ఆ విధంగా యమధర్మరాజు రధం అధిరోహించి ముద్గరములు, ప్రాసాయుధాలు పూని, ముందర మృత్యుదేవత నడువ, కాలదండం భీకరంగా మెరయ, కాలపాశం అగ్ని కల్పం అవుతూ ఇరువంకల అలర, హేమముద్గరం ఉపరిభాగాన వెలుగ- జగాలు కంపింప చనుదెంచసాగాడు. రోషభీషణుడైన ఆ అంతకుణ్ణి కనుగొని రాక్షస సేనలు పెను భీతితో పరుగులు వార దొడగాయి. కాని కించిత్తయినా చలింపని బాహుబలుడు దశగ్రీవుడిని ఎదుర్కొన్నాడు.
బలగర్వంతో ఎడనెడ మర్మముల అదరులంట నొప్పించాడు. అంత ఆ దశకంథరుడు మిక్కిలి రుష్టుడై అంతకుడిపైన అగ్ని కీలలు పర్వ శరములు పరపించాడు. యముడున్ను రావణుడు గుప్పించిన ఆ నిశిత విశిఖాలు ముక్క చెక్కలు ఒనర్చాడు. వివిధ శస్త్రాలతో రావణుడిని వివశుని చేశాడు. రావణుడున్ను క్షణంలోనే తెలిసి యముణ్ణి ఎదుర్కొన్నాడు.
యమధర్మరాజు హాసము చేసి ‘‘దశవదనుడా! అక్కటా! నీ పలుకులు- పంతాలు ఎటుపోయినాయి. రణభూముల్లో కర్కశ విక్రముడివి. మిన్నక మూర్ఛలు పోవుట నీకు ఉచితమా? అవని రాజులను అందర్నీ జయించి నాపై దండు వెడలి వచ్చావు.
నీ బలాన్ని నమ్ముకొని వసుధేశుల్ని గెలిచిన చందంగా నన్ను ఏ క్రియ గెల్వగలవు? గర్వంతో విజృంభించి ఎవరి మీదనైనా దాడి చెయ్యక కాచుకొని కూర్చున్న మృత్యువు చేరువకు రాదగునా? వరబలదర్పంతో ఎత్తివచ్చావు. ఇంక నువ్వు లంకకి మరలి చని జీవించుట హుళక్కి నీకు వరములు అనుగ్రహించి నిన్ను పెద్ద చేసిన ఆ బ్రహ్మదేవుడు నీకు అడ్డమైన నిలిచి ‘ఈ రావణుడిని కాపాడు’ అని కోరితే నిన్ను కాపాడుతాను.
దేవవిరోధివి. నిన్ను తెగటార్చివేస్తాను. ఏరికోరి నాతో అని సల్ప ఏతెంచావు. వీరుడివైతే పారిపోక నిలబడు. ప్రళయ సమయం నాటి అగ్ని శక్తి కల్గి నా కాలదండం ప్రకాశిస్తుంది. ఆ దండాన్ని సమంత్రకంగా నేను ప్రయోగిస్తే నిన్ను అనిలో అది తుదముట్టిస్తుంది’’ అని వచించాడు.
ఆ మాటలు ఆలించి దశాననుడు మహా కోపాగ్ని పెనుకొనగా, చలము వహించి, విజృంభించి ‘‘ఓ అంతకా! నిన్ను మున్ను బ్రహ్మదేవుడు ఉగ్ర కృత్యమందు కర్తగా నియోగించాడు. ఆ అహకారంతో నీకు నన్ను చెనక వశమా? నేను పూర్వం తపఃప్రౌఢి వరల పినాకిచే పాశుపతాస్త్రాన్ని పడశాను.
ఈనాడు నిన్ను ఆజిలో ఆ మహాస్త్రం బూడిద బుగ్గి చేసివేస్తుంది. నాకు యమదండమెంత? యముడెంత? యముడికి యముడినయి అరుదెంచాను. వేయి పలుకులు ఏల? నిజ పరాక్రమంతో నీతోపోరాడి విజయం కైకొంటాను’’ అని ఇర్వురున్ను మనముల క్రోధ సమగ్రులై పంతం పట్టి, వివిధయుధాలు నింగిని ముట్ట ఆభీలంగా ఏడు దినాలు దివిజులు దివినుంచి కాంచి కొనియాడ- సంగ్రామం సలుప పూనారు.
ఆ విషయం బ్రహ్మదేవుడు తెలిసికొని, సాంద్ర తేజస్వులు మునీశ్వరులు, సురసిద్ధ యక్ష గంధర్వ గణాలు కొలవ చనుదెంచాడు. ఆ బ్రహ్మాదులు తిలకిస్తూ వుండగానే రావణ బ్రహ్మ దిక్కులందు అంధ తమసం అలముకొన వడివడిగా శరపరంపరలు వర్షించాడు. పెనుకినుకతో వెక్కసంగా విశిఖాలు వింట తొడిగి, నాలుగు బాణాలు లక్షబాణాలు యముణ్ణి గురి చూసి ప్రయోగించాడు. అంత ఆ కాలాంతకుడు మొగాన కోపార్చి ముజ్జగముల్ని కాల్ప జూలునట్లు పుట్టగా, చూసి అమరులు ఆశ్చర్యపడ మృత్యు దేవత వీక్షించి ‘‘ఈ పాపకర్ముని, ఈ దురాత్ముణ్ణి ఈ రావణుని నేను నిర్జిస్తాను. నన్ను పంపవలసింది.
నేను క్రుద్ధుణ్ణి అయితే దశముఖుడననెంత? తలచి చూడ కనకకశిపుడు నిన్ను మీరలేక పలాయనం చిత్తగించాడు’’ అని పల్క యముడు సంతసించాడు. ఈ దుష్ట నిశాచరుణ్ణి చలము పూని నేనే సంహరిస్తాను’’ అని పలికాడు.
- ఇంకా ఉంది
ఆ విధంగా యమధర్మరాజు రధం అధిరోహించి
english title:
ranganatha
Date:
Wednesday, January 8, 2014