న్యూఢిల్లీ, జనవరి 9: సమాచార హక్కు చట్టానికి ప్రచారం కల్పించడానికి, ప్రజలకు సంబంధించిన ప్రభుత్వ సమాచారాన్ని తమంతట తాముగా వెల్లడించడానికి మరింతగా కృషి చేయాలని కేంద్రం రాష్ట్రాలను కోరుతూ, సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకునే విషయంలో రాష్ట్రాల పని తీరు ఆశించిన స్థాయిలో లేదని పేర్కొంది. ‘సమాచార హక్కు చట్టానికి ప్రచారం కల్పించడానికి కేంద్రం ఎంతో కృషి చేస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో చేస్తున్న కృషి ఆశించిన స్థాయిలో లేదు. వాళ్లు ఈ విషయంలో మరింతగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. సమాచార హక్కు చట్టానికి ప్రచారం కల్పించడానికి, సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచే విషయంలో వాళ్లు మరింతగా కృషి చేయాల్సిన అవసరం ఉంది’ అని కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి వి నారాయణ స్వామి గురువారం ఇక్కడ చెప్పారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాలు, అధికారులు, ఉద్యోగుల బదిలీ ఉత్తర్వులు, అభ్యంతరాలు లేదా కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్, ప్రజా పద్దుల కమిటీ నివేదికల్లోని ముఖ్యమైన పేరాలు లాంటి వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని మంత్రి చెప్పారు. ‘గ్రామాల్లో నివసించే సామాన్య పౌరుడు కూడా సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసే స్థితిలో ఉండాలని కేంద్రం కోరుకుంటోంది. ఒక దాపరికం లేని ప్రభుత్వంగా మమ్మల్ని మేము నిరూపించుకోవాలని అనుకుంటున్నాం’ అని నారాయణ స్వామి చెప్పారు. సమాచార హక్కు చట్టానికి ప్రచారం కల్పించడం, వినియోగదారులకు అది మరింతగా దగ్గరయ్యేందుకు ప్రజలు సలహాలు, సూచనలు అందించాలని ఆయన కోరారు. ఈ విషయంలో ప్రజలు, పౌర సమాజం నుంచి మద్దతును కోరుకుంటున్నామని, ఈ చట్టం మరింతగా ఉపయోగపడే సలహాలు, సూచనలను స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. వీటి ఆధారంగా ప్రభుత్వం తక్షణం మార్గదర్శకాలు, నోటిఫికేషన్లు జారీ చేస్తుందని కూడా నారాయణ స్వామి చెప్పారు. సమాచార హక్కు చట్టం అమలులో నోడల్ ఏజన్సీ అయిన సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ (డిఓపిటి) సమాచార హక్కు చట్టంపై ఏర్పాటు చేసిన ఒక రోజు జాతీయ చర్చాగోష్ఠిలో నారాయణ స్వామి ఈ విషయాలు చెప్పారు. సమాచార హక్కు చట్టంలోని 4వ సెక్షన్ కింద పేర్కొన్న తమకు తాముగా తప్పనిసరిగా విడుదల చేయాల్సిన సమాచారం విషయంలో నిబంధనలను తు.చ తప్పకుండా పాటించాలని డిఓపిటి గత ఏప్రిల్‌లో అన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు లేఖలు రాసింది.
రాష్ట్రాలకు కేంద్రం సలహా
english title:
rti
Date:
Friday, January 10, 2014