న్యూఢిల్లీ, జనవరి 9: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీలోకి కొత్తరక్తం ఎక్కించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు ఏఐసిసి వర్గాలు వెల్లడించాయి. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సర్వసభ్య సమావేశం జనవరి 17న జరిగేలోగానే కాంగ్రెస్ కార్యవర్గంలో మార్పులు చేర్పులు జరిగొచ్చని తెలుస్తోంది. ఈనెల 17న జరిగే ఏఐసిసి సర్వసభ్య సమావేశంలో రాహుల్‌గాంధీని 2014 లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించవచ్చనేది అందరికీ తెలిసిందే. అయితే ప్రకటన జరిగేలోగానే ఏఐసిసిలో యువతకు పెద్దపీట వేసేందుకు మార్పులు చేర్పులు చేస్తారని అంటున్నారు. యువ నాయకులైన జ్యోతిరాదిత్య సింధియా, జితేందర్ సింగ్‌లాంటి వారికి ముఖ్యమైన బాధ్యతలు అప్పగిస్తారన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం మంత్రి పదవులు అనుభవిస్తున్న పలువురు సీనియర్లను వారి సొంత రాష్ట్రాలకు పంపించి పార్టీని పటిష్టం చేసే బాధ్యతలు అప్పగించవచ్చని అంటున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్‌లాంటి వారికి లోక్‌సభ ఎన్నికల పనులు అప్పగించనున్నారు. ఇప్పుడు ఏఐసిసిలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వహిస్తోన్న దిగ్విజయ్ సింగ్, మధుసూదన్ మిస్ర్తి తదితరులు లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగాలని అనుకుంటున్నారు. అయితే దీనివలన పార్టీ పనితీరు దెబ్బతినొచ్చని భావిస్తోన్న రాహుల్‌గాంధీ, వారికి లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి అనుమతి ఇవ్వకపోవచ్చని ఏఐసిసి వర్గాలు చెబుతున్నాయి. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సర్వసభ్య సమావేశం అనంతరం రాహుల్‌గాంధీ పార్టీ పూర్తి బాధ్యతలు చేపడతారని, పార్టీకి సంబంధించిన అన్ని నిర్ణయాలను ఆయనే తీసుకుంటారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన పూర్తి బాధ్యత రాహుల్‌గాంధీ పరిధిలోకి పోతుందని అంటున్నారు. పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రణాళిక, పార్టీ ప్రచారం తదితర అన్ని అంశాలనూ రాహుల్ నిర్ణయించనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక పని ఇదివరకే ప్రారంభమైంది. పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల ప్రాథమిక జాబితా ప్రస్తుతం రాహుల్ పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. నాలుగైదు దశల్లో పరిశీలించిన తరువాతే పార్టీ అభ్యర్థుల పేర్లు ఖరారు చేయనున్నారు. పార్టీ తరఫున సమర్ధులు, ప్రజావిశ్వాసం ఉన్న వారిని రంగంలోకి దించేందుకు రాహుల్ గట్టి ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్ధుల పేర్లను ఖరారు చేసేందుకు రాహుల్ ఇప్పటికే రెండు మూడు సర్వేలు చేయించినట్టు ఏఐసిసి వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీ ఎంపిక చేసిన కొందరు ప్రత్యేక పరిశీలకులు తమకు అప్పగించిన లోక్‌సభ నియోజకవర్గాలకు వెళ్లి పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్ధులపై ప్రజాభిప్రాయాలు సేకరించారు. ఈ పరిశీలకులు అందించిన నివేదికల ఆధారంగా అభ్యర్ధుల ఎంపికకు సంబంధించిన ప్రాథమిక జాబితాలను తయారు చేసినట్టు చెబుతున్నారు.
17లోగా మార్పులు చేర్పులు * రంగం సిద్ధం చేసిన రాహుల్
english title:
aicc
Date:
Friday, January 10, 2014