
హైదరాబాద్, జనవరి 7: టి.బిల్లుపై శాసనసభలో చర్చపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చర్చ జరిగితే లాభం ఉంటుందని ఎవరికి వారు అభిప్రాయపడటం గమనార్హం. చర్చ ఎలా జరగాలన్న అంశంపై ఎవరికి వారు తమతమ వర్గాలతో శాసనసభ ఆవరణలోని ఛాంబర్లలో విస్తృత చర్చలూ జరుపుతున్నారు. సభలో చర్చ ఎలా నిర్వహించాలన్న అంశంపై తమ వర్గ నేతలతో చర్చించారు. ముఖ్యమంత్రి కిరణ్ ఇదే అంశంపై మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, గంటా శ్రీనివాసరావు, రఘువీరారెడ్డి, పితాని సత్యనారాయణతోపాటు పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్‌కుమార్ వంటివారితోనూ చర్చించారు. చర్చ జరిగితే దానివల్ల కేంద్రంపైనా ఒత్తిడి తీసుకురావచ్చని, అందువల్ల అన్ని పార్టీలు చర్చకు సహకరించేలా చూడాల్సిన బాధ్యత ఉందని వ్యాఖ్యానించడం గమనార్హం. అన్ని పార్టీల నేతలతో మాట్లాడి వారు చర్చకు సహకరించేలా చూడాలని సహచర మంత్రులకు సూచించినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై తెలుగుదేశం, వైఎస్సార్సీపీ నేతలకు పిలుపునిచ్చే బాధ్యతను వారికి అప్పగించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను వందశాతం చర్చను కోరుకుంటున్నానని, సభలో చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యాఖ్యానించారు. అన్ని పార్టీలకు ప్రత్యేకంగా పిలుపునిస్తారా! అన్న ప్రశ్నకు ఆలోచిస్తానని చెప్పారు. అన్ని పార్టీలు చర్చకు సహకరించాలనే కోరుతున్నట్టు వెల్లడించారు.
కాగా, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సిహం కూడా సభలో జరగాల్సిన చర్చ, సభలో అనుసరించాల్సిన వ్యూహంపై కొంతమంది తెలంగాణ మంత్రులు, తెరాస నేతలతో భేటీ అయ్యారు. సభలో ముఖ్యమంత్రి సమైక్యవాదాన్ని వినిపిస్తే తాను విభజన వాదాన్ని వినిపిస్తానని తేల్చిచెప్పారు. ఇదే సమయంలో బిల్లుపై, బిల్లులోని అంశాలపై ఓటింగ్‌కు అంగీకరించాలా! లేదా అన్న అంశంపై కూడా ఆయన సమాలోచనలు చేశారు. సభలో చర్చిస్తూ సమైక్యంగా ఎందుకుండాలో చెప్పాలని వ్యాఖ్యానించారు. శాసనసభ బులిటెన్లలో చర్చ ప్రారంభం అంటున్నప్పటికీ సీమాంధ్ర సభ్యులకు అర్ధం కావడం లేదని వ్యాఖ్యానించారు.