
కోల్‌కతా, జనవరి 6: లైంగిక వేధింపుల అభియోగాలు ఎదుర్కొంటున్న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎకె గంగూలీ ఎట్టకేలకు పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల సంఘం చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈమేరకు ఆయన రాష్ట్ర గవర్నర్ ఎంకె నారాయణన్‌ను సోమవారం కలిసి రాజీనామా పత్రం సమర్పించినట్టు అధికార వర్గాల సమాచారం. గవర్నర్‌తో భేటీ అనంతరం రాజీనామా విషయమై విలేఖరులు ప్రశ్నించగా ‘నో కామెంట్’ అని గంగూలీ ముక్తసరిగా బదులిచ్చారు. 2012 డిసెంబర్‌లో గంగూలీ తనను లైంగికంగా వేధించారంటూ ఓ మహిళా న్యాయవాది ఫిర్యాదు చేయడంతో సుప్రీం కోర్టుకు చెందిన ముగ్గురు న్యాయమూర్తుల కమిటీ ప్రాథమిక విచారణ జరిపింది. గంగూలీని దోషిగా భావిస్తూ కమిటీ నివేదిక సమర్పించింది. అయితే లైంగిక వేధింపుల సంఘటనకు ముందే ఆయన సుప్రీం కోర్టులో పదవీ విరమణ చేయడంతో ఏ చర్య తీసుకోలేమని కమిటీ అభిప్రాయపడింది. కాగా బాధితురాలి ఫిర్యాదులోని వివరాలను అదనపు సొలిసిటర్ జనరల్ ఇందిరా జైసింగ్ బహిర్గతం చేయడం మరింత వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో బెంగాల్ మానవ హక్కుల సంఘం చైర్మన్ పదవికి రాజీనామా చేయాలంటూ పలు రాజకీయ పార్టీలతోపాటు వివిధ వర్గాల నుంచి గంగూలీపై ఒత్తిడి అధికమైంది. ఆయనను పదవి నుంచి తొలగించాలంటూ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్టప్రతికి రెండుసార్లు లేఖలు రాశారు. రాష్టప్రతి సలహా మేరకు గంగూలీని పదవి నుంచి తొలగించాలని కొద్దిరోజుల క్రితం కేంద్ర మంత్రివర్గం సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకోవడమే మేలని గంగూలీ రాజీనామా సమర్పించినట్టు తెలుస్తోంది.