
కాలగణనకు సంబంధించిన భావదాస్యాన్ని తొలగించుకొనడం సాంస్కృతిక స్వాతంత్య్ర సాధనలో ఒక భాగం! వివేకానందస్వామి సాంస్కృతిక స్వాతంత్య్ర సమరయోధుడు... ఆయన జన్మించి నూటయాబయి ఒక్క సంవత్సరాలు అయింది! కలియుగాబ్ది 4964 శుభ దుందుభి నామ సంవత్సరం పుష్యబహుళ సప్తమినాడు ఆ మహానీయుడు జన్మించాడు! సుప్రసిద్ధ జ్యోతిషవేత్త మధుర కృష్ణమూర్తిశాస్ర్తీ నిర్ధారించిన చారిత్రక వాస్తవమిది! కలియుగంలో ఇప్పుడు 5115వ సంవత్సరం నడుస్తోంది. అందువల్ల ఈ విజయనామ సంవత్సరం పుష్య బహుళ సప్తమినాడు వివేకానందుని జయంతి జరుపుకోవాలి! సౌరమాన కాలగణనం ప్రకారం వివేకానందుడు మకర సంక్రాంతినాడు జన్మించాడు. అంటే వివేకానందుడు జన్మించిన సంవత్సరంలో ‘చాంద్రమాన’ పుష్య బహుళ సప్తమినాడు ‘సౌరమాన’ మకర సంక్రాంతి ఏర్పడింది. అప్పటికి ఆంగ్లేయుల పాలన మన దేశంలో నెలకొని ఉంది...
కాబట్టి ఆ సామ్రాజ్యవాదులు తమ వలస దేశాలన్నింటి నెత్తికెక్కించిన ‘గ్రెగేరియన్ కాలండర్’ మన దేశంలో కూడ అమలుజరుగుతోంది!! ఈ గ్రెగేరియన్ కాలండర్ క్రీస్తుశకం ఆధారంగా రూపొందింది! ఈ క్యాలండర్ ప్రకారం జనవరి 12వ తేదీన వివేకానందుని జన్మదినం!! ‘‘ఆనోభద్రాక్రతవోయన్తు విశ్వతః’’- మహీతలంలోని మంగళకర పద్ధతులు అన్నీ మాకు లభించుగాక- అన్న సమన్వయ స్వభావం అనాదిగా భారతీయులది! అందువల్ల గ్రెగేరియన్ కాలండర్ పద్ధతిని మనం స్వచ్ఛందంగా అధ్యయనం చేయవచ్చు, పాటించవచ్చు! కానీ ఈ ‘గ్రెగేరియన్’ కాలగణనను మనం స్వచ్ఛందంగా స్వీకరించలేదు! ‘తమదైనది తప్ప ఇతరులని’ బతికి బట్టకట్టరాదన్న వికృత వాంఛాపరులైన బ్రిటిష్‌వారు దీన్ని మనపై బలవంతంగా రుద్దిపోయారు!!
బ్రిటిష్‌వారు వెళ్లిపోయిన తరువాత మన ప్రభుత్వంవారు మనకు జాతీయ పంచాంగాన్ని రూపొందించారు! ఇది సౌరమాన పద్ధతి! ‘గ్రెగేరియన్ కాలండర్’ కూడ సౌరమాన పద్ధతిలోనే నడుస్తోంది! భారతీయ సౌరమాన పద్ధతి భూపరిభ్రమణవల్ల భూమికి సంవత్సరం పొడుగునా సూర్యునితో, అశ్వని భరణి వంటి నక్షత్రరాసులతో ఏర్పడుతున్న సాపేక్ష సంబంధం ప్రాతిపదికగా అనాదిగా ఏర్పడి ఉంది! ఇది సృష్టిగతమైన ఖగోళ నియత పరిణామక్రమం! ఇది భారతదేశానికి మాత్రమేకాదు ప్రపంచ దేశాలకు మాత్రమేకాదు, విశ్వానికి మొత్తం వర్తిస్తున్న సనాతన వాస్తవం! భారతీయ మహర్షులు దీన్ని గుర్తించారు! భూమి ఒక్కసారి సూర్యుడికి ప్రదక్షిణం చేయడం ప్రాతిపదికగా ‘సౌర సంవత్సరం’ ఏర్పడింది! ఈ వియత్ పథపరిక్రమణ సందర్భంగా భూమినుండి గమనించినప్పుడు సూర్యుడికీ నక్షత్రాలకు మధ్య ఏర్పడుతున్న సాపేక్ష సంబంధం ప్రాతిపదికగా సంక్రాంతులు ఏర్పడుతున్నాయి! ఈ ప్రదక్షిణ పథంలో గోచరించే ఇరవైఏడు నక్షత్ర సమూహాలను మన పూర్వులు పనె్నండు రాసులుగా విభజించుకున్నారు! భూమినుం చి చూసినప్పుడు సాపేక్షంగా సూర్యుడు ఒ క్కొక్క రాసితో కలసి ఉదయించినట్టు అస్తమించినట్టు కనిపిస్తోంది! అంటే సూర్యుడు ఉదయించే సమయంలో ఒక రాసి ఉదయించడం ఆరంభమైన రోజు ఒక సంక్రాంతి! ఇలా పనె్నండు సంక్రాంతులు, పనె్నండు నెలలు!!
ఇలాంటి పనె్నండు సంక్రాంతులలో మకర సంక్రాంతి నాడు- మకర మాసంలో మొదటిరోజున- వివేకానందస్వామి జన్మించాడు. అశ్వని భరణి నక్షత్ర సమూహం కృత్తిక నక్షత్ర సమూహంలో నాలుగవ వంతు విస్తరించి ఉన్న అంతరిక్ష మండలాన్ని మన పూర్వులు మేష రాసిగా గుర్తించారు. పాశ్చాత్యులకు కూడ ఈ పరిజ్ఞానం ఆ తరువాత అలవడినప్పటికీ సృష్టిగత వాస్తవాలను సమాజ జీవన స్థితంగా మలుచుకొనకపోవడం వారి ‘అసమగ్రత’కు చారిత్రక సాక్ష్యం! భూమినుండి పరిశీలించినప్పుడు మేషరాసితో కలిసి సూర్యుడు ఉదయించడం మొదలైనరోజు మేష సంక్రాంతి! నెలరోజులపాటు సూర్యుడు ఒక ‘రాసి’తో కలిసి ఉదయిస్తాడు! అది ఒక సౌరమాన మాసం. నెల పూర్తికాగానే సూర్యుడు ‘మేషం’నుండి వెనుకబడిపోతాడు. ‘వృష భ’నక్షత్ర రాసి వచ్చి సూర్యునితో కలసి ఉదయించడం ఆరంభమవుతుంది!! అది ‘వృషభ సక్రాంతి’! ఇలా ‘మకర’రాసికి సంబంధించిన నక్షత్ర సమూహంతో సూర్యుడు ఉదయించడం ఆరంభించే సమయం మకర సంక్రాంతి! ఇలా ఖగోళపరిణామ క్రమంతో అనుసంధానమైన భారతీయ పంచాంగ పద్ధతి, కాలగణనం కేవలం భావాత్మకమైన అనుభూతులు కాదు, జీవన సత్యాలు, శాస్ర్తి య విజ్ఞాన రీతులు! సూర్యుడు ‘మేషం’లో కలసి ఉదయించడం మొదలుపెట్టిన రోజు సౌరమాన సంవత్సరం ఆరంభవౌతోంది! ఇది మూడువందల అరవైఐదు రోజుల, కొన్ని గంటల సంవత్సరం కాబట్టి పాశ్చాత్యుల ‘గ్రెగేరియన్ కాలండర్’ ప్రకారం జరుగుతున్న కాలగణనం కూడ సమాంతరంగా ఉంటోంది! అంటే జనవరిలో ఒకే తేదీన- రోజున- మకర సంక్రాంతి వస్తోంది! ఏప్రిల్ 14వ తేదీన మేష సంక్రాంతి వస్తోంది! మనం మన శాస్ర్తియ సౌరమానాన్ని మరచిపోయినందువల్ల ప్రామాణికత లేని ‘గ్రెగేరియన్’ కాలండర్‌తో దీన్ని సరిపోల్చుకుంటున్నాము! ఈ సౌరమాన మేష సంక్రాంతినాఢు తమిళుల ఇతర దాక్షిణాత్యుల ‘ఉగాది’ మొదలు అవుతోంది! సౌరమానం, చాంద్రమానం, బబార్హస్పత్వ మానం, నక్షత్ర మానం వంటివి భారతీయ సంస్కృతిలోని వైరుధ్యంలేని వైవిధ్యాలకు ప్రతీకలు!! సౌరమానం ప్రాతిపదికగా మిగిలిన కాలమానాలను సమన్వయం చేసుకొనడం భారతదేశంలో అనాది ప్రక్రియ! అయతే ‘అన్య’విధ్వంసక ప్రవృత్తివల్ల మన దేశంలోని సనాతన కాలగణన పద్ధతులను బ్రిటిష్‌వారు ధ్వంసంచేయ యత్నించారు! తమదైన గ్రెగేరియన్ కాలండర్‌ను మన నెత్తిన రుద్దారు!!
‘గ్రెగేరియన్’ కాలండర్‌కు పూర్వరూపమైన ‘జొలియన్’ కాలండర్‌ను జ్వొలియస్ సీజర్ రూపొందించాడట! అందువల్ల ‘జ్వొలియస్’ ‘జొలియస్’గా మారింది! తన పేరుతో ‘జూలై’అన్న పేరును కూడ ఆయన స్థిరపరిచాడట! తన పేరున్న నెలకు అంతకు పూర్వం ఉండిన ముప్పయి రోజులకు బదులు ముప్పయ ఒక్క రోజులను చేసింది కూడా ఈ సీజరేనట! ఈయన క్రీస్తునకు పూర్వం నలబయి ఆరవ ఏట ఈ ‘జొలియస్’ కాలెండర్‌ను నిర్ధారించాడు!! ఇలా కొత్త కేలండర్‌ను ఏర్పాటుచేయడానికి మొదటి కారణం గ్రీకుల నాగరికతను నశింపచేయాలన్న ‘రోమన్ల’ పట్టుదల! సీజర్ రోమన్ వీరుడు!గ్రీకు నాగరికతా సామ్రాజ్యం అంతరించడానికి రోమన్ల విజయమే కారణం! సీజర్ సమకాలంలో భారతదేశాన్ని సమ్రాట్ విక్రముడు పాలించాడు! విక్రముడు క్రీస్తునకు పూర్వం యాబయి ఎనిమిదవ సంవత్సరంలో నూతన ‘కాలగణన’ను ఆరంభించాడు! ఈ సంగతి సీజర్ చెవిన పడి ఉండవచ్చు! పనె్నండేళ్ల తరువాత అతగాడు ‘జొలియస్ కాలెండర్’ను రూపొందించాడు! సీజర్ మనుమడైన ‘ఆగస్టస్’చక్రవర్తి తన పేరులను ‘ఆగస్ట్’నెలకు పెట్టించాడన్న వాదం ఉంది!
తన పేరుతో ఉన్న నెలకు కూడ ముప్పయిఒక్క రోజులను ఏర్పాటుచేశాడట! జూలియస్ సీజర్, అగస్టస్ సీజర్‌ల కథలలో వాస్తవం కొంత, కల్పన కొంత ఉండవచ్చు! కానీ గ్రీకు ల పట్ల విద్వేషంతో మాత్రమే రోమన్లు ‘జొలియస్’ కాలండర్‌ను ఏర్పాటుచేశారన్నది మాత్రం చారిత్రక వాస్తవం!!
వైయక్తిక దురహంకారాలకుకాక సామాజిక సమష్టి హితానికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం భారతీయ జీవన పద్ధతి! అందుకే పాశ్చాత్య దేశాలలోవలె వ్యక్తుల పేరుతో మతాలు, శకాలు మన దేశంలో పుట్టలేదు! అనాదిగా మన దేశంలో యుగాల ప్రాతిపదికగా కాలగణన జరిగింది. జూలియస్ సీజర్ పేరుతోనో, గ్రెగరీ పేరుతోనో ఇక్కడ పంచాంగాలు లేదా కేలండర్లు పుట్టలేదు! పంచాంగ కాలగణన అనాది! కలియుగం 2552వ సంవత్సరంలో ‘సైరస్’లేదా ‘డేరియన్’ అనే పారశీక రాజు, మన దేశాన్ని దురాక్రమించిన తరువాత, ‘సైరస’శకాన్ని స్థాపించాడు. ఇది క్రీస్తునకు పూర్వం 550వ సంవత్సరం! అందువల్ల విదేశీయ ‘కాలగణన’ను నిరాకరించడం కోసమే సమ్రాట్ విక్రముడు ఐదువందల ఏళ్ల తరువాత ‘సంవత్’ను ఆరంభించాడు! ఆ తరువాత విక్రముని మునిమనుమడు శాలివాహనుడు ఆరంభించిన నూతన ‘కాలగణన పద్ధతి’కూడ వైయక్తిక దురహంకార చిహ్నంకాదు!! మన దేశాన్ని దురాక్రమించి దోపిడీ సాగించిన వివిధ విదేశీయ జాతులను సింధునదీ తీరం ఆవలికి నెట్టిన తరువాత ‘హిందూస్థానం’గా భారతదేశానికి నామకరణం చేశాడు శాలివాహనుడు! ఈ సాంస్కృతిక విజయచిహ్నంగా మాత్రమే 1935 ఏళ్లక్రితం శాలివాహనుడు నూతన కాలగణనకు శ్రీకారంచుట్టాడు. భారత ప్రభుత్వం దీనినే క్రీస్తుశకం 1957లో జాతీయ శకంగా ఏర్పాటుచేసింది!! జాతీయ శకం, జాతీయ సంవత్సరాది బహుళ ప్రజాదరణ పొందకపోవడానికి ఏకైక కారణం- ప్రసిద్ధమైన ‘నిరయణ’ పద్ధతిలోకాక వ్యవహారానికి దూరంగా ఉన్న ‘సాయ ణ’ పద్ధతిలో ఈ ‘జాతీయ పంచాంగం’ క్రీస్తుశకం 1957 నుంచీ రూపొందుతుండడం....
‘జూలియస్ సీజర్’ రూపొందించిన ఆ తరువాత ‘గ్రేగరీ’మార్పులుచేసిన ‘కాలెండర్’లోని ‘సౌరమానం’ తప్పులతడకగా మారడం చరిత్ర! ‘సంక్రమణం’జరగడం- ప్రాతిపదికగా ఘడియలు, విఘడియలను సైతం కచ్చితంగా గుణించి సంవత్సరాదిని భారతీయులు నిర్ధారిస్తున్నారు కనుక! మన ‘సౌరమాన’మానంలో ఇంతవరకు ‘లిప్త’ పాటు కూడ తేడా రాలేదు!! ఎందుకంటె ఖగోళంలో సంభవించే పరిణామంతో సమాంతరంగా మన వ్యవహార కాలగణనం నడుస్తోంది! కానీ పాశ్చాత్యులు తమకు తెలిసిన ‘వ్యవహార పరిధి’లోకి ఖగోళ పరిణామాన్ని కుదించే ప్రయత్నం చేశారు! అందువల్ల క్రీస్తుశకం 1582నాటికి ‘ఖగోళ గతి’లో పోల్చినప్పుడు తమ ‘కాలెండర్’ పదకొండు రోజులు వెనుకబడి పోయిందని పోప్ గ్రెగరీ గుర్తించాడు! అందువల్ల 1582 అక్టోబర్ నాలుగు తరువాతి రోజును అక్టోబర్ 15వ తేదీగా నిర్ధారించి అలా పాటించాలని గ్రెగరీ ఆదేశించాడు!!
అప్పటినుంచి అమలులోఉన్న పాశ్చత్య గ్రెగేరియన్ కాలండర్‌లో కూడ తప్పులు దొర్లిపోతున్నాయి. వివేకానందస్వామి జన్మించిన సంవత్సరంలో మకర సంక్రాంతినాడు వచ్చిన ‘గ్రెగేరియన్ జనవరి 12వ తేదీ’ ఇప్పుడు సంక్రాంతి కంటె రెండురోజుల ముందే వచ్చేస్తోంది! ఖగోళంలోని సంక్రమణ బిందువులు. అంటే మకర సంక్రాంతి సహా పనె్నండు సంక్రాంతులు ఏర్పడే స్థానాలు- ప్రతి ఏటా కొన్ని నిముషాలు ముందుకు జరుగుతున్నాయి!! ఫలితంగా ప్రతి డెబ్బయి రెండేళ్లకొకసారి ఒకరోజు తేడా వస్తోందట! ఇది పాశ్చత్యులకు తెలియదు...