పంచాంగాన్ని చింపివేసినట్టయితే పండగ ఆగిపోతుందనుకోవడం గొప్ప భ్రమ! సమైక్య ఆంధ్రప్రదేశ్‌ను పరిరక్షించడం పేరుతో, పునర్ వ్యవస్థీకరణ బిల్లును చర్చించకుండా అడ్డుకుంటున్న శాసనసభ్యులను ఇలాంటి ‘భ్రాంతి’ ఆవహించినట్టుంది! మూడవ తేదీ మొదలు కావలసి వుండిన చర్చ ఎనిమిదవ తేదీన శాసనసభలో లాంఛనంగా మొదలైనప్పటికీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ వారి తీరు మారకపోవడంతో ‘వాయిదా’ల ప్రహసనం పునరావృత్తమైంది! రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి సమైక్య వాదులు ప్రయత్నించడం సీమాంధ్ర ప్రజల మనోభావాలకు అనుగుణమైన వ్యవహారం! కానీ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై ‘చర్చ’ జరగకుండా నిరోధించడానికై శాసనసభలో రచ్చ చేయడం వల్ల విభజన ఆగిపోతుందా?? విభజన ఆగిపోవడం, లేదా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం అన్న అంశాలు ఇప్పుడు విధాన సభలలో చర్చ జరగడం లేదా ఆగిపోవడంపై ఆధారపడిలేవు! ప్రజాభిప్రాయం లేదా ప్రజాప్రతినిధుల అభిప్రాయానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం విభజన ప్రక్రియను కొనసాగించవచ్చు లేదా మానుకోవచ్చు!రాజ్యాంగంలోని మూడవ అధికరణ కింద రాష్టవ్రిధాన మండలి అభిప్రాయం వ్యక్తం కావడం కేవలం లాంఛనం! శాసనసభ అభిప్రాయానికి వ్యతిరేకంగా కాని, అనుకూలంగా కాని నిర్ణయం తీసుకోగల రాజ్యాంగ అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నప్పుడు అభిప్రాయం వ్యక్తం చేయడానికి పెద్ద ప్రాధాన్యం లేదు! కానీ అభిప్రాయం కోరుతూ రాష్టప్రతి పంపిన బిల్లును చర్చించవలసిన రాజ్యాంగ బాధ్యత శాసనసభ్యులకుంది. చర్చను జరపకపోవడం లేదా చర్చను అడ్డుకోవడం ఈ రాజ్యాంగ విధిని వెక్కిరించడం తో సమానం. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సభ్యులు అలా రాజ్యాంగాన్ని వెక్కిరిస్తున్నారు, ధిక్కరిస్తున్నారు! కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడంవల్ల ఉన్న రాష్ట్రాల పరిమాణంలో కాని సరిహద్దులలో కాని మార్పులు జరిగే అవకాశం ఉన్నప్పుడు పునర్ వ్యవస్థీకరణ బిల్లును రాష్ట్ర విధాన మండలులకు పంపాలన్నది మూడవ అధికరణంలోని నిబంధన! రాష్టప్రతి నిర్దేశించిన గడువు లోపల శాసనసభలు ‘బిల్లు’పై అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అనివార్యమైన రాజ్యాంగ విధి! చర్చ జరగడంవల్ల మాత్రమే అభిప్రాయం వ్యక్తం అవుతుంది! అందువల్ల చర్చను అడ్డుకోవడం రాజ్యాంగ ధిక్కారం... నాలుగురోజులపాటు చర్చను అడ్డుకున్న సీమాంధ్ర తెలుగుదేశం ప్రతినిధులు బుధవారంనాడు మనసు మార్చుకోగలిగారు!! మార్చుకోకపోవడం వల్ల జరగకుండా నిరోధించడంవల్ల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తన లక్ష్యాలకు తానే విఘాతం కలిగించుకున్నట్టు కాగలదు! బిల్లును ఓడించి పంపిస్తామన్న మాటను గతంలో పదే పదే చెప్పిన వారు ఆ ఓడించే ప్రక్రియకు ఎందుకని విఘాతం కలిగిస్తున్నట్టు??సమైక్య వాదం పేరుతో విభజనకు సహకరించడానికే వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌వారు ఇదంతా చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తడానికి ఈ ‘అడ్డుకోవడం’ దోహదం చేయడంలేదా??
బిల్లు రాష్ట్రానికి చేరిన తరువాత నెలరోజులు గడిచిపోయాయి! మిగిలిన పనె్నండు రోజులుకూడా గడిచిపోతే రాష్టప్రతి విధించిన గడువు ముగిసిపోతుంది! గడువులోగా శాసనసభ, శాసనమండలి అభిప్రాయాలు వ్యక్తం కాకపోయినట్టయితే ఏం జరుగుతుందన్నది వివిధ విశే్లషణలకు గురి అవుతున్న అంశం! గడువు ముగిసే వరకూ రాష్టప్రతి వేచి ఉండవచ్చు! ఆ తరువాత బిల్లు పార్లమెంటుకు సమర్పించడం అనివార్యమైన రాజ్యాంగ ప్రక్రియ! ఇప్పుడు శాసనసభలో చర్చను అడ్డుకున్నవారు అప్పుడు మాత్రం పార్లమెంటులో ఏం సాధించగలరు! శాసనసభ అభిప్రాయం వ్యక్తం చేయడానికి వీలుగా మరింత గడువును కోరదలుచుకున్న ముఖ్యమంత్రి మాటను కేంద్రప్రభుత్వం మన్నించబోదన్నది స్పష్టమైపోయిన వ్యవహారం! ‘బిల్లు’కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కోరిన అదనపు సమాచారాన్ని బయటపెట్టడానికి సైతం కేంద్ర మంత్రివర్గం నిరాకరించింది. ఈ దశలో అదనపు సమాచారాన్ని ‘సరఫరా’ చేయవలసిన పని లేదని దేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖవారు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారట! సభలలో చర్చ జరిగినట్టయితే ఈ అదనపు సమాచారం ఏమిటో? ఎందుకని రాష్ట్ర ప్రభుత్వం కోరింది? కేంద్రం ఎందుకని వెల్లడించ నిరాకరిస్తోంది?? అన్న విషయాలను శాసనకర్తలు ప్రశ్నించే అవకాశం ఉంది! బయట వేదికలపై ‘తెలంగాణ’న సమర్ధించడం వేరు, సమైక్యాంధ్రను కోరడం వేరు! వాటిని పట్టించుకోవలసిన రాజ్యాంగ బాధ్యత కేంద్రానికి లేదు! ఇదే అభిప్రాయాలు శాసనసభలో వెల్లడయి వ్రాతపూర్వకమైనప్పుడు కేంద్రం వాటిని పరిగణించక తప్పదు! అంగీకరించడం అంగీకరించకపోవడం వేరే సంగతి!!
ఈ సంగతిని గుర్తించడంవల్లనే తెలంగాణ వాదులు చర్చ జరగాలని కోరుకుంటున్నారు!! షరతులతో కూడిన ‘తెలంగాణ’ను అంగీకరించబోమని చెబుతున్న ఈ ప్రాంత ప్రతినిధులు బిల్లును యధాతథంగా సమర్ధిస్తారా? లేక సవరణలను ప్రతిపాదిస్తారా?? అన్న వ్యవహారం కూడ చర్చ జరగడంవల్ల మాత్రమే స్పష్టం కాగలదు!! సవరణలను ప్రతిపాదింవచ్చునా? కూడదా? అన్న వివాదం ఒక కొలిక్కి రావాలన్నా సభలలో చర్చ జరగాల్సిందే! రెండవ వివాదం రాష్టప్రతి పంపిన బిల్లుపై ‘వోటింగ్’ జరగాలా వద్దా? అన్నది...వోటింగ్ జరిగినప్పుడే కదా ‘సభ’ అభిప్రాయం ఏమిటో వెల్లడయ్యేది! అని కొందరూ, వోటింగ్ జరపడం మూడ వ అధికరణానికి విరుద్ధమని మరి కొందరూ అం టున్నారు! బయట నిలబడి ఈ భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయడం కంటే సభలో నిలబడి విభేదాలు ఆవిష్కరించవచ్చు! శాసనసభ కార్యనిర్వహణ సలహా మండలి రెండుసార్లు సమావేశం జరిగినప్పటికీ ఈ రెండు వివాదాలలో ఏ ఒక్కటి పరిష్కారం కాలేదు!! సవరణలకు, వోటింగ్‌నకు అవకాశం ఉందని స్పీకర్ స్వయంగా భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది! రాష్టప్రతి పంపిన బిల్లును సవరించే అధికారం శాసనసభకు లేదన్నది తెలంగాణ వాదులు చెబుతున్న మాట! అంటే తెలంగాణ వాదులు సవరణలను ప్రతిపాదించరా?? షరతులతో కూడిన తెలంగాణ రాష్ట్రానికి అంగీకరిస్తారా??-ఇలాంటి చిక్కుముడులన్నీ విడిపోవడానికి ‘సభ’లు కొనసాగి చర్చ జరగడం ఒక్కటే మార్గం...
రాష్ట్ర విభజన ప్రక్రియను నిరోధించాలని కోరుతూ దాఖలైన ‘న్యాయ యాచిక’లను అనేకసార్లు తిరస్కరించిన సర్వోన్నత న్యాయస్థానం, సరైన సమయంలో దరఖాస్తుదారులు మళ్లీ వినిపించవచ్చునని స్పష్టం చేసింది! ప్రభుత్వ నిర్ణయం జరిగినట్టు ఆధికారికంగా ధ్రువపడిన తరువాతనే సంబంధిత నిర్ణయాలను సమీక్షించడానికి వీలుంటుందన్నది సుప్రీంకోర్టు చెప్పిన మాట! అంటే రాష్ట్రాల విభజనను, పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియను సమీక్షించగల అధికారం సుప్రీంకోర్టుకు హైకోర్టులకు వుందని స్పష్టమైంది! సకాలంలో సముచిత న్యాయ వేదికపై తమ వాదనను దరఖాస్తుదారులు వినిపించవచ్చునని కూడ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అయితే రాష్ట్ర శాసనసభ ఏదో ఒక నిర్ణయం తీసుకునే వరకు ఈ విషయాన్ని తాము పరిశీలించ జాలమని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హెచ్‌ఎల్ దత్త, ఎస్‌ఏ బాబ్డే సోమవారం స్పష్టం చేశారు!! శాసనసభ నిర్ణయానికి ప్రాధాన్యం ఉందని ఈ నిర్ణయం ద్వారా సుప్రీంకోర్టు ఇలా స్పష్టీకరించింది!! చర్చ జరగడానికి శాసనసభ ‘నిర్ణయించ’డానికి వీలు కల్పించడం అందువల్ల ఉభయ పక్షాలకు శ్రేయస్కరం. ‘నిర్ణయాన్ని’ సుప్రీంకోర్టులో సవాలు చేయవచ్చు...
పంచాంగాన్ని చింపివేసినట్టయితే పండగ ఆగిపోతుందనుకోవడం గొప్ప భ్రమ!
english title:
r
Date:
Thursday, January 9, 2014