
న్యూఢిల్లీ, జనవరి 7: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నందువల్లే తెరాస, కాంగ్రెస్‌ల మధ్య అవగాహన కుదరటం లేదని ఏఐసిసి వర్గాలు అంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా తనను నియమించేందుకు అంగీకరిస్తేనే కాంగ్రెస్‌లో తెరాసను విలీనం చేయటం లేదా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు అంగీకరిస్తామని కెసిఆర్ డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది. కెసిఆర్ ప్రధాన డిమాండ్ కొత్త రాష్ట్ర ముఖ్యమంత్రి పదవేనని ఏఐసిసి వర్గాలు అంటున్నాయి. తెలంగాణ రాష్ట్రం తన నాయకత్వంలోనే అభివృద్ధి సాధించగలుగుతుందని ఆయన స్పష్టం చేస్తున్నట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్రం కోసం గత పది పనె్నండేళ్లుగా అవిశ్రాంతంగా పోరాడుతున్న తనను తొలి ముఖ్యమంత్రిగా నియమించటం పూర్తి న్యాయమని కెసిఆర్ వాదిస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు రాష్ట్ర శాసనసభ నుంచి తిరిగి రాగానే ఫిబ్రవరిలో పార్లమెంటులో ప్రతిపాదించాలని యోచిస్తోన్న హైకమాండ్, తెరాసను విలీనం చేసుకోవాలా? లేక ఆ పార్టీతో సీట్ల సర్దుబాటు చేసుకోవాలా? అనే అంశంపై సమాలోచనలు ప్రారంభించినట్టు చెబుతున్నారు. కాంగ్రెస్‌కు చెందిన రాష్టస్థ్రాయి, కేంద్రస్థాయి నేతలు తెరాస నాయకులతో తెరవెనుక చర్చలు సాగిస్తున్నట్టు తెలిసింది. రాష్ట్ర విభజన నేపధ్యంలో జరిగే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, తెరాసలు కలిసి పోటీ చేస్తే తెలంగాణలో మెజారిటీ లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటారనే అంచనాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, తెరాస విడివిడిగా పోటీ చేస్తే ఇద్దరికీ ఆశించిన సీట్లు రాకపోవచ్చని భావిస్తున్నారు. తెలంగాణ కోసం తెరాస పోరాటం చేస్తే, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసిన ఘనత తమకు దక్కుతుందని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నట్టు తెలిసింది. అత్యంత క్లిష్టమైన రాజకీయ పరిస్థితుల్లో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కాంగ్రెస్ కొనసాగించిన విషయాన్ని మర్చిపోకూడదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, తెరాసలు ఒక అవగాహనకు రావాల్సిన అవసరం ఎంతో ఉందని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, తెరాసలు విడివిడిగా పోటీ చేయటం ద్వారా పరస్పర నష్టం కలిగించుకునే బదులు కలిసి పోటీ చేయటం లేదా విలీనమైన అనంతరం ఒకటిగా పోటీ చేయటం ద్వారా మెజారిటీ స్థానాలు గెలుచుకోవచ్చని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. కాంగ్రెస్‌లో విలీనమయ్యేందుకు తెరాస ముందుకురాని పక్షంలో సీట్లు సర్దుబాటు చేసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. తెరాసతో సీట్ల సర్దుబాటు ఒక పట్టాన తేలకపోవచ్చని కూడా కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే తెరాస అధినేత మాత్రం విలీనం లేదా సీట్ల సర్దుబాటుపై మనసులో మాటను బైట పెట్టడం లేదు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన బిల్లును పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన తరువాతే విలీనం లేదా సీట్ల సర్దుబాటుకు చర్చించటం మంచిదంటూ రాజకీయ బెట్టు చేస్తున్నారు. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా తనను నియమించేందుకు కాంగ్రెస్ అంగీకరించేంత వరకూ ఆయన రాజకీయ బెట్టు కొనసాగిస్తారనే మాట వినిపిస్తోంది.