పర్యవేక్షణపై ‘ప్రత్యేక’ కసరత్తు
మొదటి దశ పనులకు ప్రణాళిక
నేడు ఉన్నత స్థాయి అధికారుల సమావేశం
================
హైదరాబాద్, జనవరి 5: హైదరాబాద్ శివార్లలో ఏర్పాటు చేయనున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్విస్టిమెంట్ రీజియన్ (ఐటిఐఆర్)కు అవసరమైన వౌలిక సదుపాయాల కల్పనకు త్వరలో ప్రత్యేక సాధికార సంస్థ నెలకొల్పనున్నారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రత్యేక అథారిటీ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వౌలిక సదుపాయాల సంస్థ (ఏపిఐఐసి) ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నారు. ఈనెల 6న ఈమేరకు ప్రభుత్వం ఉన్నతాధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రణాళికను ఖరారు చేయనున్నట్టు సమాచారం. ఐటిఐఆర్‌కు ఏపిఐఐసి నోడల్ ఏజన్సీగా పనిచేయనుంది. హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న రంగారెడ్డి జిల్లాలో పోచారం, గచ్చ్భిలి, శంషాబాద్ ప్రాంతంలో ఐటిఐఆర్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీంతో రియాల్టీ రంగానికి రెక్కలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ప్రత్యేక అథారిటీ పరిధి కిందకు ఐటిఐఆర్‌ను తీసుకురావడం వల్ల అంతర్జాతీయ వౌలిక సదుపాయాలను ఉన్నత ప్రమాణాలతో నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. మొత్తం 202 చ.కి.మీ విస్తీర్ణంలో ఐటిఐఆర్ విస్తరించి ఉంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖల పరిధిలో ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేస్తారు. పెట్రోలియమ్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ ఇన్విస్టిమెంట్ రీజియన్ గుజరాత్ తరహాలో ఐటిఐఆర్‌ను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. 1990 దశకంలో హైటెక్ సిటీని ఏర్పాటు చేసినప్పుడు సైబరాబాద్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. దీనివల్ల మాదాపూర్, గచ్చ్భిలి ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి కోసం హైదరాబాద్ ఎయిర్ పోర్టు డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. కాగా వీటన్నింటినీ ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీలో విలీనం చేసిన విషయం విదితమే. హెచ్‌ఎండిఏ ప్రణాళికకు అనుసంధానంగా ఏపిఐఐసి త్వరలో ఐటిఐఆర్‌కు ఒక మాస్టర్ ప్లాన్‌ను రూపొందించనుంది. 202 చ.కిమీ అంటే దాదాపు 49,912 ఎకరాలను ఐటిఐఆర్ కింద నోటిఫై చేస్తూ త్వరలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇప్పటికే హెచ్‌ఎండిఏ, జిహెచ్‌ఎంసిలను సమాచార టెక్నాలజీ, కమ్యూనికేషన్ శాఖ ఎంఎంటిఎస్ రైలుమార్గం సర్వీసులను ప్రతిపాదిత ఐటిఐఆర్ వరకూ విస్తరించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వాల్సిందిగా కోరడం విశేషం. ఫలకనుమా నుంచి ఉందానగర్- శంషాబాద్ వరకూ ఎంఎంటిఎస్ సర్వీసుకు అనుమతి లభించింది. ఐటిఐఆర్ పరిధిని పర్యవేక్షించే ప్రత్యేక అథారిటీ పరిధిలోనికే భవనాలకు అనుమతులు, భూవినియోగం, వౌలిక సదుపాయాల కల్పన, రోడ్లు, తాగునీటి సరఫరా, మురికి నీటి వ్యవస్ధ, ఆస్తి పన్ను తదితర అంశాల పర్యవేక్షణకు అప్పగిస్తారు. ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీస్ తరహాలో ఐటిఐఆర్‌ను తీర్చిదిద్దే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం రెండు నెలల కిందట హైదరాబాద్‌కు ఐటిఐఆర్‌ను మంజూరు చేసిన విషయం విదితమే. ఇందులో ఐదు జోన్లు ఉంటాయి. సైబరాబాద్ పరిసరాలు ఒకటవ జోన్ పరిధిలోనికి, శంషాబాద్, మహేశ్వరం రెండవ జోన్, ఉప్పల్, పోచారం మూడవ జోన్‌గా, సైబరాబాద్ నుంచి శంషాబాద్, అంతర్జాతీయ విమానాశ్రయం వరకూ ఔటర్ రింగ్ రోడ్డు వెంట నాల్గవ జోన్, శంషాబాద్ విమానాశ్రయం నుంచి పోచారం వరకు ఔటర్ రింగ్ రోడ్డు వెంట ఐదవ జోన్‌గా వర్గీకరించారు. మొత్తం 202 చ.కిమీ పరిధిలో 40 శాతం భూభాగాన్ని ప్రోసెసింగ్ ఏరియాగా ప్రకటించనున్నారు. అంటే దాదాపు 16 వేల ఎకరాల్లో ఆఫీసు స్పేస్‌గా వినియోగిస్తారు. మిగిలిన 25 వేల ఎకరాలను హౌసింగ్, ఆసుపత్రులు, విద్య, రిక్రియేషన్, కమర్షియల్ యూజ్‌గా ఉపపయోగిస్తారు. మొదటి దశను 2013-18 మధ్య పూర్తి చేస్తారు. మిగిలిన దశను అనంతరం చేపట్టనున్నారు. మొదటి దశ కింద నాలుగు వేల ఎకరాల్లో ఐటిఐఆర్‌ను అభివృద్ధి చేసేందుకు రంగం సిద్ధం చేస్తారు. ఈ ఎకరాల్లో రోడ్లను, మిగిలిన వౌలిక సదుపాయాలను ఏపిఐఐసి నిర్మిస్తుంది.
పర్యవేక్షణపై ‘ప్రత్యేక’ కసరత్తు
english title:
itir
Date:
Monday, January 6, 2014