బెంగళూరు, జనవరి 9: స్టడీ టూర్ పేరుతో విదేశీ పర్యటనకు వెళ్లిన 11 మంది కర్నాటక ఎమ్మెల్యేలు తిరిగివచ్చారు. ఎమ్మెల్యేల విదేశీ పర్యటనపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజిలో పర్యటన ముగించుకుని హాంకాంగ్ మీదుగా ఎమ్మెల్యేలు బెంగళూరు చేరుకున్నారు. ఎమ్మెల్యేల పర్యటన ఆసాంతం వివాదాస్పదమైంది. విదేశాల్లోని కరవు పరిస్థితులను స్వయంగా చూసి వాటి పరిష్కారానికి అక్కడి ప్రభుత్వాలు తీసుకున్న చర్యలపై అధ్యయనం చేయడానికి వెళ్ళినట్టు సదరు శాసనసభ్యులు చెబుతున్నా జనం సంతృప్తి చెందడం లేదు. కర్నాటకలోని అనేక ప్రాంతాల్లో కరువు తాండవిస్తోందని, దానికి పరిష్కారం చూపకుండా విహార యాత్రలు ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే స్టడీ టూర్‌ను కర్నాటక బిసి కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే బిఆర్ యవ్గల్ సమర్థించుకున్నారు. టూర్‌కు ఆయనే సారథ్యం వహించాడు. ‘మేం అక్కడ గంతులేయడానికి వెళ్లలేదు. వ్యవసాయ క్షేత్రాలు చూశాం. డెయిరీ ఫామ్‌లు పరిశీలించాం’ అని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేల స్టడీ టూర్లు అన్నవి ఇప్పుడు కొత్తకాదని ఇంతకుముందు ఎందుకు అడగలేదని ఎదురు ప్రశ్నించారు. డిసెంబర్ 21న ఢిల్లీ నుంచి సిడ్నీకి పయనమైన ఎమ్మెల్యేలు ఏకంగా ఫ్యామిలీలను వెంటబెట్టుకుని వెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే సొంత సొమ్ములు ఖర్చుపెట్టి వెళ్లామని వారు వాదిస్తున్నారు. శాసన సభ్యులుగా తమకూ కొన్ని ప్రత్యేక హక్కులుంటాయన్న సంగతి తెలుసుకోవాలని, స్పీకర్ అనుమతితోనే వెళ్లామని బసవరాజ్ నీలప్ప వివరించారు. ఇంతకుముందే 12 మంది ఎమ్మెల్యేల బృందం ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని వచ్చింది. మరో బృందం బ్రెజిల్, అర్జెంటీనా, పెరు వెళ్లాల్సి ఉండగా విమర్శల నేపథ్యంలో మానుకుంది.
* టూర్‌పై కర్నాటక ఎమ్మెల్యేల వివరణ
english title:
karnataka
Date:
Friday, January 10, 2014