
గొబ్బీయలో గొబ్బయలో అంటూ పండుగమాసమంతా ఆవుపేడతో గొబ్బెమ్మలను పెట్టి వాటికి పసుపుకుంకుమల అలంకారం చేసి గుమ్మడిపూలు పెట్టి గౌరీదేవిగా భావించి తెలుగునాటఅంతాసంక్రాంతి పండుగను సంబరంగా జరుపుకుంటుంది. విల్లిపుత్తూరులోని విష్ణుచిత్తుని తనయ అండాల్ శ్రీరంగనాథుణ్ణి తన నాథుణ్థిగాచేసుకోవాలని ఈ మాసంలోనే కాత్యాయనీ వ్రతం చేసింది. భోగీపండుగ రోజు ఆ ఆండాల్ తల్లికి రంగనికి వివాహం జరిగింది. ఆరోజును పురస్కరించుకుని వైష్ణవాలయాల్లో గోదాకల్యాణాలు చేస్తారు.
పొద్దుపొద్దునే భోగీమంటలు వేసి అందులో విరిగిన కొమ్మలు, ఎండిన ఆకులు, పాత చీపుర్లు పాతవస్తువులు అగ్నికి సమర్పించి అంధకారాన్ని తొలగించి జ్ఞాన వెలుగులను ప్రసాదించాలని కోరుకుంటారు.
తల్లులు, ఆడపిల్లలు కలసి తమ ఇంటి ముంగిట ముత్యాల ముగ్గులు వేస్తూ అందంగా అలకరిస్తుండగా ‘‘హరిలోహరి రంగా శ్రీరంగా’’ అంటూ హరిదాసులు తుంబరలను మీటుతూ ఏతెంచుతారు. ‘‘శంభోశంకరా .. పరమేశ్వరా’’ అంటూ జంగందేవర పెద్ద శంఖం ఊదుతూ వస్తారు. తమలో శివకేశవుల భేదం లేదని వచ్చిన వారు భగవంతుడనే భావనతో వారికి తమ ఇంటిలో ఉన్న కొత్తవడ్లను పట్టుపుట్టములను కట్టబెట్టి వారి ఆశీర్వాదాలను అందుకుంటుంటారు. మగపిల్లలందరూ చలిపులిని బెదరిస్తూ అప్పుడప్పుడే వేడెక్కనున్న సూర్యుని కిరణాలను తాకాలని గాలి పటాలను ఎగురవేస్తుంటారు. ఇంటిపెద్దలందరూ తమతమ ఇంటి ముందర వడ్లకంకులను కట్టి పక్షులకు విందులు చేస్తారు.
సకాలంలో వానలు కురిసి ఎండలు కాసి తమ తమ పొలాలన్నీ బంగారు పంటలు పండించేలా చేయమంటూ దేవతల రాజైన ఇంద్రునకు పూజలు చేసి పరమాన్నాన్ని నైవేద్యం పెడతారు.
‘‘లోకానికి అన్నం పెట్టే రైతన్నకు దణ్ణం పెట్టు ’’ అంటూ గంగిరెద్దుల వారు కొత్తపంటలను ఇంటికి చేర్చుకొన్న రైతుల ఆనందాన్ని మాకు కాస్త దానం చేయమని వస్తుంటారు. ‘‘అంబ పల్కు జగదాంబ పల్కు...’’అంటూ బుడబుక్కలవారు వస్తారు.
చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి ... ఇలాంటి కర్మచారులందరూ తాము సంవత్సరమంతా చేసిన పనికి ధాన్యాన్ని తీసుకోవడానికి ఇంటికి వస్తారు.ఇలా ప్రతి మనిషి మరో మనిషికి తోడునీడై కలసి మెలసి బతికితేనే బతుకు అని చెప్పక చెప్తుంటారు ఈ సంక్రాంతి పండుగ దినాన. పగటివేషకారులు, యక్షగానకళాకారులు వచ్చి తమతమ సంస్కృతీసంప్రదాయాలను చిన్నపెద్దలందరికీ తెలిసేటట్లు వారి కళలను ఆవిష్కరిస్తుంటారు. పల్లె పట్నం అన్న తేడాలేకుండా సంక్రాంతి సంబరాలను తెలుగునాటనే కాదు భారతదేశమంతా కూడా అత్యంతఉత్సాహంతో జరుపుకుంటారు.
భోగీపండుగ సాయం సంధ్యలో చిన్న పిల్లలందరినీ కూర్చోబెట్టి రేగు, చెరకు, చిల్లరపైసలు, పుట్నాలపప్పు, మురమురాలు, పచ్చిశనగలు, కొబ్బరి ముక్కలు కలిపి భోగిపండ్లను అని పోసి వారికి హారతులిస్తారు. నలుగురు ముత్తెదులను పిలిచి పండుతాంబూలాలిచ్చి వారినుంచి పిల్లలు దీవనలందుకుంటారు. సంక్రాంతి మూడోరోజు ముక్కనుమ అని తాము వేసిన నాట్లు పండి బంగారును పండించటానికి తోడ్పడిన వృషభరాజులను అలకరించి వాటికి పొంగళ్ళను పెట్టి పొలంలో పొంగళ్లు చల్లి అటు భూదేవి, గోమాతలను ఇటు వృషభాలు దున్నపోతులను పూజిస్తారు. కొన్ని చోట్ల వీటికి పోటీలు కూడా పెడుతుంటారు. కోళ్ల పందాలూ సంక్రాంతి సంబరాలలో పాలుపంచుకుంటాయి. కవులు , గాయకులు, పండితులు తమ తమ వాక్‌వైభవంతో పద్యాలుఅల్లి కవితలు చదివి జనులను రంజింపచేస్తుంటారు. ఇలా మూడురోజులు జరుపుకొనే ఈ పండుగ పెద్దపండుగలో చిన్న పెద్దా, చెట్టుపుట్టా, పక్షిపశువు అందరూ ఆనందిస్తారు.