
సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశించే పుణ్యఘడియలివి. ఈరోజునుండి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభం. దేవ మార్గం ప్రారంభమయ్యే రోజు. ప్రతినెలా సంక్రాంతి పురుషునకు ఒక్కొక్క రూపం, ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఈ మకర సంక్రమణం అత్యంత ముఖ్యమైనది. ఈ సంక్రాంతివేళ స్నాన- దాన- జప-వ్రతాదులు విశేష ఫలాన్నిస్తాయి. రాత్రి పూర్వభాగమున గాని- నిశీధమున గాని సంక్రాంతి అయినట్లయితే ఉత్తర దినము పుణ్యకాలము. అందులోనూ మధ్యాహ్నంలోగానే పుణ్యకాలము. ‘‘సంక్రాంతి రేగ్రహణాదికా’’ అను శ్లోకము ననుసరించి శుక్ల సప్తమినాడు సంక్రాంతి అయినచో గ్రహణంనాటి కంటే ఎక్కువని భావన. సంక్రాంతి పండుగకు ముందురోజు భోగి, దక్షిణాయనానికి ధనుర్మాసానికి చివరిరోజు. భోగి పండుగనాడే గోదా శ్రీరంగనాధుల వివాహం జరిగింది. ఆ జగగ్గనని జగన్నాయకుని చేరి భోగములందిన దినం. ఈరోజున తలంటుస్నానం చేయాలి. భగవదర్చన నిర్వహించాలి. గృహాలలోని పాత- విరిగిన- పనికిరాని వస్తువులను భోగిమంటల్లో వేసి భోగి పీడ విరగడైనట్లుగా భావించే సంప్రదాయం కొన్ని ప్రాంతాలలో వున్నది.
ఈరోజున చేసే దేవతా పూజలు- స్తోత్రములు- పారాయణాదులు పరమైశ్వర్య ప్రదాయకాలు.
ఈ పర్వదినమునాడు దేవతలకు- పితృ దేవతలకు- పాత్రులకు ఏఏ పదార్థాలను దానం చేస్తామో అవి అధికంగా జన్మజన్మలకూ లభిస్తాయి. ఉత్తరాయణ పుణ్య కాలానికి ఆరంభము కావున ఈ కాలంలో ధాన్యం- ఫలాలు- విసనకఱ్ఱ- వస్త్రం- సువర్ణం కాయగూరలు- దుంపలు- తిలలు- చెఱకు- గోవు మొదలైనవి దానం చేయాలని శాస్త్ర వచనం. ఈ రోజున వస్తద్రానం చేయడం ఉత్తమ ఫలితాన్నిస్తుంది. పంచ రుణాలనుంచి గృహస్థులు విముక్తి పొందే మార్గాలను ఆచారాల రూపంలో నిక్షేపించి- నిర్దేశించిది ఈ మకర సంక్రాంతి. సంక్రాంతినాడు శివుని ప్రతిమకు నేతిలో అభిషేకం చేసి, నువ్వు పువ్వులతోనూ, మారేడు దళములతోను పూజించాలి. ధూపదీప నైవేద్యములు సమర్పించి, ప్రార్థన చేసి, ప్రదక్షిణ చేసిన విశేషఫలం కల్గుతుంది. రాత్రివేళ జాగరణ చేయాలి. ఈ కార్యమును దధిమంధన వ్రతం అంటారు. జాబాలి, ఋషినాగుడనేమునికి ఈ వ్రతమును తెలిపినాడు. ఓం నమఃశివాయ మంత్రజపం చేయడం ముఖ్యం. అందువలన శివగతి లభిస్తుంది. దారిద్య్రం పోతుంది. దధిమంధన దానానికి అఖండ సుఖ భోగాలు లభిస్తాయి. ధాన్యమూ, సంతతీ కల్గుతాయి. యశోదా కృష్ణుల ప్రతిమకు యథావిధి పూజ చేసి పెరుగు చిలకడానికి కావలసిన సామగ్రిని, ఆ ప్రతిమలనూ సత్పాత్రునికి దానం చేయాలి. పండుగనాడు పొంగలి వండుకోవాలి.