
ఎపిఎన్జీవో ఎన్నికలు * భారీ మెజార్టీ కైవసం * ఏకపక్షంగానే ఫలితాలు
ఇక సమైక్య ఉధృత ఉద్యమం: అశోక్‌బాబు
గెలుపు ఎవరిదైనా సమైక్యమే: బషీర్
==================
హైదరాబాద్, జనవరి 5: ఎపిఎన్జీవో సంఘం ఎన్నికల్లో అశోక్‌బాబు ప్యానల్ ఘన విజయం సాధించింది. ఆయన ప్యానల్ భారీ మెజారిటీతో విజయబావుట ఎగురవేసింది. ఎన్నికల ఫలితాలు పూర్తిగా ఏకపక్షంగా సాగడంతో పోలైన ఓట్లలో దాదాపు 90శాతం ఓట్లను అశోక్‌బాబు ప్యానల్ కైవసం చేసుకుంది. అశోక్‌బాబుకు 638 ఓట్ల, ప్రత్యర్థి అభ్యర్థి బషీర్‌కు 164 ఓట్లు పోలయ్యాయ. అశోక్‌బాబు ప్యానెల్ నుంచి ప్రధాన కార్యదర్శి ఎన్ చంద్రశేఖర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిచారు. ఈ సందర్భంగా ఎన్జీవోల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన అశోక్‌బాబు మీడియాతో మాట్లాడుతూ సమైక్య ఉద్యమాన్ని రెట్టించిన ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్తామని, అన్ని పార్టీలను కలుపుకుని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. సమైక్యంధ్ర విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని, బిల్లును అడ్డుకుంటామన్నారు. ఈనెల 16నుంచి ఉద్యమ స్వరూపం మారుతుందన్నారు. మరోసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడంతోపాటు ఉద్యోగులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఓటమి చెందిన షేక్ అబ్దుల్ బషీర్ మాట్లాడుతూ గెలుపోటముల కంటే, ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడేందుకు, రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు కలిసి పనిచేస్తామని ప్రకటించారు.
సమైక్య ఉద్యమానికి సారథ్యం వహించి ఉద్యమ సెగను కేంద్రానికి తగిలేలా చేయడంతోపాటు ఉద్యోగులకు గతంలో ఎన్నడూలేనంతగా ఐఆర్ సాధించిన అశోక్‌బాబే తమ నాయకుడని ఉద్యోగులు ఓట్లతో స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైన మొదటి రౌండ్ నుంచే అశోక్‌బాబు ప్యానల్ భారీ అధిక్యాన్ని సాధిస్తూ అలవోకగా విజయతీరాల వైపు దూసుకెళ్లింది. అశోక్‌బాబు ప్యానల్ భారీ మెజారిటీతో ఘన విజయం సాధించడంతో ఆయన మద్దతుదారుల ఆనందానికి అవధులు లేకుండాపోయింది. మొదటి రౌండ్ నుంచే ఎన్నికల ఫలితాలు 90:10 ఓట్ల శాతం తేడాతో ముందుకు సాగడంతో అశోక్‌బాబు వర్గీయుల్లో రెట్టింపు ఉత్సాహం కనబడింది. సాయంత్రం 6 గంటల నుంచి అశోక్‌బాబు మద్దతుదారులు భారీగా కార్యాలయానికి చేరుకున్నారు. ఒక్కో రౌండ్ ఫలితాలు వెలువడుతుంటే డప్పు వాయిద్యాల మధ్య నృత్యాలు చేస్తూ, బాణాసంచా కాల్చుతూ, మిఠాయిలు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు. దీంతో ఎపిఎన్జీవో కార్యాలయం కేరింతలతో నిండిపోయింది. ఎన్నికల ఫలితాలలో అశోక్‌బాబు ప్రత్యర్థి షేక్ బషీర్ ప్యానల్‌కు పరాభవం ఎదురైంది. ఎలాగైనా అధ్యిక్షపీఠం నుంచి అశోక్‌బాబును గద్దె దించాలన్న వారి వ్యూహం బెడిసికొట్టింది. పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఎపిఎన్జీవో హోంలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే 13 జిల్లాలకు చెందిన 16యూనిట్ల ఉద్యోగులు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. దీంతో ఎపిఎన్జీవో ప్రాంగణంలో సందడి నెలకొంది. మధ్యాహ్నం 3 గంటల వరకూ పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. 16 యూనిట్లలో 847 ఓట్లు ఉండగా పోలింగ్ సమయం ముగిసే సరికి 815 ఓట్లు పోల్ అయ్యాయి. 3.30 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకావాల్సి ఉండగా, కాస్త ఆలస్యంగా 4.30కు లెక్కింపు మొదలైంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి హనుమంతరావు పర్యవేక్షణలో రెండు ప్యానెళ్ల మధ్య ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కాగా పోలింగ్ మొదలైనప్పటి నుంచే ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయని తెలిసిపోయింది. దీంతో ఉదయం నుంచే అశోక్‌బాబు వర్గీయుల్లో ఆనందం, బషీర్ వర్గీయుల్లో నిరుత్సాహం కనిపించింది. (చిత్రం) ఫలితాల అనంతరం విజయ సంకేతాన్ని చూపుతున్న ఎపిఎన్జీవో నేత అశోక్