
బెంగళూరు, జనవరి 9: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్. యెడ్యూరప్ప మళ్లీ బిజెపి గూటికి చేరారు. ఆయనను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి తదితర సీనియర్ నేతలు పార్టీలోకి ఆహ్వానించి ప్రాథమిక సభ్యత్వాన్ని అందజేశారు. ఏడాది క్రితం బిజెపి నుంచి వేరుపడి సొంతంగా కర్నాటక జనతా పక్ష (కెజెపి) పేరుతో పార్టీ పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ‘గతించిన విషయాలపై చింతించాల్సిన అవసరం లేదని, పొరపొచ్చాలన్నీ విడనాడి తల్లీ పిల్లల మాదిరిగా మళ్లీ పార్టీ కోసం కలిసి పనిచేద్దామని’ యెడ్యూరప్ప పిలుపునిచ్చారు. వారం రోజుల క్రితమే తన పార్టీ కెజెపిని బిజెపిలో విలీనం చేసిన విషయం తెలిసిందే. తాను తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగిందని ఆయన ఈ సందర్భంగా వాపోయారు. దేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభంజనం వీస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సంక్షోభంలో పడిపోయిందని అన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో 18 స్థానాలు గెలుచుకున్న బిజెపి, రానున్న ఎన్నికల్లో 20 స్థానాల్లో గెలుపొందేందుకు కృషిచేస్తానని ఆయన అన్నారు. చేసిన తప్పులను క్షమించమని ప్రజలను వేడుకుంటామని, మళ్లీ ఇలాంటి తప్పులు చేయమని ఆయన అన్నారు.
యెడ్యూరప్పను పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం జోషి మాట్లాడుతూ, ఇకపై ఎలాంటి అరమరికలు లేకుండా కలిసి పనిచేస్తామని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ ప్రధాన కార్యదర్శి అనంత కుమార్ మాట్లాడుతూ, మేము ఇక విడిపోయేది లేదని, కలిసేవుంటామని, కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తామని అన్నారు. కెజెపి పార్టీని, కార్యకర్తలను సహృదయంలో ఆహ్వానిస్తున్నామని అన్నారు. నేటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో కర్నాటక మాజీ ముఖ్యమంత్రుల సదానంద గౌడ, జగదీష్ షెట్టార్ పాల్గొన్నారు. (చిత్రం) యెడ్యూరప్పను పార్టీలోకి ఆహ్వానిస్తున్న కర్నాటక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి తదితరులు