న్యూయార్క్, జనవరి 7: వీసా దరఖాస్తులో తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై అరెస్టయిన భారత దౌత్యాధికారిణి దేవయాని ఖోబ్రగాదెపై అభియోగాలు నమోదుకు గడువు దగ్గర పడుతుండటంతో, గడువును మరో నెలపాటు పొడిగించాలని దేవయాని కోర్టును కోరారు. అయితే ఆమె అభ్యర్థనను ప్రాసిక్యూషన్ తిరస్కరించింది. న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌లో డిప్యూటీ కాన్సుల్ జనరల్‌గా పని చేస్తున్న దేవయానిని తన పనిమనిషి కోసం దాఖలు చేసుకున్న వీసా దరఖాస్తులో తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై గత నెల 12న అరెస్టు చేయడం తెలిసిందే. నిబంధనల ప్రకారం ఆమెపై 30 రోజుల్లోగా అంటే ఈనెల 13లోగా కోర్టులో అభియోగాలు నమోదు చేయాల్సి ఉంది. అయితే గడువు దగ్గర పడుతుండటం వల్ల సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఇరుపక్షాల మధ్య జరుగుతున్న సంప్రదింపులపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నందున గడువును మరో నెలపాటు పొడిగించాలని దేవయాని తరఫు న్యాయవాది న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్ జడ్జి సారా నెట్‌బమ్‌కు సోమవారం రాత్రి దాఖలు చేసుకున్న అభ్యర్థనలో కోరారు. గడువు పొడిగింపునకు సంబంధించి తాను ప్రాసిక్యూషన్ కార్యాలయంతో మాట్లాడానని, అయితే తాము గడువును పొడిగించాలని కోర్టును కోరబోమని ప్రాసిక్యూషన్ తెలిపిందని దేవయాని తరఫు న్యాయవాది డేనియల్ అర్షక్ ఆ అభ్యర్థనలో పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి ఇరుపక్షాల మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నందున అర్థవంతమైన సంప్రదింపులు జరిగేలా చూడటం కోసం గడువును పొడిగించాలని ఆయన ఆ అభ్యర్థనలో కోర్టును కోరారు. అయితే అర్షక్ అభ్యర్థనపై ప్రాసిక్యూషన్ అధికారి ప్రీత్ భరారా స్పందిస్తూ గడువు పొడిగింపును తమ కార్యాలయం వ్యతిరేకిస్తోందని, అంతేకాకుండా అభియోగాలు నమోదు చేరిన తర్వాత కూడా చర్చలు కొనసాగించవచ్చని పేర్కొంటూ జడ్జికి లేఖ రాశారు. కాగా, సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని తాము కోరుకుంటున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మేరీ హర్ఫ్ మరోసారి స్పష్టం చేసారు.
దేవయాని అభ్యర్థన తిరస్కరించిన అమెరికా ప్రాసిక్యూషన్
english title:
g
Date:
Wednesday, January 8, 2014