
కిరణ్, చంద్రబాబు గైర్హాజరు
సమైక్య తీర్మానం చేస్తేనే సహకరిస్తాం: వైకాపా
తెలుగుదేశంలోనూ విభిన్న వాదనలు
సభలోనే ఫ్లోర్‌లీడర్ల అభిప్రాయం కోరండి:
స్పీకర్‌కు బొత్స, ఆనం, శైలజానాథ్ సూచన
-----------------------
హైదరాబాద్, జనవరి 6: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు-2013పై అసెంబ్లీలో చర్చ కొనసాగించే విషయంలో ఇంకా ‘రచ్చ’ కొనసాగుతోంది. సభ్యుల సహకారంతో చర్చను సజావుగా జరిపేందుకు సోమవారం అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తన ఛాంబర్‌లో నిర్వహించిన శాసనసభా వ్యవహారాల సలహా సంఘం (బిఎసి)లోనూ ఏకాభిప్రాయం కుదరలేదు. స్పీకర్ మనోహర్ అధ్యక్షతన సుదీర్ఘంగా జరిగిన బిఎసి సమావేశానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ మనోహర్ మాట్లాడుతూ రాష్టప్రతి పంపించిన బిల్లుపై ఈనెల 23వరకే సమయం ఉన్నందున అందరూ చర్చించాలని, సభకు సహకరించాలని కోరారు. వైఎస్సార్సీపీ నాయకురాలు వైఎస్ విజయమ్మ, పార్టీ సభ్యురాలు శోభా నాగిరెడ్డి సమైక్యాంధ్రనే కొనసాగించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేయాలని పట్టుబట్టారు. ఆవిధంగా తీర్మానం చేస్తే ముసాయిదా బిల్లుపై చర్చకు సహకరిస్తామన్నారు. సమైక్య తీర్మానం చేయకపోతే సహకరించేది లేదని తేల్చి చెప్పారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించే వారిని సభనుంచి సస్పెండ్ చేసి చర్చ జరిపించాలని తెరాస శాసనసభాపక్షం నాయకుడు ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే టి హరీష్‌రావు స్పీకర్‌ను కోరారు.
ఇలాఉండగా తెలుగుదేశం విభిన్న వాదనలు వినిపించింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేయాలని సీమాంధ్రకు చెందిన టిడిపి ఎమ్మెల్యే ఒకరు కోరగా, ముసాయిదా బిల్లును చర్చించకుండా వెనక్కి పంపాలని సీమాంధ్రకు చెందిన మరో ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. బిల్లు సమగ్రంగా లేదని, సమగ్ర సమాచారం వచ్చిన తర్వాతే చర్చిద్దామని మరో ఇద్దరు చెప్పగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సానుకూలంగా సభ్యులందరూ చర్చించి రాష్టప్రతికి పంపించాలని తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. ఇలా వివిధ రకాల అభిప్రాయాలను టిడిపి ఎమ్మెల్యేలు వ్యక్తం చేశారు. దీంతో ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ శైలజానాథ్ కల్పించుకుని ఇంతమందితో కాకుండా కేవలం అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను మాత్రమే పిలిపించుకుని చర్చించాల్సిందిగా స్పీకర్‌ను కోరారు. అలా కుదరని పక్షంలో నేరుగా అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన తర్వాత సభలోనే అన్ని పార్టీల శాసనసభాపక్షం నాయకుల అభిప్రాయాలు తీసుకోవాల్సిందిగా శైలజానాథ్ స్పీకర్‌కు సూచించారు. బిఎసిలో చెప్పిన దానికి ఆయా పార్టీల సభ్యులు సభలో కట్టుబడి ఉండటం లేదని శైలజానాథ్ అన్నారు. దీనిని అధిగమించాలంటే అదొక్కటే మార్గమని ఆయన తెలిపారు.
రెండు పర్యాయాలు.. నాలుగు గంటలు
స్పీకర్ మనోహర్ అధ్యక్షతన సోమవారం రెండు పర్యాయాలు బిఎసి జరిగింది. సోమవారం ఉదయం భేటీలో మూడు గంటల పాటు చర్చించారు. తర్వాత మధ్యాహ్నం సుమారు గంటపాటు చర్చించినా ఫలితం కనిపించలేదు. ఎవరి పంథా, ఎవరి వ్యూహం వారిదే అన్నట్టు సాగింది.
అసలు చర్చ ప్రారంభమైందా..?
ఉదయం జరిగిన బిఎసి సమావేశంలో మజ్లిస్ పక్షం నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ టి ముసాయిదా బిల్లుపై అసలు చర్చ ప్రారంభమైందా? లేదా? స్పష్టంగా చెప్పాలంటూ ప్రశ్నించారు. చర్చ ప్రారంభమైందని ఒక మంత్రి, ప్రారంభం కాలేదని మరో మంత్రి చెబుతూ అయోమయానికి గురి చేస్తున్నారన్నారు. చర్చ ప్రారంభం కాలేదని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శైలజానాథ్ తెలిపారు. కాగా ప్రభుత్వ చీప్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి కల్పించుకుని చర్చను లోగడ దుద్దిళ్ళ శ్రీ్ధర్ బాబు ప్రారంభించారని చెప్పారు. అక్బర్ కల్పించుకుని ఈ భిన్న వాదనలే అయోమయాన్ని కలిగిస్తున్నాయన్నారు. అప్పుడు స్పీకర్ మనోహర్ జోక్యం చేసుకుని చర్చ ప్రారంభమైందని తెలిపారు.
వీరు ఎవరు..?: అక్బర్ ప్రశ్న
మజ్లిస్ పక్షం నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ శైలజానాథ్‌ను కంగు తినిపించారు. బిఎసి సమావేశంలో మంత్రి శైలజానాథ్ ఉండటంతో ‘వీరు ఎందుకు వచ్చారు.. బిఎసిలో సభ్యుడు కాదు కదా?’ అని ప్రశ్నించారు. దీంతో స్పీకర్ మనోహర్ కల్పించుకుని శైలజానాథ్ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి అని చెప్పారు. అందుకు అక్బర్ స్పందిస్తూ ఆ విషయం మాకు తెలియదు కదా! అన్నారు. ఈ విషయం పత్రికల్లో వచ్చిందని స్పీకర్ చెప్పగా, పత్రికల్లో వచ్చిన వాటిని ఎలా నమ్ముతాం. మీరూ బులిటెన్ విడుదల చేయలేదు కదా? అని అక్బర్ ప్రశ్నించారు. స్పీకర్ మాట్లాడుతూ హడావుడిగా మార్పు జరిగిందని, దానిని అంత పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని సర్ది చెప్పారు.
అలా చేస్తే మంచిదే..: బొత్స
బిఎసిలో ఏకాభిప్రాయం కుదరనందున అసెంబ్లీలోనే అన్ని పార్టీల శాసనసభాపక్షం నాయకులను ముసాయిదా బిల్లు చర్చపై అభిప్రాయాలు తెలియజేయాలని స్పీకర్ కోరాలని మంత్రులు ఆనం రాంనారాయణ రెడ్డి, శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఈ అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నానని పిసిసి చీఫ్, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి, ప్రభుత్వ విప్ అనిల్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ చర్చ జరిపే విషయంలో కాంగ్రెస్‌లో ఏకాభిప్రాయం ఉందన్నారు. స్పీకర్ మనోహర్ టి.ముసాయిదా బిల్లుపై సవరణలు ఏవైనా ఉంటే ఇవ్వమని కోరారని, చర్చకు అవకాశం రావడం లేదు కాబట్టి సభ్యులు తమ అభిప్రాయాలను లిఖిత పూర్వకంగా తెలియజేయవచ్చని వారన్నారు. కాగా సభకు అడ్డుపడుతున్న వారిని సస్పెండ్ చేయాలని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, హరీష్‌రావు, బిజెపి ఎమ్మెల్యేలు యెండల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. సభా నాయకుడైన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు బిఎసికి హాజరుకాక పోవడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. (చిత్రం) స్పీకర్ అధ్యక్షతన సమావేశమైన శాసనసభా వ్యవహారాల సలహా సంఘం సభ్యులు