
28 సంవత్సరాల రోషినీ బారోత్- అంతవరకూ జీవితంలో మాంసా హారం వాసన కూడా చూడ లేదు. బర్మింగ్‌హామ్‌లోని బుల్‌రింగ్ ప్రాంతం లో వున్న అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘నన్‌డోస్’ రెస్టారెంట్‌లో డిసెంబర్ 29న నకనకలాడే ఆకలితో పోయి కూర్చొని- తనకు యిష్టమయిన శాకాహారం స్పెషల్ వంటకం- బాగా వేచిన ‘హాలేమీ చీజ్ పిట్టా’ ప్లస్ ‘పెరిపెరి సాలాడ్’- ఆర్డర్ చేసింది. ‘పిట్టా’ అంటే పిట్టంత రొట్టె. హాలేమీ అంటే గొర్రెపాలతో విరిచిన జున్ను.
సరే! ఆమె ‘పిట్ట’ వచ్చింది. ఈలోగా స్నేహితురాలితో మాటల్లో పడ్డదామె. ఆ ‘పిట్ట’ని సగం తిన్నాకా, అనుమానం వచ్చింది. నిజమే! అది చికెన్ పిట్టా- జున్ను పిట్టా కాదు. నిలువునా నీరుకారిపోయింది. క్రక్కేసింది. జుట్టు పీక్కుంది. ఏడుపు లంకించుకుంది. ‘‘వ్రతభంగం అయింది మొర్రో!’’మంది. 28 సంవత్సరాలు పరమ శాకాహారం మాత్రమే భుజించాను. ‘‘గర్వంగా నేను లైఫ్‌లో నాన్‌వెజ్ ముట్టలేదని చెప్పేదాన్ని. ఇక నేనెక్కడ చావనురో!’’ అంటూ క్రుంగిపోయింది.
రెస్టారెంట్ మ్యానేజర్ నుంచి సర్వర్‌దాకా అపాలజీ యిచ్చారు. ‘‘కూరొండుకోనా? మీ అప్పాలజీలతో? అవెందుకు నాకూ? నా రుూ శరీరం నాది కాదనిపిస్తోంది’’ అంటూ, యింటికి పోయి కూడా మంచాన జ్వరంతో కూలిపోయింది. కుమిలిపోయింది.
ఈ రోషినీ మిడ్‌ల్యాండ్‌కి చెందిన ‘టావెడేల్’లోనే ఒక హిందూ (బ్రాహ్మల) కుటుంబం మధ్య, కేవలం పరమ శాకాహారం- పప్పూ, పెరుగూ, పులుసూ లాంటివి తిని, పెరిగి పెద్దయింది (మన దేశంలో కాదండోయ్! ఇంగ్లాండ్‌లో వున్నదా ఫ్యామిలీ). ఇప్పుడు బర్మింగ్ హామ్ యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తోంది. మర్నాడు ఆఫీసుకు పోయినా- ఏడుపు ఆగలేదు. తొందరగా పర్మిషన్ పడేసి- యింటికి పోయి తల పట్టుక్కూర్చుంది. ‘‘ఈ ‘పిట్టా’ని నేనెలా భరించగలను?’’ అంటూ కడుపు రుద్దుకుంది. ‘‘సగం చికెన్ వెళ్లిందా రుూ పాడు పొట్టలోకి’’ అంటూ ఫ్రెండ్స్‌ని అడిగింది.
‘‘ఇలాంటి మిస్టేక్ మరెన్నడూ చెయ్యం మాడమ్!’’ ఆ ‘రెస్టారెంట్’ చెప్పింది. మళ్లీ నేను మీ ‘నన్‌డోస్’ వైపు తొంగిచూస్తే కదా? ఛస్తే రాను’’ అన్నది రోషినీ బారోత్. ‘వ్రతమూ చెడింది- ఫలమూ దక్కలేదు’- పాపం, ఆమెకి! ‘దేవుడా! నీకు దయలేదు’...
*