
న్యూఢిల్లీ, జనవరి 6: ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి విధానసభ నిర్ణయం వెలువడేంత వరకూ సవాలు పిటిషన్లను విచారణకు స్వీకరించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. విభజనకు సంబంధించి ఇటు విధానభ, అటు పార్లమెంట్ నిర్ణయం వెలువడిన తరువాతే న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిందిగా జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు, జస్టిస్ బోబ్డేతో కూడిన బెంచి తేల్చి చెప్పింది. హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది పివి కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పిటిషన్ పరిపక్వ దశకు చేరుకోనందున విచారణకు స్వీకరించటం సాధ్యపడదని తెలిపింది. విభజనను వ్యతిరేకిస్తూ ఇంతకుముందు కూడా కృష్ణయ్య, తెలుగుదేశం శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్, పారిశ్రామికవేత్త రఘురామచంద్ర రాజు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం ఈ వాదనతోనే కొట్టివేసింది. ఇటు విధానసభ అటు పార్లమెంట్ పరంగా ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం వెలువడనందున పిటిషన్లను విచారణకు స్వీకరించటంలో అర్థంలేదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. ఇంతకుముందే విభజనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. విభజనను వ్యతిరేకిస్తూ తాను దాఖలు చేసిన పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించినందున దీన్ని విచారణకు చేపట్టాలంటూ కృష్ణయ్య చేసిన అభ్యర్థనను సుప్రీం బెంచి తిరస్కరించింది. రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయం కారణంగా పూర్తిస్థాయిలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని కృష్ణయ్య స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల్లో కూడా విభజన డిమాండ్లు వచ్చినప్పటికీ, వాటిని రాజకీయ కారణాలతో కేంద్రం పట్టించుకోలేదని వాదించారు. కాగా, అసెంబ్లీ నిర్ణయం తరువాతే ఆశ్రయించాలంటూ సుప్రీం సూచన మేరకు కృష్ణయ్య తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.