
న్యూఢిల్లీ, జనవరి 10: భారత్ అమెరికాల మధ్య దౌత్య సమరం మొదలైంది. మూడు దశాబ్దాల క్రితంనాటి పరిణామం పునరావృతమైంది. తన దౌత్యవేత్త దేవయానిని అభిశంసించి అభియోగాలు నమోదు చేసి అమెరికా వెనక్కి పంపిన నేపథ్యంలో, భారత్ కూడా కొన్ని గంటల వ్యవధిలోనే శుక్రవారం అంతే తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. వీసా దగా కేసులో దేవయానిని అభిశంసిస్తూ అభియోగాలను నమోదు చేసిన అమెరికా చర్యను గర్హించిన భారత్, దెబ్బకు దెబ్బ అన్న రీతిలోనే తన ప్రతీకారాన్ని చాటుకుంది. ఢిల్లీలోని అమెరికా ఎంబసీలో డైరెక్టర్ ర్యాంక్ అధికారిని 48 గంటల్లోగా వదిలి వెళ్లిపోవాలని భారత్ ఆదేశించింది. అమెరికా దౌత్యవేత్తను భారత్ బహిష్కరించడం అనేది గత 33ఏళ్లలో ఇదే మొదటిసారి. గతంలో రాజకీయ కౌన్సిలర్‌గా పని చేసిన జార్జి గ్రిఫిన్‌పై ఈ చర్య తీసుకుంది. అప్పట్లో భారత్ దౌత్యవేత్త ప్రభాకర్ మీనన్‌ను అమెరికా బహిష్కరించడానికి ప్రతీకారంగానే గ్రిఫిన్‌పై కూడా బహిష్కరణ వేటు వేసింది. అయితే ఈ తాజా కేసుకు సంబంధించి బహిష్కరణ అన్న మాట ఉపయోగించకుండా దేవయాని స్థాయి అధికారిక హోదా కలిగిన దౌత్యవేత్తను వెనక్కి తీసుకోవాలని మాత్రమే అమెరికా ఎంబసీని కోరినట్టు అధికార వర్గాలు తెలిపాయి. దేవయాని వ్యవహారంలో ఈ అధికారే కీలక పాత్ర వహిస్తున్నారని, అమెరికా ఏకపక్ష నిర్ణయానికి ఆయన ధోరణే కారణమని భావించడం వల్లే ఆయన్ని బహిష్కరించాలని నిర్ణయించినట్టుగా అధికార వర్గాలు స్పష్టం చేశాయి. అయితే ఆ దౌత్యవేత్త పేరును మాత్రం వెల్లడించలేదు. ఖోబ్రగాదె వద్ద పనిమనిషిగా పని చేసిన సంగీతా రిచర్డ్‌ను తరలించే విషయంలో ఈ దౌత్యవేత్తే క్రియాశీలక భూమిక పోషించినట్టు చెబుతున్నారు.
అమెరికా అధికార ట్రావెల్ ఏజెన్సీ జారీ చేసిన టికెట్లతోనే సంగీతా రిచర్డ్ భర్తను, ఇద్దరు పిల్లలను తరలించినట్టుగా స్పష్టమవుతోంది. ఈ విమాన టిక్కెట్ల రేట్ల విషయంలో తన దౌత్యాధికారాన్ని ఉపయోగించుకుని ఈ అధికారే మినహాయింపును కూడా ఇచ్చినట్టు భావిస్తున్నారు. కాగా, వీసా కేసు నేపథ్యంలో అరెస్టయి 2.5లక్షల డాలర్ల పూచకత్తుతో బెయిలు పొందిన ఖోబ్రగాదెను సాధ్యమైనంత త్వరగా వెనక్కి తీసుకురావాలని భారత్ భావించింది. అందుకోసం పూర్తిస్థాయి దౌత్య మినహాయింపులను వర్తింప చేసే జీవన్ వీసా మార్గానే్న అనుసరించాలని నిర్ణయించింది. అయితే, ఖోబ్రగాదెపై దాఖలు చేసిన కేసు ప్రాథమిక విచారణ విషయంలో రాజీ పడేది లేదని, అనుకున్న ప్రకారం ఈనెల 13న కేసును చేపడతామని అమెరికా స్పష్టం చేయడం, అలాగే, అక్కడి జ్యూరీ ఆమెను అభిశంసించి వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశించడంతో వ్యవహారం కొత్త మలుపు తిరిగినట్టయ్యింది.