
కానీ ఆయనకో కొడుకుండేవాడని మాత్రం ఎవరూ నాకు చెప్పలేదు’’ అన్నాడు చంద్ర బాధగా.
‘‘ఎవరూ గతాన్ని తవ్వకూడదు. అది రాజాజ్ఞ. ఇప్పుడు నేనైనా చెప్పేదాన్ని కాదు. కానీ నువ్వు ఆ చారుకేసి, మందాకిని వలలో ఎక్కడ పడిపోతావో అన్న భయంతో విషయమంతా నీతో చెప్పాను! నేనొక్కటే చెప్తున్నాను.. ఆ చారుకేసి నువ్వనుకున్నంత మంచిది కాదు సరికదా పచ్చి నెత్తురు తాగే పిశాచి. దాని మాటలు నమ్మకు! మరోమాట- ఈ విషయాలేం నీకు తెలియనట్టే వుండు. నేను నీకు చెప్పానని తెలిస్తే బాబుగారు నన్ను తవ్వి పాతరేస్తారు’’ అంది బ్రాహ్మిణి భయంగా హెచ్చరిస్తూ.
‘‘ప్రాణం పోయినా చెప్పను’’ స్థిరంగా అన్నాడు చంద్ర.
***
మరో ఆరు నెలలు కాలగర్భంలో కలిసిపోయాయి. చంద్ర సైనిక శిక్షణ పొంది, రాజస్థానంలోనే నియమితుడయ్యాడు. అతను సైనిక వేషంలో వున్న మహాచక్రవర్తి కుమారుడిలా వుండేవాడు. మీసకట్టు ఒత్తుగా పెరిగింది. మొహంలో మునుపటి బేలత్వం లేదు. ఒకలాంటి హుందాతనం చోటుచేసుకుంది.
అయితే ఎంత పని వత్తిళ్ళు వున్నా ధన్వంతరి దగ్గరికెళ్ళడం, ఆయనక్కావలసిన మూలికల్ని అడవినించి తీసుకురావడం, వాటిని మందులుగా తయారుచెయ్యడంలో సాయపడ్డం మానలేదు.
సింధూరకి అతనిమీద ప్రేమ మరింత పెరిగింది. అది గ్రహించినా గ్రహించనట్టు వుండేవాడతను.
కూతురి మనసులోని భావం తెలియని మిత్రాజీ, రాజస్థానంలో పని దొరికినా, చంద్ర తమ ఇంట్లోనే వుండడం చూసి సంతోషపడిపోయాడు.
ఆ రోజు మిత్రాజీ దర్బారుకెళ్ళిపోయాడు. దాస దాసీలు ఎవరి పనుల్లో వాళ్ళున్నారు.
సింధూర ఏదో చిత్రం గీస్తోంది తన గదిలో కూర్చుని. ఆమెకి చిత్రలేఖనంలో ప్రవేశం వుంది.
అప్పుడే వీధిలో గలాటాలాంటిది వినిపించి బైటికొచ్చింది.
తోట ఆవరణలో వున్న మఖద్వారం దగ్గర ఎవరితోనో గొడవ పడుతున్నారు ద్వారపాలకులు.
సింధూర కుతూహలంగా వెళ్లి- ‘‘ఏవిటి గొడవ?’’ అంది విసుగ్గా.
‘‘చూడండమ్మా! వీళ్ళెవరో వాళ్ళ అబ్బాయిని వెతుక్కుంటూ ఇక్కడికొచ్చారు. ఇక్కడ లేడంటే వినిపించుకోవడంలేదు!’’ చిరాగ్గా అన్నాడు ఒకతను.
సింధూర వచ్చిన వ్యక్తుల్ని పరిశీలనగా చూసింది. వాళ్లిద్దరూ ఆటవికుల్లా వున్నారు. బట్టలు ధరించినా, మెడల్లోనూ చేతులకి రంగురంగుల పూసలు, నెత్తిన ఈకలు, మొహాన పచ్చబొట్లతో వింతగా వున్నారు.
‘‘ఎవరు మీరు?’’ అంది సింధూర కుతూహలంగా. వాళ్ళిద్దరూ ఆమెకి వినయంగా నమస్కరించి-
‘‘మా యోగి చాన్నాళ్ళుగా కనిపించడంలేదమ్మా! చేపలు పట్టడానికి కాలవకెళ్ళినవాడు తిరిగి రాలేదు. ఆడికోసం తిరగని సోటులేదు. మొక్కని దేవుళ్ళేడు.
సివరికి ఆడు ఈ దేశంలో వున్నాడని యిని ఇలాగొచ్చాం. వూళ్ళో ఇశారిస్తే.. మంత్రిగార్నడగమన్నారు. ఇక్కడికొచ్చి అడిగితే ఈళ్ళు కొట్టినంత పనే్చస్తున్నారు! తమరైనా సెప్పండమ్మా! మా యోగి ఇక్కడగినా పనే్జస్తున్నాడా?’’ అన్నారు దీనంగా.
‘‘యోగి? యోగి అన్నవాళ్ళెవరూ ఇక్కడ పని చెయ్యడంలేదే.. అసలు మీదేవూరు?’’ అంది సింధూర.
‘‘అబ్బో! మాది శానాదూరంలో వున్న అడివి. మావోడు శాపలడతంతే ఆణ్నెవురో కొట్టి తీసికెళ్ళారని గొడ్డుకాడి బుడ్డోళ్లు సెప్పారు. తర్వాత ఆడు కనిపించలేదు. ఎతికి ఎతికి, ఇంకాడు బతికి లేడని ఓ ఏడుపేడిసి వూరుకున్నాం. కానీ ఈమద్దిన ఎవురో అనుకుంటుండగా ఇన్నాం.
ఈ వూళ్ళో ఓ కుర్రాణ్ణి ఎవురో కొట్టి కోట గుమ్మంకాడ పడేశారని, సావు బతుకుల్లో వున్న ఆణ్ని ఓ మారాజు బతికించాడని ఓ వేళ ఆ కుర్రాడో మా యోగేనేమో అన్న ఆశతో ఇంతదూరం పడొచ్చాం!’’ ఏడుస్తూ అందా ఆటవిక స్ర్తి.
తృళ్ళిపడింది సింధూర.
‘‘కొట్టి కోట గుమ్మం దగ్గర పడేశారా? ఎవరు?’’ అంది ఆదుర్దాగా.
‘‘తెలవదమ్మా! ఆడెవురికీ అపకారం చేసే మడిసి కాదు. ఆణ్ని కొట్టడానికెవుడికి చేతులొచ్చాయో! బిడ్డకింకా మీసకట్టు కూడా సరిగా రానేదు. ఆళ్ళ సేతులిరగ! అన్నాయంగా నా బిడ్డని పొట్టన పెట్టుకోవాలని సూత్తన్నారు’’ కళ్ళు తుడుచుకుంటూ అందా స్ర్తి.
సింధూరకి విషయం అర్థమయింది. వెంటనే భయం కూడా వేసింది.
‘‘అలాగా! ఇప్పటికి మీరెళ్ళండి! అతను ఎక్కడో క్షేమంగానే వుండి వుంటాడు. ఇక్కడ మాత్రం, అలాంటి వ్యక్తి లేడు. మీకెవరో తమషాకి చెప్పుంటారు. లేకపోతే కోటగుమ్మందగ్గర ఎవర్నయినా కొట్టి పడేస్తే మంత్రి కూతుర్నయిన నాకు తెలియకుండా వుంటుందా?’’ అంది అనునయంగా.
‘‘ఇలాంటియి సరదాకీ, తమాషాలకీ ఎవురు సెప్తారు తల్లీ.. మీకు తెలవకపోవచ్చు.. ఓపాలి నానగారిని కనుక్కుని ఎల్తాం?’’ అన్నారు దీనంగా.
హడలిపోయింది సింధూర.
వాళ్ళు వెతికేది చంద్ర కోసమే అని ఆమెకి తెలుసు. ‘‘తన తండ్రినడిగితే జరిగింది చెప్పేస్తాడు. గతం గుర్తురాని చంద్రకి తల్లిదండ్రుల్ని చూస్తే కచ్చితంగా గుర్తొచ్చింది. ఆపై క్షణం ఇక్కడుండడు. అతను వెళ్లిపోతే తను కట్టుకున్నవన్నీ గాలి మేడలయిపోతాయి!’’ ఇలా వున్నాయి ఆమె ఆలోచనలు.
ఆటవిక దంపతుల కథనం విన్నాక ద్వారపాలకులకి చంద్ర విషయం గుర్తొచ్చింది.
‘‘ఒకవేళ యోగి... అంటే చంద్ర అన్న కుర్రాడు’’ అంటూ ఏదో అనబోయిన అతన్ని వారిస్తూ-
‘‘ఓ! ఆ చంద్రయ్య గురించా? నిజమే! అతన్ని అతని దాయాదులు కొట్టి కోట గుమ్మం దగ్గర పడెయ్యడమూ, మా వాళ్ళు అతన్ని రక్షించి పంపెయ్యడమూ జరిగింది. కానీ పాపం! అతను నెల్లాళ్ళకిందటే విషజ్వరం సోకి చనిపోయాడు. అయినా ఆ చంద్రయ్యకి అరవై ఏళ్లకి తక్కువుండవే!’’ అంది సింధూర అందమైన కథ అల్లుతూ.
‘‘అరవై ఏళ్ళా?’’ దిగులుగా అన్నారా దంపతులు.
‘‘ఇంకా ఎక్కువే వుంటాయి. అయినా అతనూ పోయాడు!’’ బాధగా అంది సింధూర.
దంపతుల మొహాలు వాడిపోయాయి.
సింధూర ఎందుకో అబద్ధం చెబుతోందని గమనించిన ద్వారపాలకులు మరి నోరెత్తలేదు.
‘‘అయితే మేం వస్తాం తల్లీ!’’ నీరసంగా వెనుదిరిగారా దంపతులు.
వాళ్ళు ఇంకెవర్నయినా అడుగుతారేమో అన్న భయంతో- ‘‘పాపం, వీళ్ళు చాలా దూరం నించి నడిచొచ్చారు. తినడానికేమైనా తిండి పెట్టించి, అడవి దాటించి రండి’’ అంటూ ద్వారపాలకులని ఆజ్ఞాపించింది.
ఆమె గొంతులో- ‘‘ఈ విషయం ఎవరికీ తెలియకూడదు సుమా’’ అన్న హెచ్చరింపు వుంది.
- ఇంకా ఉంది