
ఈ కాలంలో ట్రెండీగా ఉండటం చాలా ముఖ్యం. పదిమందితో సత్సంబంధాలు పెట్టుకోవడంకన్నా కొత్త గాడ్జెట్స్‌తో సావాసం చేయడం బెటర్ అనేది నేటి యువత ఆలోచన. మింగ మెతుకులేదు గానీ మాటాడ్డానికి స్మార్ట్ఫున్ అని ఎవరో అన్నట్టు.. లోకం అంతా స్పీడే. అంతా స్మార్టే. అప్పుడే 2013 అయిపోయింది. 2014 వచ్చేసి వారమైపోతోంది. మరి ఈ 2014లో డబ్బులెలా తగలెయ్యవచ్చు, సారీ, ఎలా వాడేసి కొత్త గాడ్జెట్సు కొనేయవచ్చు అనేది పాయింటు. అదలా ఉంచిదే, 2014లో ఐటి ట్రెండ్స్ ఎలా ఉండవచ్చో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
2014లో ఐటి రంగంలో రెండు అంశాలు కీలకం కానున్నాయి. మొదటిది మొబిలిటీ, రెండోది అనలెటిక్స్. అంటే, మొబైల్ ఫోన్ సంస్థలు డేటా సంస్థలతో చెట్టపట్టాలేసుకుంటాయన్నమాట. ఎందుకటా అంటారేమో- 2013లో మొబిలిటీకి మంచి ప్రాచుర్యాన్ని తెచ్చింది స్మార్ట్ఫోనూ, టాబ్లెట్లే. అలాగే 2013లో ఈ డేటా అనలిటిక్స్ అనేది కూడా మంచి ప్రాచుర్యానే్న పొందింది. మరి ఈ రెండూ కలిస్తే... అనే ఏకీకరణ ఆలోచనకు ప్రతిరూపమే 2014 అన్నమాట. అంతేకాదు, మన డ్రాయింగ్ రూమ్ నుంచి ఆటోమొబైల్స్ దాకా అంతా వినూత్నంగానే ఉండబోతున్నాయంతా. ఆటోమొబైల్ రంగం ఐటి సాయంతో అనూహ్యమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. స్మార్ట్ అండ్ కనెక్టెడ్ కార్లు నిజం కాబోతున్నాయి. ఎక్కడున్నా స్టే కనెక్టెడ్ అనేదే నినాదం. అన్నీ రియల్ టైంలోనే ఉంటాయి, జరుగుతాయి, చూస్తాయి, కొండొకచో మాట్లాడతాయి కూడా. ప్రజలు కోరిందే మనం చేద్దాం అని కంపెనీ, వాళ్లు చేసేదే మనం చూద్దాం అని ప్రజలు పోటాపోటీగా పనిచేసేస్తున్నారు(యి).
కేవలం స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ మాత్రమే 2014లో మార్పులు తెస్తాయనుకోవటం పొరబాటే. వేరబుల్ గాడ్జెట్స్ అంటే ధరించడానికి వీలుగా ఉండే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ 2014లో దుమారాన్ని లేపవచ్చంటున్నారు విశే్లషకులు. ఇవి చేతికి కడియాల్లాగా, గాజుల్లాగా, కళ్ళద్దాల్లా (గూగుల్ గ్లాసెస్, ఫిట్ బిట్ ఫ్లెక్స్, సామ్సంగ్ గెలాక్సీ గేర్ వంటివి) మెడలో దండల్లా పలు రకాలుగా ఉండొచ్చు. ఎందుకంటే, 2014లో ఈ రకం గాడ్జెట్స్ దాదాపు 100 మిలియన్ల డాలర్ల బిజినెస్ చేయవచ్చని అంచనా.
మీకు తెలుసో తెలీదో, నైక్ ఫ్యూయల్ అనే ఒక ఉపకరణం మన నిత్య జీవనశైలిలో భాగం కానుంది. ఇది మనం చేసే ప్రతి పనినీ, మన ప్రతి కదలికనీ పసిగట్టేస్తుంది(ట). అన్నట్టు బిజినెస్‌లో శత్రువులున్నా, ప్రజలనుంచి డబ్బులు దండుకోవడానికి అందరూ ఒక్కటే అన్నట్టు, ఈ 2014లో ఆటోమొబైల్ సంస్థలూ, హెల్త్‌కేర్ సంస్థలూ, ఐటి సంస్థలతో చేయి కలపబోతున్నాయి. తద్వారా ఆయా గాడ్జెట్స్ డేటా అనలెటిక్స్ వంటి సేవలనూ, సౌకర్యాలూ వాడేలా లేదా ఇచ్చేలా చూడాలన్నది గేమ్ ప్లాన్. గార్టనర్ సంస్థ ఈ మధ్య 2014లో టాప్ 10 టెక్నాలజీలేమిటనే అంశాన్ని హైలెట్ చేస్తూ ఒక నివేదికను తెచ్చింది. స్ట్రేటజిక్ టెక్నాలజీస్ అనేవి రాబోయే 3 ఏళ్ళలో కీలకమనీ, వాటిని అమలు చేయడానికి బోల్డు డాలర్ల పెట్టుబడి పెట్టాల్సి వస్తుందనీ, ఒకవేళ పెట్టుబడికి ఆయా సంస్థలు వెనుకాడితే ఎంతో నష్టపోవాల్సి వస్తుందనీ అభిప్రాయపడింది. ఈ స్ట్రేటజిక్ టెక్నాలజీస్ అనేవి 5 ఏళ్ల దాకా కీలక పాత్రను వహిస్తాయనీ చెప్పింది గార్ట్‌నర్. గార్ట్‌నర్ ప్రకారం టాప్ 10 ఐటి ట్రెండ్స్ ఇవీ- 1.మొబైల్ డివైజెస్‌లో భిన్నత్వం, వాటి నిర్వహణ (ఎవరి డివైజ్ వారిదే వగైరా), 2.మొబైల్ అప్లికేషన్స్‌లో జావా స్క్రిప్ట్, హెచ్‌టిఎంఎల్ 5ల వాడకం, 3.దేన్లోనైనా ఇంటర్నెట్ వాడకం, 4.క్లౌడ్, క్లయింట్ కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్, 5.వ్యక్తిగత క్లౌడ్ సౌకర్యం, 6.సాఫ్ట్‌వేర్ నిర్వచించిన (డేటా సెంటర్, స్టోరేజ్, నెట్‌వర్క్) ఏదైనా సరే, 7.వెబ్ స్కేల్ ఐటి, 8.స్మార్ట్ మెషీన్ శకం, 9.త్రీడీ ప్రింటింగ్, 10.హైబ్రిడ్ క్లౌడ్, ఐటి యాజ్ సర్వీస్ బ్రోకర్.
వీటిల్లో ఏవి హిట్‌మంటాయో, ఏవి ఫట్‌మంటాయో తెలియాలంటే, మనం ఈ 2014 సంవత్సరమంతా వేచి చూడాల్సిందేనంటున్నారంతా. మరేం జేస్తాం సార్- లెటజ్ వెయిట్ అండ్ సీ.
తెలుసుకోవాల్సిన సంగతి
---------------
నాట్(ఔట్) గ్రిడ్
ఉరుము ఉరిమి మంగళం మీద పడిందని సామెత. ఈ వేళ్రేపూ ప్రపంచంలో ఎక్కడ చూసినా, రేపులూ, మర్డర్లూ కామన్ అయిపోయాయి. ప్రమాదాలు, కాల్పులు, ఉగ్రదాడులు సరేసరి. 1976లోనే ముత్యాలముగ్గు అలోవలో కాంట్రాక్టరు అంటాడు- ‘‘ఎదవ పేనాలెవరికి కావాలయ్యా, అద్దణాకు మూడు అమ్ముతాను’’ అని. అంత చవకైపోయింది ప్రాణాలంటే. అందువల్లటా, మన దేశంలో నాట్ గ్రిడ్ అనే ప్రాజెక్టను చేపట్టబోతున్నార(ట). దీనితో ఐటి మరింత ప్రమాదకారి అని తేలిపోవడం ఖాయం అంటున్నారు విశే్లషకులు. ఎందుకంటే, ఆధార్ కార్డు వివరాలు, పాన్ కార్డు వివరాలను మొదలుకుని, సదరు కార్డు ఓనరు బాంకు అకౌంటు లావాదేవీలూ, పెట్టుబడులూ, క్రెడిట్ కార్డు వ్యవహారాలూ, బీమా పాలసీలూ, ప్రయాణ రిజర్వేషన్ లావాదేవీలూ, పాస్‌పోర్టు వివరాలూ, విమానయానాలూ- ఓజ్, ఒక్కటేమిటి, ఒక్క టాయిలెట్‌కు పోవడం, స్నానం చేయడం వంటి వివరాలు తప్ప అన్నిటిపైనా నిఘా ఉంచాలని భావిస్తున్నారు మూడో నేత్రంగల నిఘా శాఖ వారు. ఇలాటి సమాచారం వారి దగ్గర ఉంటే ఇక ఉగ్రదాడులనేవి తగ్గిపోతాయని వారంటుంటూంటే, సామాన్య ప్రజలు మాత్రం బెంబేలెత్తిపోవడం ఖాయం అంటున్నారు ఈ సంగతంతా చూస్తున్నవారు. ఎందుకంటే, ఇప్పటికే సైబర్ చౌర్యాలూ, నేరాలూ ఎక్కువైపోయి సైబర్ ప్రపంచంలో భద్రత తగ్గిపోయిందనేది అందరికీ తెలిసిందే. మరి ఈ నాట్ గ్రిడ్ లాంటిది వస్తే ఇక సామాన్యుడికి భద్రత అస్సలుండంతే అంటున్నారంతా.
నెట్‌న్యూస్
---------
ఇంటర్నెట్‌కు స్వాతంత్య్రం లేదా?
లేదనే అంటున్నారంతా. మీకు గుర్తుండే ఉంటుంది జీమెయిలూ, ఆ మెయిలూ, క్లౌడ్ స్టోరేజి, ఫేస్‌బుక్కూ- ఏదైనా సరే- సమాచారం ఉంచేటపుడు జాగ్రత్తగా ఉన్నా, ఆ సమాచారం సీక్రెట్‌గా మాత్రం ఉండదని. ఆమధ్య ఫోన్ టాపింగ్‌కన్నా, నెట్ ఎకౌంట్స్ టాపింగే మిన్న అన్న వార్త గుప్పుమంది కదా. అమెరికా ఎవర్నీ నమ్మద(ట). అందుకని జీమెయిలూ, ఆ మెయిలూ, క్లౌడ్ స్టోరేజీ, ఫేస్‌బుక్కూ అన్నిటినీ గాలించేసి, ఎవరైనా తనకు వ్యతిరేకంగా పనే్జస్తున్నారా అంటూ గూఢచర్యం చేయడంలో రెండాకులు ఎక్కువ తిని ఇంటర్నెట్ మీద పడింది. కాదేదీ నిఘాకి అనర్హం అంటూ, ఇంటర్నెట్ తన గుప్పిట్లోకి తెచ్చుకుంది. అందుకే మనవాళ్ళు కూడా జాగ్రత్తపడాలి. మన డేటా మన దేశంలోనే ఉండాలి. మన వెబ్‌సైట్స్, డేటా స్టోరేజీ అన్నీ మన దేశంలోనే ఉండాలి, అంటున్నారంతా. అసలు ఇంటర్నెట్టుకు స్వాతంత్య్రం రావాలి. అమెరికా నియంత్రణ తొలగాలి అంటున్నారు మనవాళ్లు. ఈ విషయాన్ని చైనా, రష్యాలాంటి దేశాలు కూడా గుర్తించాయి. అందుకే ఇండియా అన్నమాటలకు సపోర్టునిస్తున్నాయి అని ఒక వార్త.
షార్ట్‌కట్స్
----------
( ఫోటో షాప్ 7.0 టైప్)
Shift+End లైను అంతమైందని (ఎండ్ ఆఫ్ లైన్) ఎచుకోడానికి
Ctrl+Shift+End స్టోరీ అంతమైందని (ఎండ్ ఆఫ్ స్టోరీ) ఎంచుకోడానికి
Ctrl+Shift+Home కొత్త స్టోరీ అని ఎంచుకోడానికి
Shift+Home కొత్త లైను అని ఎంచుకోడానికి
సామెత
------
కొత్త సంవత్సరం వచ్చినా పాత పీసీయేనా..