
ఈ లోకంలోని ప్రాణికోటిలో అనేక భేదాలు కనిపిస్తుంటాయి. మనుషులల్లో ఒకరు సన్నగా ఉంటే మరొకరు లావుగా ఉంటారు. ఒకరు అతి పొడుగుగా ఉంటే మరొకరు పొట్టిగా ఉంటారు. ఇలాంటి భేదానే్న మనం జంతుజాలంలోనూ చూస్తుంటాం. కొన్ని అతి ఎత్తుకు ఎగరగలిగేవి ఉంటే మరికొన్ని లేశమాత్రం కూడా ఎగురలేనివి ఉంటాయి. కొన్ని పర్వతాకారంలో ఉంటే మరికొన్ని ఆవగింజలో పావుభాగం అంతకన్నా శరీరాకారం లేనివి ఉంటాయి. అలానే వాటి శక్తి సామర్థ్యాలు అంతే కొన్ని కొండల్ని పిండి చేయగల శక్తి గలవి అయితే మరికొన్ని గట్టిగా గాలి ఊదితే ప్రాణాలు కోల్పోయేవీ ఉంటాయి. స్థిరములుగా అనుకొనే వృక్షజాలంలోనూ ఈ పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొన్ని ఆకాశాన్ని తాకేలాగున దేవదారు వృక్షాల్లాంటివి ఎత్తుగా పెరుగుతాయి. మరికొన్ని అడుగు ఎత్తున్న ఎదగకుండా ఉండిపోతాయి.కొన్ని భూమి మీద విస్తరించుకుంటే ఇంకొన్ని నీటిలో తమ ఆకారాన్ని విస్తరింపచేసుకొంటాయి.
ఇన్ని భేదాలున్న ఈ జీవకోటిని సృష్టించిన భగవంతుడు వాటి వాటి ఆహారసంపాదనకు ఏమాత్రం ఏ లోటు చేయలేదు. జంతుజాలంలో ఏ ప్రాణీ కూడా తన కడుపు నిండిన తర్వాత ఎంత పంచభక్ష్యాలతో కూడిన భోజన పదార్థం ఎదురైనా వాసనసైతం చూడదు. అలానే తమ తమ సంతానాలకు రెక్కలు వచ్చేవరకు ఇతర ప్రాణులనుండి, ప్రకృతి వైపరీత్యాల నుంచి అత్యంత భద్రంగా కాపాడుకున్నా వాటికి ఆహారానే్వషణాశక్తి రాగానే వాటిని వాటి వాటి ఇష్టాలకు వదిలేస్తాయి.
కాని ఇది మనుషులకు వర్తించడం లేదు. జీవకోటిలో అత్యంత బుద్ధి శాలిగా, అత్యంత యుక్తిపరుడుగా పేరుపొందిన మానవునికి భగవంతుడు బుద్ధి, విచక్షణ ఇచ్చాడు. మనిషి కూడా ఇతర ప్రాణులలాగే తమ వారసులను తయారు చేస్తారు. వారిని ప్రాణాధికంగా ప్రేమగా పెంచుతారు. సంతానాన్ని తయారు చేసి వారికి తమ శక్తియుక్తులన్నిటిని నేర్పుతూ తనకు చేతకానివి సైతం వారికి అలవడేనేర్పును సాధించుకొనే మార్గాలను చూపుతారు. వారి సంతానం తమ కన్నా ఎక్కువ నేర్పు నైపుణ్యాలను కలిగి ఉండడం చూచి పులకించిపోతారు. కాని, మనిషి మాత్రం తాను తనకు తన కుటుంబానికి అవసరమైన ఆహారానే్వషణ మొదలు పెట్టి తరతరాలకు తరగని గనులలాంటి ఆహారాన్ని సంపాదించి కూడబెట్టడం మాత్రం మానడు. పోనీ తన సంతానానికి వారు ఇక సంపాదించే నైపుణ్యాన్ని పుణికి పుచ్చుకోకర్లేదు అనుకొంటాడా అంటే పొరపాటే. వారి సంతానం తిరిగి అదే సంపాదనామార్గాన్ని చేపట్టి ఉన్నత శిఖరాలను చేరుకోవాలి. చేరుకోవడం కాదు అక్కడే స్థిరంగా సంపాదిస్తునే ఉండాలి అనుకొంటారు. ఈ నేపధ్యంలోనే పెద్ద చేప చిన్న చేపను మింగినట్లు పక్కవారిని ఎదగనీయకుండా చేస్తారు. అంతేకాదు తన మార్గానికి అడ్డువస్తే ప్రాణాలనుకూడా తీయడానికి వెనకాడడం లేదు. జీవకోటిలో ఉన్నతుడు, అత్యంత బుద్ధి శాలిగా పేరు తెచ్చుకొన్న ఈ మనిషి ఇక్కడ కుచించుకుపోతున్నాడు. పేడపురుగులాగా తాను తింటున్నది ఏమిటి అన్న జ్ఞానాన్ని సైతం కోల్పోతున్నాడు. స్వార్థం అనే భూతానికి లొంగిపోయి ఇతర జీవాలను పెరుక్కు తినేవానిగా మారే మనిషి, అణవణువు నిండి ఉన్న భగవంతుడు నిరంతరం చెవునిల్లు కట్టుకొని చెప్పేనీతిని వినలేక చెవిటి వాడు అవుతున్నాడు. భగవంతుడు సృష్టించిన ప్రకృతి చేసే నిస్వార్థ సేవాఫలాన్ని పొందుతూ కూడా దాన్ని గుర్తించలేని గుడ్డివాడు అవుతున్నాడు. బుద్ధి అనే అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని భగవంతుని బహుమతిగా తెచ్చుకొన్న మనిషి ఇతడా అని పంచభూతాలు ఆశ్చర్యంగా చూసేట్లు మసులుకుంటున్నాడు. ఎన్ని మంచిమాటలు వినిపించినా, ఎంతమంచి బుద్ధి గరిపినా ఒక్కటేలాగున ప్రవర్తిస్తూ జన్మనిచ్చిన భగవంతుడే కన్నీరు కార్చేటట్లు నడతను చూపుతున్నాడు. భగవంతుడే నడిచి వచ్చి ఏది ధర్మమో ఆచరించి చూపినా, ధర్మం ఇది అని బోధ చేసినా ఇంకా మనిషి మనిషితనాన్ని అలవర్చుకోలేకపోతున్నాడు. తాను బుద్ధిజ్ఞానాలు లేని జంతువులాగే ప్రవర్తిస్తున్నాడు. దీన్ని రూపుమాపేదెన్నడు? మనిషి మనిషిగా మసలగలిగేదెన్నడు. ఆలోచించి ఆచరించాల్సిన తరుణం ఆసన్నమైంది. భగవంతుని మెప్పించే కార్యాలు చేయడంలో ముందుండి పశుతత్త్వాన్ని విడనాడి పశుపతి తత్త్వాన్ని ఆకళింపుచేసుకోవాలి. నరుడు నారాయణుడు అవ్వాలి.