
నాసిక్/ముంబయి, జనవరి 9: బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) అధినేత రాజ్ థాకరే మరోసారి విరుచుకుపడ్డారు. గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి మోడీ తక్షణం రాజీనామా చేయాలని థాకరే డిమాండ్ చేశారు. ప్రతి సభలోనూ గుజరాత్ అభివృద్ధిని గురించే చెప్పుకుంటున్న మోడీ సిఎం పదవి నుంచి వైదొలిగితే బాగుంటుందని ఆయన అన్నారు. తరువాతే జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తే మంచిదని థాకరే స్పష్టం చేశారు. ‘నరేంద్ర మోడీని బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. ప్రధాని అంటే మొత్తం దేశానికి ప్రాతినిధ్యం వహించేవాడు. అలాంటి పరిస్థితుల్లో మోడీ ఇంకా గుజరాత్ ముఖ్యమంత్రి పదవిని అంటిపెట్టుకుని ఉండడం సరైంది కాదు’ అని ఎంఎన్‌ఎస్ అధినేత విమర్శించారు. ప్రధాని అన్న వ్యక్తి ఒక రాష్ట్రానికే పరిమితం కాదన్న విషయం తెలుసుకోవాలని ఆయన చెప్పారు. నాసిక్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గుజరాత్ అభివృద్ధికి మోడీ చేసిన కృషిని ప్రశంసించారు. అయితే పదేపదే గుజరాత్ గురించి మాట్లాడం సరైంది కాదని థాక్రే స్పష్టం చేశారు. ‘మోడీ ముంబయిలో ఉన్నా గుజరాత్ ప్రజల గురించే మాట్లాడుతారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మాట్లాడుతారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ సంగతేమిటీ? ఆయనా ఎంతో గొప్పవారే’ అని థాకరే ఎద్దేవా చేశారు. ప్రధాన మంత్రి అభ్యర్థిగా మోడీకి మద్దతు ఇచ్చే విషయంలో తామెలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎంఎన్‌ఎస్ చీఫ్ ప్రకటించారు. రాజ్ థాకరే వ్యాఖ్యలు బిజెపి, ఎంఎన్‌ఎస్ మధ్య సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని విశే్లషకులు చెబుతున్నారు. ఇలా ఉండగా బిజెపి మిత్రపక్షమైన శివసేన రాజ్‌థాకరే వ్యాఖ్యలను తప్పుపట్టింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన సమర్థవంతంగా పనిచేశారని, పిఎం అభ్యర్థిగా ప్రకటించినంత మాత్రాన సిఎం పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని శివసేన మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు దేవేందర్ ఫడ్నావిస్ అన్నారు. అభివృద్ధి, సామాజిక మార్పులు, అక్కడి ప్రజల జీవన శైలి, ఉపాధి అంశాల గురించే ఆయన మాట్లాడుతున్నారు తప్ప ఒక్క గుజరాత్‌పైనే మాట్లాడడం లేదన్న సంగతి రాజ్ తెలుసుకోవాలని శివసేన స్పష్టం చేసింది.
కాగా మహారాష్టల్రో ఎంఎన్‌ఎస్ ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) బలాదూర్ అని రాజ్‌థాకరే చెప్పారు. ఢిల్లీలో ఆప్ చెబుతున్న మాటలు తాము మహారాష్టల్రో ఎప్పటినుంచో అంటున్నామని, తమకు ఓటేస్తే తప్ప మార్పు రాదని కొనే్నళ్లుగా చెబుతున్నట్టు ఆయన అన్నారు. మహారాష్ట్ర సమస్యలపైనే తాము పోరాడుతున్నట్టు థాకరే తెలిపారు. థాకరే వ్యాఖ్యలపై ఆప్ మహారాష్ట్ర కన్వీనర్ అంజలీ దమానియా విరుచుకుపడ్డారు. ఎవరి సత్తా ఏమిటో ఎన్నికల్లో తెలుస్తుందని ఆమె సవాల్ చేశారు.