
రాష్టప్రతికి లిఖితపూర్వక అభిప్రాయం
టిఆర్‌ఎస్, కాంగ్రెస్, తెదేపా, బిజెపి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల భేటీ
ఎమ్మెల్యేల కన్వీనర్‌గా శ్రీధర్‌బాబు
-------------------
హైదరాబాద్, జనవరి 3: ప్రత్యేక రాష్ట్ర సాధనకు తెలంగాణ పార్టీలన్నీ ఒక వేదికమీదకు వచ్చాయి. ఐక్య ఉద్యమానికి అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సన్నద్ధమయ్యారు. అసెంబ్లీలో తెలంగాణ ప్రాంతానికి చెందిన అన్ని పార్టీల ఎమ్మెల్యేల మధ్య సమన్వయం కోసం తెలంగాణ ఎమ్మెల్యేల కన్వీనర్‌గా శ్రీధర్‌బాబును ఎంపిక చేశారు. ఈనెల 23 వరకూ సభలో తెలంగాణ ఎమ్మెల్యేలు సమన్వయంతో పని చేయాలని నిర్ణయించారు. ముసాయిదా బిల్లుపై ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలను స్పీకర్‌కు లిఖిత పూర్వకంగా తెలుపుతారు. అవే ప్రతులను రాష్టప్రతికి అందజేయాలని నిర్ణయించారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలు సభ జరగకుండా అడ్డుకుంటున్న తీరుపట్ల నిరసన వ్యక్తం చేస్తూ అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. ఐక్య ఉద్యమం కోసం శుక్రవారం జరిపిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ, మంత్రులు కె జానారెడ్డి, గీతారెడ్డి, శ్రీ్ధర్‌బాబు, పొన్నాల లక్ష్మయ్యలు పాల్గొన్నారు. అదేవిధంగా ఎంపి అంజన్‌కుమార్ యాదవ్, కాంగ్రెస్, తెరాస, బిజెపి, టిడిపి పార్టీల తెలంగాణ ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగే సూచనలు కనిపించడం లేదని, దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రాంతానికి చెందిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలు లిఖిత పూర్వకంగా బిల్లుపై అభిప్రాయాలను స్పీకర్‌కు అందజేయాలని నిర్ణయించారు. మంత్రి కె జానారెడ్డి నాయకత్వంలో తెలంగాణ ఎమ్మెల్యేల సమావేశం మినిస్టర్స్ క్వార్టర్‌లోని క్లబ్ హౌస్‌లో శుక్రవారం జరిగింది. అసెంబ్లీ సమావేశాల సందర్భాంగా అన్ని పార్టీల ఎమ్మెల్యేలు సమావేశం కావాలని గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈరోజు సమావేశమయ్యారు.
శ్రీధర్‌బాబు నుంచి శాసన సభావ్యవహారాల శాఖను తొలగిస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని సమావేశం ఏకగ్రీవంగా ఖండించింది. ప్రాంతాలకు అతీతంగా తెలంగాణ కోసం ఏకం కావాలని, ఐక్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సమావేశంలో నిర్ణయించారు. తెలంగాణ ఏర్పాటు చేస్తున్నందుకు సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు మెదక్ జిల్లాలో నిర్వహిస్తున్న బస్సుయాత్రను వాయిదా వేసుకోవాలని సమావేశంలో సూచించారు. ముఖ్యమంత్రి వైఖరికి నిరసనగా తెలంగాణ మంత్రులు రాజీనామా చేస్తే బాగుంటుందని తెరాస ఎమ్మెల్యేలు సూచించగా, మంత్రులు వద్దని వారించారు. తెలంగాణ మంత్రులంతా రాజీనామా చేస్తే సభను సీమాంధ్ర ఎమ్మెల్యేలకు అప్పగించినట్టవుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలిపారు. ఈనెల 23వరకు అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున అప్పటి వరకు మరే కార్యక్రమానికి వెళ్లకుండా తెలంగాణ ఎమ్మెల్యేలంతా తప్పనిసరిగా సభలో ఉండాలని నిర్ణయించారు. పార్టీల ప్రయోజనం గురించి ఆలోచించడం కన్నా తెలంగాణ సాధనకు ప్రాధాన్యత ఇవ్వాలని టిడిపి ఎమ్మెల్యే దయాకర్‌రావు సూచించారు. అన్ని పార్టీల్లోని తెలంగాణ ఎమ్మెల్యేల మధ్య సమన్వయం కోసం అసెంబ్లీ ఫ్లోర్ కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. ఈ కమిటీ ద్వారానే అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం గురించి ఎప్పటికప్పుడు చర్చించుకోవాలని నిర్ణయించారు. ముసాయిదా బిల్లు తిరిగి రాష్టప్రతికి చేరేంత వరకు తెంలగాణలో ఏ పార్టీ కూడా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని నిర్ణయించుకున్నారు.
సమావేశాలకు తెలంగాణ ఎమ్మెల్యేంతా తప్పనిసరిగా హాజరు కావాలని నిర్ణయించినట్టు సమావేశం అనంతరం జానారెడ్డి తెలిపారు. సీమాంధ్ర నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, తెలంగాణ ఏర్పాటు ఆగదని టిఆర్‌ఎస్ శాసన సభాపక్షం నాయకుడు ఈటెల రాజేంద్ర తెలిపారు. సీమాంధ్ర ప్రాంతానికి ఏంకావాలో ఆ ప్రాంత నాయకులు చెబితే బాగుంటుంది కానీ అలా చెప్పకుండా సీమాంధ్ర నేతలు తమ ప్రాంత ప్రజలను కూడా మోసం చేస్తున్నారని ఈటెల వ్యాఖ్యానించారు. సభలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలను శ్రీ్ధర్‌బాబు సమన్వయ పరుస్తారని తెలిపారు. సభలో చర్చ జరిగితే సరే, లేదంటే అందరి అభిప్రాయాలను లిఖిత పూర్వకంగా అందజేయనున్నట్టు తెలిపారు. అందరం తెలంగాణ కోసం ఏకం కావాలని ఒకరినొకరు విమర్శించుకోవడం మానుకోవాలని టిడిపి తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. పార్టీల కోసం కాకుండా తెలంగాణ కోసం పని చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. అవసరమైతే తెలంగాణ ఎమ్మెల్యేలంతా ఢిల్లీ వెళ్లి ఇక్కడి విషయాలు రాష్టప్రతికి వివరిస్తారు. ముఖ్యమంత్రి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని బిజెపి ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో మంత్రుల శాఖలు మార్చడం దుర్మార్గమని మండిపడ్డారు. తెలంగాణను సర్వనాశనం చేసిన ఆంధ్రానాయకత్వం చివరకు సభలో చర్చించడానికి సైతం అవకాశం ఇవ్వడం లేదని విమర్శించారు. సభలో చర్చ జరగకపోతే తెలంగాణ ఎమ్మెల్యేలంతా ఢిల్లీ వెళ్లి రాష్టప్రతిని కలవాలని నిర్ణయించినట్టు నాగం తెలిపారు. (చిత్రం) పార్టీలకు అతీతంగా ఉద్యమ నిర్వహణకు సన్నద్ధమైన తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు