హైదరాబాద్, జనవరి 6: రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా జనవరిలోనే రాష్ట్ర బడ్జెట్‌లో ఓట్ ఆన్ అకౌంట్ ప్రస్తానం ప్రారంభం కానుందా! అధికారుల నుంచి దీనికి సంబంధించి సంకేతాలు అందుతున్నాయి. జనవరి నెలాఖరులోనే ఓట్ ఆన్ అకౌంట్‌ను ప్రవేశపెట్టి ప్రధాన బాధ్యతను ముందుగానే నిర్వర్తించాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నట్టు సమాచారం. ఇప్పుడున్న షెడ్యూల్ మేరకు జనవరి 23న తెలంగాణ బిల్లుపై శాసనసభ చర్చా సమావేశాలు ముగుస్తాయి. తరువాత రెండు రోజులు విరామమిచ్చి ఓట్ ఆన్ అకౌంట్‌కు మళ్లీ సమావేశం కావాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన ఆలోచన కార్యరూపం దాల్చితే 27న శాసనసభను తిరిగి సమావేశ పరిచే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. గతంలో ఎన్నికల సంవత్సరంలో ఎప్పుడూ ఫిబ్రవరిలో ఓట్ ఆన్ అకౌంట్‌ను ప్రవేశపెట్టి మూడు నెలలకు ఆమోదింపచేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు కూడా ఫిబ్రవరిలోనే ఓట్ ఆన్ అకౌంట్‌ను సభ ముందు ఉంచాలని భావించినప్పటికీ, రోజురోజుకూ మారుతున్న రాజకీయ పరిణామాలు, రాష్ట్ర విభజన వేడి నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్‌ను ముందుగానే సభ ముందు ఉంచేలా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి త్వరగా ఓట్ ఆన్ అకౌంట్ పత్రాలు సిద్ధం చేయాలని, బడ్జెట్‌ను కూడా త్వరగా తయారు చేయాలని ఆర్ధిక శాఖకు సూచనలు వెళ్లినట్టు సమాచారం. నాలుగైదు రోజులపాటు సభను సమావేశపర్చి ఓట్ ఆన్ అకౌంట్‌కు ఆమోదం పొందేలా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికీ కొంతమంది మంత్రులు ఫిబ్రవరిలోనే ఓట్ ఆన్ అకౌంట్‌ను ప్రవేశపెడితే బాగుంటుందన్న భావాన్ని వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. తొందరపాటు అడుగులుకన్నా, ఫిబ్రవరి వరకూ వేచి చూడాలన్న భావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి త్వరలోనే తుది నిర్ణయాన్ని తీసుకుంటారని ఆయన సన్నిహిత మంత్రి ఒకరు వెల్లడించారు. ఇదే సమయంలో బడ్జెట్‌ను ఎప్పుడు ప్రవేశపెట్టినా కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఆర్ధిక శాఖ అధికారి కూడా వ్యాఖ్యానించారు.
ఇలా ఉండగా, సభలో ఓట్ ఆన్ అకౌంట్‌కు ఆమోదం పొందిన వెంటనే ముఖ్యమంత్రి రాజీనామా అంశం కూడా చర్చకు రావొచ్చని అంటున్నారు. వాస్తవంగా మేథోమథనం సమీక్షల్లోనే రాజీనామా అంశం చర్చకు వస్తుందని భావిస్తున్నప్పటికీ, నిర్ణయం మాత్రం ఓట్ ఆన్ అకౌంట్ ఆమోదం పొందిన వెంటనే తీసుకుంటారని ముఖ్యమంత్రి సన్నిహితులు చెబుతున్నారు.
సభ ముగిసిన రెండు రోజుల విరామంతో ‘ఓట్ ఆన్ అకౌంట్’ నెలాఖరుకు ఆమోదించుకునే యోచన
english title:
budget
Date:
Tuesday, January 7, 2014