
న్యూఢిల్లీ, జనవరి 9: ప్రధాని మన్మోహన్ సింగ్ బుధవారం ప్రవాస భారతీయ దివస్ సమావేశంలో మాట్లాడుతూ మంచి రోజులు రానున్నాయంటూ చేసిన వ్యాఖ్యలను బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ యద్దేవా చేస్తూ కుంభకోణాలు, చేవచచ్చిన విధానాలు, విచ్చిన్నకర రాజకీయాలు ప్రభుత్వం పట్ల, దాని నాయకుల పట్ల ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని దెబ్బతీసాయని అన్నారు. గురువారం ప్రవాసీ భారతీయ దివస్ సమావేశాన్ని ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తూ ఓటు వేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని, దేశంలో చోటుచేసుకుంటున్న విప్లవానికి సహాయ పడాలని ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు. ‘నిన్న ప్రధానమంత్రి ఓ మంచి మాట చెప్పారు. త్వరలోనే మంచి రోజులు రానున్నాయని, నిరాశకు గురికావలసింది ఏమీ లేదని ఆయన చెప్పారు. ప్రధానమంత్రితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. దీనిపై కొత్తగా మరేమీ చెప్పాలని అనుకోవడం లేదు. మహా అయితే మరో నాలుగు లేదా ఆరుమాసాలు మీరు వేచి ఉండాల్సి ఉంటుంది. తప్పకుండా మంచి రోజులు రానున్నాయి’ అని లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పరోక్షంగా చెప్తూ మోడీ అన్నారు. దేశ ఆర్థిక పరిస్థితిపై భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, రానున్నవన్నీ మంచి రోజులేనని ప్రధాని మన్మోహన్ సింగ్ బుధవారం ప్రవాస భారతీయ దివస్‌లో మాట్లాడుతూ చెప్పడం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను యద్దేవా చేస్తూ మోడీ ఈ రోజు ఈ వ్యాఖ్యలు చేసారు.
యుపిఏ ప్రభుత్వాన్ని మోడీ దుయ్యబడుతూ, ‘ముఖ్యంగా గత దశాబ్ద కాలంలో పెచ్చుమీరిన సంకుచిత రాజకీయాలు, స్వార్థప్రయోజనాలు, దోపిడీ నిలకడయిన, పటిష్ఠమైన దేశ నిర్మాణ సూత్రాలను దెబ్బ తీసాయని మోడీ అన్నారు. దిగజారుతున్న దేశ ఆర్థిక పరిస్థితి, వరస కుంభకోణాలు, చేవచచ్చిన విధానాలు, దిగజారుతున్న సమాజం దేశం అంతటా వ్యాపించిన విచ్ఛిన్నకర రాజకీయ వాతావరణం ప్రభుత్వం, దాని నేతల పట్ల ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని పూర్తిగా దెబ్బ తీసాయి’ అని అన్నారు. అవినీతిపై అడిగిన ఒక ప్రశ్నకు మోడీ సమాధానమిస్తూ, ఇటీవల వరస కుంభకోణాలు వెలుగు చూసిన తర్వాత దీన్ని పూర్తిగా నిర్మూలించడంపైన మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
మాతృభూమికి సేవ చేయండి
భారతదేశాన్ని సందర్శించేలా విదేశీయులను ప్రోత్సహించడంతో పాటు మాతృభూమి కోసం ఎంతోకొంత సేవ చేయాలని మోడీ ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు. ‘విదేశాల్లో హోటల్ పరిశ్రమలో గుజరాతీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. తమ హోటళ్లలో బసచేసే వారిని గుజరాత్, భారత్ సందర్శించేలా వారిని ప్రోత్సహిస్తే చాలు. పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. కనీసం పది మందిని భారత్ పంపిస్తే చాలు.. పర్యాటక రంగం ఎంతో అభివృద్ధి చెందుతుంది’ అని ఆయన అన్నారు. తమ స్వస్థలాలతో సంబంధాలను కలిగి ఉండడానికి సామాజిక మీడియాను ఎక్కువగా ఉపయోగించుకోవాలని కూడా ఆయన ప్రవాస భారతీయులకు సూచించారు. ‘ప్రతి ఒక్కరూ భారత దేశంలో పెట్టుబడులు పెట్టడానికి లక్షలాది డాలర్లు ఖర్చు చేయలేరు. అయితే తన స్వగ్రామం కోసం ఏదయినా మంచి పని చేయడానికి కొన్ని వందల డాలర్లు ఖర్చు చేయవచ్చు. మీ మాతృభూమితో సంబంధాలను కలిగి ఉండడానికి టెక్నాలజీని ఉపయోగించుకోండి’ అని ఆయన అన్నారు.
(చిత్రం) గురువారం ఢిల్లీలో ప్రవాసీ భారతీయ దివస్ సమావేశంలో పాల్గొన్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి. చిత్రంలో ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ మోంటెక్ సింగ్ ఆహ్లూవాలియా, కేంద్ర మంత్రి వాయలార్ రవి, కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ ఉన్నారు.