
ఏడుకొండల మీద వెలసిన దేవదేవుడే వాడవాడలా అవతరించి, తాను దీన జన బాంధవుడినని తెలుపుతున్నాడు. అలా శ్రీ వెంకటనాధుడు కొలువుదీరిన క్షేత్రాలు మన రాష్ట్రంలోఎన్నో . అలా శ్రీ వెంకటనాధుడి లీలావిశేషాలతో పునీతమైన మరో అపురూప క్షేత్రం జమలాపురం. ఖమ్మం జిల్లాలో ఉన్న ఈ క్షేత్రం స్వామి భక్తులకు కొండంత అండగా అలరారుతోంది. భక్తుల అభీష్టం మేరకు సాలగ్రామ శిలారూపంలో వెలసిన ఆ స్వామి ఈ క్షేత్రంలో ఇద్దరు దేవేరులతో కలసి కొలువుదీరాడు.
జమలాపురం ఓ అపురూప వైష్ణవ క్షేత్రం. మది పులకించిపోయే ప్రకృతి అందాలు ఈ క్షేత్రం సొంతం. జాబాలి అనే మహర్షికి అభయమివ్వటానికి అనంతుడు ఇచ్చటికి దిగివచ్చాడు. సాలగ్రామ స్వరూపమే మూలవిరాట్‌గా ఉన్న అరుదైన దేవాలయం ఇది. అలుమేలు మంగ, పద్మావతీ అమ్మవార్లతో కొలువుదీరిన స్వామి ఇక్కడ వెలియడం మా అదృష్టం అంటారిక్కడజనులు. అడుగడుగునా గోవింద నామ స్మరణంతో మారుమ్రోగిపోయే ఈ దివ్యాలయ శోభ అనంతం.. అనన్య సామాన్యం. మది పులకించిపోయే ప్రకృతి అందాలతోపాటు, పచ్చగా పరుచుకున్న ప్రకృతి అందాలు ఈ ఆలయ సొంతం. స్వామి లీలా విశేషాలకు వేదికగా ఉన్న ఈ దివ్యాలయం మధిర పట్టణానికి సుమారు 30 కిలోమీటర్లు దూరంలో అలరారుతోంది.
పౌరాణిక ప్రాశస్త్యమేకాదు, చారిత్రాత్మక నేపథ్యమూ ఈ క్షేత్రానికి వుంది. అనేకమంది రాజులు, భక్తులు సహకారంతో రూపుదిద్దుకున్న ఈ ఆలయం నిత్యమూ భక్తులతో రద్దీగా ఉంటుంది. అలాగే అక్క్భుట్టు అనే భక్తుడి అభీష్టంమేరకు స్వామి ఈ క్షేత్రంలో తన పాదం మోపాడని ఇక్కడి స్థల పురాణం చెబుతుంది. 108 దివ్య తిరుపతులలో ఒకటిగా ఈ దివ్యాలయం విరాజిల్లుతోంది. అలనాటి రాజుల, భక్తుల స్వామి భక్తికి ఈ ఆలయ గోపుర, ప్రాకారాదులే సాక్ష్యం. ఈ దివ్యాలయంలోని అణువణువూ గోవిందుని లీలావిశేష ఫలితంగానే భక్తులు చెబుతారు.
భక్తులకు ఓ అనిర్వచనీయమైన ఆధ్యాత్మికానుభూతిని సొంతం చేసే ఈ దివ్యాలయం - చక్కటి దేవతామూర్తులతో అందంగా కానవచ్చే గోపురం స్వామివారి ఆలయానికి సమీపంలోనే నిర్మించారు. స్వామివారి దేవస్థానం కొండ పై భాగంలో ఉంది. దీనిని చేరుకోవడానికి విధిగా మెట్లను నిర్మించారు. దీనిని దాటుకుని ముందుకు వెళితే స్వామివారి ఆలయ ప్రాంగణం ఉంది. విశాలమైన ఈ ఆలయ ప్రాంగణం వివిధ దేవీదేవతల మందిరాలతో అలరారుతుంటుంది. స్వామివారి గర్భాలయంలో శ్రీ వెంకటనాధుడు శ్రీదేవి, భూదేవి సమేతంగా సాలగ్రామ శిలారూపంగా దర్శనమిస్తాడు. స్వామివారి గర్భాలయంలో మూలమూర్తే సాలగ్రామ శిల. దీనికి వెనకవైపు భాగంలో శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ప్రతిష్టితమూర్తిని ఉంచారు. ఈ మూర్తి చూడడానికి చాలా అందంగా తిరుపతిని మరిపిస్తుంది. స్వామివారి గర్భాలయం బయట భాగంలో ఒకపక్క అలివేలు మంగ అమ్మవారు, మరోపక్క గోదాదేవి అమ్మవార్ల మందిరాలున్నాయి. దీనికి సమీపంలోనే స్వామివారి పాద మండపం ఉంది. ఈ మండపంలో ఓ శిలపై స్వామివారి పాదాలున్నాయి. జమలాపురం శ్రీ వేంకటనాధుడి ఆలయం శివ కేశవ క్షేత్రంగా కూడా పేరుగడించింది. శివకేశవుల అభేదానికి తార్కాణంగా నిలిచిన ఈ దివ్యాలయ ప్రాంగణంలో మరోపక్క శ్రీ సోమేశ్వరస్వామివారు కొలువుదీరారు. శ్రీ సోమేశ్వరస్వామే ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడు.
జాబాలి మహర్షి తప్ఫఃలమే ఈ క్షేత్రం. మహర్షిని, అర్చకుడిని కరుణించిన వేంకటనాధుడు ఇక్కడ భక్తుల కోర్కెలుతీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. ఆ కారణంగానే రాష్ట్రం నలుమూలలనుండి భక్తులు విరివిగా ఈ క్షేత్రానికి వచ్చి స్వామిని దర్శించుకుంటారు.
శ్రీ వేంకటనాధుడి ఆలయానికి సమీపంలోనే కొండమీద పద్మావతీదేవి ఆలయాన్ని కూడా ప్రత్యేకంగా నిర్మించారు. సూచీపర్వత శిఖరంపై వెలసిన సాలగ్రామ స్వామిని నిత్యం దర్శించుకోవాలనేమో, పద్మావతీదేవి కూడా శిఖరాగ్రంలోనే కొలువుతీరింది. ఆ తల్లి దర్శనం సర్వమంగళకరం. వీటితోపాటు ఆ ఆలయానికి సమీపంలో మనోహరమైన అయ్యప్పస్వామి ఆలయం ఉంది. ఆద్యంతమూ ఆకట్టుకునే ఈ ఆలయ శోభ వర్ణనాతీతం. అడుగడుగునా ఈ ఆలయం శ్రీ అయ్యప్పస్వామి నామస్మరణంతో మారుమ్రోగుతోంది.
జమలాపురం శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని రోజూ వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. అయితే యాత్రికులకు తగిన వసతులు ఇక్కడ లేవు. అలాగే భోజన సదుపాయం కూడా ఇక్కడ లేదు. అయితే దేవస్థానంలో మాత్రం కొంతమందికి మాత్రమే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
జమలాపురం శ్రీ వెంకటనాధుడి దర్శనం పూర్వ జన్మల పుణ్యం. ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకునే భక్తుల ఇళ్ళల్లో లేమి అనేది ఉండదట. స్వామి ఇక్కడ తన భక్తులకు అన్నపానాదులతోపాటు సకలైశ్వర్యాలు ప్రసాదిస్తాడని ప్రతీతి. అలాగే వివాహం కానివారు ఇక్కడ స్వామిని దర్శిస్తే వివాహ యోగం కలుగుతుందని విశ్వాసం.