‘శీతాకాలాన్ని’ కొనసాగించే యోచన
ఆప్ దెబ్బతో మారిన యూపీఏ వ్యూహం
అవినీతి నియంత్రణపై రాహుల్ దృష్టి
ఆరు బిల్లుల ఆమోదానికై పట్టు
ప్రజా విశ్వాసం సాధించే ప్రయత్నం
================
న్యూఢిల్లీ, జనవరి 5: టి.బిల్లుతోపాటు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ మేరకు అవినీతిని అరికట్టేందుకు ఉద్దేశించిన పలు బిల్లుల ఆమోదానికై ఫిబ్రవరి రెండోవారంలో మూడు రోజులు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూపీఏ సంకీర్ణ ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను మొదట ఫిబ్రవరి 3నుంచి జరపాలని అనుకున్నా, మారిన వ్యూహం మేరకు 10నుంచి ప్రారంభించే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు. పార్లమెంటు శీతాకాల ప్రత్యేక సమావేశాలు కేవలం మూడు రోజులపాటు కొనసాగించాలని భావిస్తున్నా, అవసరమైన పక్షంలో వీటిని అలాగే కొనసాగించి ఓట్ ఆన్ అకౌంట్‌ను ఆమోదించుకునేంత వరకూ పొడిగించే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఆం ఆద్మీ విజయంతో ఆలోచనలో పడిన పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ను ప్రజల వద్దకు తీసుకుపోయేందుకు అవినీతి పోరాటాన్ని వేదికగా మార్చుకోవాలని యోచిస్తున్నారు. లోకపాల్ వ్యవస్థను ఏర్పాటు చేసిన పూర్తి ఘనత కాంగ్రెస్‌కు కట్టబెట్టటంతోపాటు దీనికి అనుబంధంగా మరో ఆరో బిల్లులకు పార్లమెంటు ఆమోదముద్ర వేయించుకోవాలని యోచిస్తున్నారు. అవినీతికి సంబంధించి ముందస్తు సమాచారం ఇచ్చే వారికి రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన ‘ది విజిల్‌బ్లోవర్స్ ప్రొటెక్షన్ బిల్ 2011, ది జ్యుడీషియల్ స్టాండర్డ్స్ అండ్ అకౌంటబిలిటీ బిల్ 2010, ది రైట్ ఆఫ్ సిటిజన్ ఫర్ టైంబౌండ్ డెలివరీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ రిడ్రెస్సల్ ఆఫ్ దేర్ గ్రీవెన్స్ బిల్ 2011, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అమెండ్‌మెంట్ బిల్ 2013, పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ బిల్ 2012, ది ప్రివెన్షన్ ఆఫ్ బ్రైబరీ ఆఫ్ ఫారిన్ పబ్లిక్ అఫీషియల్స్ అండ్ అఫీషియల్స్ ఆఫ్ పబ్లిక్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ బిల్ 2011’లకు పార్లమెంటు ఆమోదముద్ర వేయించుకోవాలని రాహల్ గట్టి పట్టుదలతో ఉన్నారు. అవినీతిని అరికడతామని పదేపదే చెప్పే బదులు అవినీతిని అరికట్టేందుకు అవసరమైన అన్ని చట్టాలను రూపొందించామని ప్రజలకు చెప్పటం అర్థవంతంగా ఉంటుందని రాహుల్ వర్గం వాదిస్తోంది. లోక్‌పాల్‌తోపాటు పై ఆరు బిల్లులకూ చట్టరూపం ఇవ్వటం ద్వారా ప్రజా విశ్వాసాన్ని సాధించుకునేందుకు ప్రయత్నించాలన్నది వారి ఆలోచన. ఈ లక్ష్య సాధన కోసమే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని రాహుల్ సంకీర్ణ ప్రభుత్వాధినేతలకు స్పష్టం చేశారని అంటున్నారు.
రాష్ట్ర శాసన సభ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ముసాయిదా బిల్లును ఈనెల 25 తరువాత కేంద్ర కేబినెట్ ద్వారా రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి పంపించాల్సి ఉంటుంది. రాష్ట్ర శాసనసభ తెలంగాణ బిల్లుపై చర్చ జరపటంలో విఫలమైనందున రాష్టప్రతి నుంచి అదనపు సమయం అడిగే అవకాశాలు మృగ్యమయ్యాయి. అంటే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు జనవరి 25నాటికి ఢిల్లీకి తిరిగి వస్తుంది. యూపీఏ సంకీర్ణ ప్రభుత్వం తెలంగాణ ముసాయిదా బిల్లుపై ఈ నెలాఖరున కేంద్ర మంత్రివర్గంలో చర్చిస్తుంది. ఆ తరువాత రాష్టప్రతి ద్వారా పార్లమెంటుకు పంపించే ఏర్పాట్లు చేస్తుంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు లేదా ప్రత్యేక సమావేశాలు ఫిబ్రవరి మూడు తరువాత ఎప్పుడు జరిగినా అవినీతిని అరికట్టేందుకు ఉద్దేశించిన బిల్లుతోపాటు తెలంగాణ ముసాయిదా బిల్లును చర్చకు చేపట్టేందుకు వీలుంటుందని అంటున్నారు.
‘శీతాకాలాన్ని’ కొనసాగించే యోచన ఆప్ దెబ్బతో మారిన యూపీఏ వ్యూహం
english title:
parliament
Date:
Monday, January 6, 2014