
నేటి మధ్యాహ్నం అంత్యక్రియలు
మృతిపై న్యాయవిచారణకు బ్రాహ్మణ సంఘాల డిమాండ్
==================
హైదరాబాద్, జనవరి 6: పరిశ్రమలోకి అడుగు పెట్టిన తొలి రోజుల్లోనే హిట్లు కొట్టి లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న హీరో ఉదయ్ కిరణ్ (33) ఆదివారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలోని ఆయన స్వగృహంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని తుది శ్వాస విడిచాడు. ఉదయ్ మృతదేహాన్ని అభిమానుల సందర్శనార్థం మంగళవారం ఉదయం రెండు గంటలపాటు ఫిల్మ్ చాంబర్‌లో ఉంచుతారు. అనంతరం మధ్యాహ్నం ఇఎస్‌ఐ శ్వశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఉదయ్ కిరణ్ 2012 అక్టోబర్ 24న విషితను వివాహమాడారు. గత కొంతకాలంగా ఆయనకు సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడంతో తీవ్ర మనోవేదన అనుభవిస్తున్నారు. దీనికితోడు ఆర్థిక సమస్యలు కూడా వొత్తిడి పెంచటంతో ఎటూ పాలుపోని స్థితిలో డిప్రెషన్‌కులోనై ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆయన తీవ్ర మనోవేదనలో ఉన్నారని, ఒకప్పుడు స్టార్ హీరోగా వెలిగిన తనకు సినిమా రంగం విలువ ఇవ్వట్లేదన్న బాధలో ఉన్నట్టు తెలుస్తోంది. చాలా రోజులుగా సినిమా చాన్స్‌లు లేకపోవడం, ఒకటి రెండు తమిళ సినిమాలు చేసినా అవి కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో ఆయన మరింత ఆత్మన్యూనతకు గురయ్యారు. ఇటీవలే ఒక తమిళ సినిమా ఆఫర్ కూడా చేజారడంతో తనకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందని భార్య విషిత వద్ద అనేకసార్లు బాధ పడినట్టు తెలుస్తోంది. ఉదయ్ కిరణ్ తల్లి నిర్మల కొనే్నళ్ల క్రితం చనిపోయారు. తరువాత ఆయన తండ్రి వివికె మూర్తి మరో పెళ్లి చేసుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగి ఆరేళ్లుగా వీరి మధ్య మాటలు లేవు. చిన్న వయస్సులో వివిధ కోణాల్లో ఒత్తిళ్లు పెరగటంతో కొద్దికాలంగా ఆయన తీవ్ర మనోవేదనతో ఉన్నారు. అయితే, ఆదివారం ఉదయ్ కిరణ్ భార్య విషిత తల్లిదండ్రులతో కలిసి ఓ ఫంక్షన్‌కు వెళ్లారు. ఆలస్యంగానైనా ఫంక్షన్‌కు వచ్చి తనను ఇంటికి తీసుకెళ్తానన్న భర్త ఎంతకీ రాకపోవడంతో ఆమె రెండు మూడు పర్యాయాలు ఫోన్ చేసినా ఫలితం లేకపోయింది. దీంతో అనుమానం వచ్చి హుటాహుటిన ఇంటికొచ్చి చూడగా అప్పటికే ఉదయ్ కిరణ్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొరుగువాళ్ల సాయంతో రాత్రి ఒంటిగంట సమయంలో బంజారాహిల్స్‌లోని ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన తుది శ్వాస విడిచారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య వార్త తెలిసిన వెంటనే నటులు శ్రీకాంత్, ఆర్యన్ రాజేష్, ప్రిన్స్, తరుణ్, శివాజీరాజా తదితరులు ఆసుపత్రికి తరలివచ్చారు.
అనుమానస్పద మృతిగా కేసు నమోదు
ఉదయ్ కిరణ్ భార్య విషిత ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. డిసిపి సత్యనారాయణ, ఏసిపి అశోక్‌కుమార్‌లు ఘటనా స్థలిని పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి వివరాలు సేకరించారు. ఘటనా స్థలం నుంచి ఉదయ్ కిరణ్ సెల్‌ఫోన్, కళ్లద్దాలు, చెప్పులు స్వాధీనం చేసుకున్నారు. ఉదయ్ కిరణ్ అత్తామామలను విచారించి భార్యాభర్తల మధ్య కలహాలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో విచారించారు. అనంతరం డిసిపి సత్యనారాయణ మాట్లాడుతూ సినిమా అవకాశాలు లేకపోవడంతో మానసిక వ్యధకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోందన్నారు. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు. ఉదయ్ కిరణ్ చివరిసారిగా రాత్రి 10.30 గంటల సమయంలో చెన్నైకి చెందిన తన మిత్రుడు భూపాల్‌కు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పాడని తెలుస్తోంది. దీంతో పోలీసులు ఉదయ్ కిరణ్ కాల్ డేటా ఆధారంగా చివరిగా ఎవరితో మాట్లాడారన్న దానిపై ఆరా తీస్తున్నారు. పోస్ట్‌మార్టం రిపోర్టు వచ్చాక తదుపరి విచారణ మొదలుపెడతామన్నారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం ఉదయ్ కిరణ్ భౌతికకాయాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఉదయ్ కిరణ్ అక్కా బావ మస్కట్‌లో ఉండటంతో, వారు వచ్చే వరకూ మృతదేహాన్ని భద్రపరచడానికి పోస్ట్‌మార్టం అనంతరం పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఉస్మానియా, నిమ్స్ వద్ద అభిమాన నటుడి కడసారి చూపుకోసం అభిమానులు భారీ సంఖ్యలో హాజరై కన్నీటి పర్యంతమయ్యారు.
రెండు కులాల ఆధిపత్యంతోనే..:
బ్రాహ్మణ సంఘాల ఆరోపణ
సినిమా రంగాన్ని రెండు కులాలు రాజ్యమేలుతున్నాయని, వారు మిగతా వారిని ఎదగనీయకుండా అణచివేస్తున్నారని రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆరోపించింది. ఉస్మానియా ఆసుపత్రి వద్ద సంఘం నేత ద్రోణంరాజు రవికుమార్ మాట్లాడుతూ వర్ధమాన నటులను ఎదగనీయకుండా సినిమా రంగంలోని రెండు కులాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఉదయ్ కిరణ్ మానసిక మాంద్యానికిలోనై ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. ఇండస్ట్రీలో వర్ధమాన తారల ఆత్మహత్యలకు గల కారణాలపై ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై విచారణ జరిపించాలంటూ ఒక న్యాయవాది అరుణ్‌కుమార్ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఉదయ్ కిరణ్ నేత్రదానం
ఉదయ్ కిరణ్ నిజ జీవితంలోనూ హిరో అనిపించుకున్నారు. తాను మరణించినా తన కళ్లు మరొకరి జీవితంలో వెలుగులు నింపాలని ఉదయ్ కిరణ్ ఆయన భార్య విషితతో చెప్పినట్టు తెలిసింది. దీంతో ఆయన కోరికమేరకు ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్యులు ఉస్మానియా ఆసుపత్రికి వచ్చి ఉదయ్ కిరణ్ నేత్రాలను సేకరించారు.