
హైదరాబాద్, చార్మినార్, జనవరి 8: వైకుంఠ(ముక్కోటి) ఎకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పురాణాపూల్ జియాగూడ సమీపంలోని శ్రీ రంగనాథస్వామి దేస్థానంలో నేడు ప్రత్యేక పూజాధికాలను నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు జరిగాయి. వైకుంఠాన్ని తలపింపజేసేలా దేశ విదేశాల నుంచి పుష్పాలను తెప్పించి ఎంతో శోభాయమానంగా దేవాలయాన్ని అలంకరించనున్నట్లు, ఈ పనులను మూడురోజులుగా 150 మంది కళాకారులు చేపడుతున్నట్లు దేవస్థానం అర్చకులు శృంగారం శేషాచార్యులు తెలిపారు. ఇప్పటికే దేవస్థానం ఆధ్వర్యంలో గత నెల 16వ తేదీ నుంచి ధునర్మాస ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుండగా, శనివారం వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి పర్వదినాన్ని మరింత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ఊపందుకోవటంతో శుక్రవారం అర్థరాత్రి నుంచి దేవాలయం ఆవరణలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అలంకరణలో సముద్రపు శంఖులు, కపిష్కలు వినియోగించటంతో మరింత ఆకర్షనీయంగా దర్శనమిస్తుంది. ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా ఆలంకరించారు.
గత కొద్దిరోజులుగా ఈ ఏర్పాట్లను రాష్ట్ర మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రి ముఖేష్‌గౌడ్, స్థానిక కార్పొరేటర్లు మిత్రకృష్ణ, శంకర్‌యాదవ్, వైకంఠంలు పర్యవేక్షించారు. దేవాలయం ఆవరణలో త్లెలవారుఝాము నుంచే భక్తుల సందడి నెలకొనుతుండటంతో వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పలు ఏర్పాట్లు చేశాయి. ఈ సారి కూడా స్వామివారిని దర్శించుకునేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచే గాక, ఇతర రాష్ట్రాల నుంచి సుమారు రెండు లక్షల మంది వరకు భక్తులకు తరలిరానున్నట్లు నిర్వాహకులు అంఛనా వేశారు. వారికెలాంటి అసౌకర్యం కలగకుండా భారీగా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.