న్యూఢిల్లీ, జనవరి 9: బొగ్గుగనుల కేటాయింపు వ్యవహారంలో ప్రధాని మన్‌మోహన్ సింగ్ పూర్తిగా ఇరుకున పడిపోయారు. కొన్ని తప్పులు జరిగినట్లు ప్రభుత్వం సుప్రీం కోర్టులో అంగీకరించటంతో ఈ మొత్తం వ్యవహారం సరికొత్తమలుపు తిరిగే అవకాశాలున్నాయి. గనుల కేటాయింపులో అవకతవకలు జరిగినట్లు అటార్నీ జనరల్ వాహనవతి సుప్రీంకోర్టులో అంగీకరించటంతో ప్రతిపక్షాలకు ముఖ్యంగా బిజెపికి ప్రభుత్వంపై దాడి చేయటానికి కొత్త ఆయుధం లభించింది. అవకతవకలు జరిగినట్లు సాక్షాత్తు అటార్నీ జనరల్ అంగీకరించినందున మన్‌మోహన్ సింగ్ వెంటనే పదవికి రాజీనామా చేయాలని బిజెపి డిమాండ్ చేసింది.
ప్రభుత్వ ఖజానాకు విపరీతమైన నష్టం కలిగించే తీరులో బొగ్గు గనుల కేటాయింపు జరిగిందని మహారాష్టక్రు చెందిన లోక్‌సభ సభ్యుడు అహిర్, రాజ్యసభ సభ్యుడు జావడేకర్ కేంద్ర నిఘా విభాగానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని కేంద్ర నిఘా విభాగం సిబిఐని విచారించవలసిందిగా ఆదేశించింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరుగుతున్న సంగతి విదితమే. మన్‌మోహన్ సింగ్ బొగ్గు శాఖను చూస్తున్న సమయంలో ఈ గనుల కేటాయింపుజరిగినందున అవకతవలకు అవినీతికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని పదవికి రాజీనామా చేయాలని పార్టీ అధికార ప్రతినిధి ప్రకాష్ జావడేకర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ అటార్నీ జనరలే స్వయంగా లోపాలు జరిగాయని అంగీకరించినందున ప్రధాని రాజీనామా చేయటం భావ్యంగా ఉంటుందని ఆయన విలేఖరులతో అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశంపై ప్రధానిని నిలదీస్తామని ఆయన తెలియజేశారు.
మన్మోహన్ తక్షణం రాజీనామా చేయాలి: బిజెపి
english title:
bjp
Date:
Friday, January 10, 2014