
హైదరాబాద్, జనవరి 6: సమైక్యాన్ని కోరుకునే సభ్యులంతా విభజన బిల్లు వ్యతిరేకించాలని ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని, సీమాంధ్ర ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయమని తెలిపారు. మూడో దఫా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామన్నారు. రెండు మూడు రోజుల్లో మరోసారి రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవడంతోపాటు ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎపిఎన్జీవో సంఘం నూతన కార్యవర్గ మొదటి సమావేశం సోమవారం ఉదయం సంఘం కార్యాలయంలో జరిగింది. సమావేశం అనంతరం అశోక్‌బాబు, సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్ చంద్రశేఖర్‌రెడ్డి, కోశాధికారి వీరేంద్రబాబు తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. పండగలోపే అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడంతోపాటు ఉద్యోగ సంఘాలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. పండగ తర్వాత ఉద్యమం తీవ్రతరం చేస్తామని అందులోకి అన్ని రాజకీయ పార్టీలు వస్తాయా? దూరంగా ఉంటాయా? అన్న దాన్నిబట్టి తమ ఉద్యమ కార్యచరణ ఉంటుందని పేర్కొన్నారు. సంక్రాంతి పండగ రోజుల్లోనూ గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలలో సమైక్యంపై అవగాహన కల్పిస్తామన్నారు. ముందు ప్రకటించినట్టుగానే తమ కార్యాచరణ యథాతథంగా కొనసాగుతుందన్నారు. సమైక్య ఉద్యమంలో మరణించిన దాదాపు 22మంది ఉద్యోగుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పారు. ఫిబ్రవరి నెల జీతం నుంచి ఒక్కో ఉద్యోగి జీతం వంద రూపాయల చొప్పున సేకరించి ఐదు లక్షలకు తగ్గకుండా సాయం అందిస్తామని చెప్పారు. కడప వంటి కొన్నిచోట్ల కొన్ని రాజకీయ పార్టీలు స్థానిక నాయకత్వాన్ని బెదిరించి, ప్రలోభపెట్టడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడిందన్నారు. కడప ఘటనపై విచారణకు కమిటీ వేశామన్నారు. అలాగే హెల్త్ కార్డులపై ఉద్యోగులకు తీవ్ర అసంతృప్తి ఉందని చెప్పారు. ఉద్యోగులు ఆశించినట్టుగా హెల్త్‌కార్డులు లేవన్నారు. ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హెల్త్‌కార్డులపై సానుకూలంగా ఉన్నప్పటికీ కిందిస్థాయి అధికారుల సమన్వయ లోపంతో భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసి ఉద్యోగులు కోరినట్టుగా హెల్త్‌కార్డులు మంజూరు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
మంచి పిఆర్సీ ఇప్పిస్తాం: చంద్రశేఖర్‌రెడ్డి
తమపై నమ్మకంతో ఊహించని మెజార్టీతో ఎన్నుకున్నందుకు ఎపిఎన్జీవో సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్ చంద్రశేఖర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులకు మంచి పిఆర్సీ, కోరుకున్నట్టుగా హెల్త్‌కార్డులు ఇప్పించడంతోపాటు కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్ధీకరణకు సర్వశక్తులు ఒడ్డుతామని ఆయన తెలిపారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని ఓడిపోయిన ప్యానల్ కూడా కలుపుకుని రాష్ట్ర సమైక్యం, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తామని ఆయన చెప్పారు. అనంతరం విశాఖపట్టణం జిల్లాలో సమైక్య ఉద్యమాన్ని ముందుండి నడిపిన సంఘం కార్యదర్శి రిటైర్డ్ ఉద్యోగి టి గోపాలకృష్ణను సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.