద్ధం :పొన్నం
సుమోటో కేసు నమోదుపై ఎంపీ పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ తెలంగాణవాదులను, తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడి వందలాది మంది చావుకు కారకులైన సీమాంధ్ర నేతలపై చర్యలు తీసుకుంటే తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు. సీమాంధ్రకు చెందిన చాలామంది నేతలు ప్రతీరోజు తెలంగాణ ప్రజలను కించపర్చేలా మాట్లాడుతున్నారని, వారిపై ఎలాంటి సుమోటో కేసులుండవా? అని ప్రశ్నించారు.