
న్యూఢిల్లీ, జనవరి 6: ముంబయిపై జరిగిన ఉగ్రవాద దాడికి సూత్రధారులుగా భావిస్తున్న డేవిడ్ హెడ్లీ, ఆయన అనుచరుడు తహవ్వూర్ రాణా, లష్కరే తోయిబా సంస్థాపకుడు హఫీజ్ సరుూద్, లఖ్వీలపై ఢిల్లీ కోర్టు సోమవారం తాజాగా నాన్‌బెయిలబుల్ వారంట్లు జారీ చేసింది. ఈ నలుగురు సహా మొత్తం తొమ్మిది మంది ఇంకా పరారీలో ఉన్నారని, వారిపై గతంలో జారీ చేసిన ఎన్‌బిడబ్ల్యులను ఇంతవరకూ అమలు చేయలేదని జాతీయ దర్యాప్తు ఏజెన్సీ (ఎన్‌ఐఎ) స్పష్టం చేసింది. దాంతో జిల్లా న్యాయమూర్తి మెహతా తాజా వారెంట్లను జారీ చేశారని కోర్టు వర్గాలు తెలిపాయి. హెడ్లీ, రాణా, సరుూద్, లఖ్విలతో పాటు పాకిస్తాన్ సైనికాధికారులు మేజర్ ఇక్బాల్, సమీర్ అలీ, అల్‌ఖైదా మిలిటెంట్ ఇలియాస్ కాశ్మీరీ, సాజిద్ మాలిక్, మాజీ సైనికాధికారి అబ్దుల్ రెహ్మాన్ హష్మీలపై కూడా ఢిల్లీ కోర్టు ఎన్‌బిడబ్ల్యులు జారీ చేసింది. వీరిలో ఇలియాస్ కాశ్మీరీ అమెరికా డ్రోన్ దాడుల్లో మరణించినట్టుగా భావిస్తున్నారు. 2011 డిసెంబర్‌లోనే వీరిపై ఎన్‌ఐఎ చార్జిషీట్లు దాఖలు చేసింది.