Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

అయ్యప్ప క్షేత్రం పరమ పవిత్రం

$
0
0

మోహిని వేషధారియైన శ్రీహరికి, శివునకు కల్గిన దైవం అయ్యప్ప. ఆ స్వామి కొలువుదీరిన మహా మహిమాన్విత పుణ్యక్షేత్రం శబరిమల. (శబరిమలై) కేరళ రాష్ట్రంలోత్రివేండ్రం నగరానికి 180 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం అయ్యప్పస్వామి వారి లీలావిశేషాలతో పునీతమయినది. హరిహర సుతుడు అయ్యప్పకు మణికంఠ, హరిహరపుత్ర, ధర్మశాస్త్ర, ధర్మస్రష్ట, తారకప్రభు, పరమగుప్త, ఆర్యదాతా, అయ్యనారప, అయ్యప్ప, గుర్రప్ప, గురునాధ, ముక్తేశ్వర నాధ, కలియుగ వరద, మునీశ్వర్, మన్నారుస్వామి అనే పేర్లు ఉన్నా అత్యంత భక్తిపూర్వకంగా స్వామి అయ్యప్పా అంటే చాలు పిలిచిన వారిని కంటికి రెప్పలా కాపాడే వాడు స్వామి అయ్యప్ప.

కేరళలోని శబరిమల క్షేత్రం అయ్యప్ప క్షేత్రంగా ఎంతో ప్రాముఖ్యత పొందింది. ‘శబరిమల’ అయ్యప్ప దీక్షకు ప్రధాన స్థానం అయితే, శబరిమల అయ్యప్ప క్షేత్రంతో కలిసి పంచ అయ్యప్ప క్షేత్రాలు ఉన్నాయి.
1. కుళిత్తుపుళా-
తిరువనంతపురం నుంచి 60 కి.మీ దూరంలో కుళిత్తుపుళా క్షేత్రంలోని ఆలయంలో బాలుని రూపంలో అయ్యప్పస్వామి దర్శినం లభిస్తుంది. కేరళ సాంప్రదాయరీతిలో ఈ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయంలో అయ్యప్పస్వామి బాలుని రూపంలో ఉండి ఒక చేతిలో విల్లును, రెండో చేతిలో బాణాన్ని పట్టుకుని ఉంటాడు. బాలుని రూపంలో ఉన్న అయ్యప్ప, పులి పాలు తేవటానికి గాను ఈ ప్రాంతానికి వచ్చి, కొంత సమయం ఇక్కడే ఉన్నట్లుగా స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.
2) అరియంగావు-
తిరువనంతపురం నుంచి 85 కి.మీ దూరాన ఉంటుంది అరియంగావు. ఈ ప్రాంతంలో యువకుడుగా ఉన్న అయ్యప్ప కొంతకాలం గడిపినట్లుగానూ, అక్కడ అయ్యప్ప వివాహం జరిగినట్లుగా ఒక కథనం ఉంది. అరియంగావు ఆలయంలో యువకుడుగా ఉన్న అయ్యప్ప కొలువుతీరటం వెనుక ఒక కథ ఉన్నట్లుగా స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఒక బట్టల వ్యాపారి ప్రతి సంవత్సరం తన వ్యాపార నిమిత్తంగా, కేరళ రాజధాని అయిన తిరువనంతపురంలోని మహారాజుకు నూతన వస్త్రాలను సమర్పించేవాడు. ఆ ఆనవాయితీని పాటిస్తూ, ఒక సంవత్సరం తన కూతురిని తీసుకుని బయల్దేరాడు. రాజధానికి చేరుకునేలోపే చీకటి పడటంతో, ఆ రాత్రి ఆలయంలో విశ్రమించారు. తండ్రీ కూతురు. ఉదయం వ్యాపారి కూతురిని ప్రయాణానికి సిద్ధంకమ్మని చెప్పాడు. తండ్రి తిరిగి వచ్చేంతవరకూ తాను ఆలయంలోనే ఉంటానని, అందుకు అనుమతిని ఇవ్వమని వ్యాపారి కొతురు తండ్రిని అభ్యర్థించింది. అందుకు అంగీకరించిన ఆ వ్యాపారి, ఆమెను పూజారికి అప్పగించి తాను తిరువనంతపురానికి వెళ్ళిపోయాడు. వ్యాపారి ఒంటరిగా ప్రయాణం చేస్తూండగా, ఏనుగులు అతనిపై దాడి చేసాయి.
ఆ సమయంలో అకస్మాత్తుగా ఒక యువకుడు అక్కడకు వచ్చాడు. అతనిలో ఎంతో తేజస్సు కనిపించిందా వ్యాపారికి, అతను ఏనుగుల బారినుంచి ఆ వ్యాపారిని రక్షించాడు. తనను రక్షించినందుకు కృతజ్ఞతగా, అతనికి ఏ బహుమతి కావాలో కోరుకోమని చెప్పాడా వ్యాపారి. అప్పుడా యువకుడు, ‘‘నాకు వేరే బహుమతి ఏదీ వద్దు. నీ పుత్రిక ‘పుష్పకళ’నిచ్చి నాతో వివాహం జరిపించు అని చెప్పాడు. అందుకు సమ్మతించిన ఆ వ్యాపారి, ఆ యువకునికి, ఒక పట్టు వస్త్రాన్ని బహూకరించాడు. ఆ వ్యాపారి రాజువద్దకు వెళ్ళి తాను తెచ్చిన నూతన వస్త్రాలను ఆయనకు వినమ్రంగా సమర్పించాడు. తిరిగి అరియాంగావుకు చేరుకున్నాడు. తాను యువకునికి బహూకరించిన పట్టువస్త్రంతో, దేవాలయంలోని స్వామివారు దర్శనమివ్వడంతో, తనను రక్షించిన ఆనా యువకుడు అయ్యప్పస్వామేనని గ్రహించాడు, ఆ వ్యాపారి. తాను మాట ఇచ్చిన ప్రకారంగా, స్వామివారితో తన కూతురి వివాహాన్ని జరిపించాడు. స్వామివారికి వివాహం జరిగినట్లుగా, స్వామివారి ఎడమవైపున దేవేరి పుష్పకళ కొలువై ఉన్నది.
3. అచ్చన్ ఆలయం-
తిరువనంతపురం నుంచి 90 కి.మీ దూరంలో ఈ అచ్చన్ కోవెల ఉంది. ఈ ఆలయం అయ్యప్పస్వామి వారిని, పరశురాముడు ప్రతిష్ఠించినట్లుగా స్థలగాథ తెలియచేస్తోంది. ఈ ఆలయం గురించి స్థల పురాణంలో వివరంగా తెలియచేయబడింది. పూర్వం, పరశురాముడు, ఈ ప్రాంతానికి వచ్చి, అక్కడ పర్యటిస్తున్నప్పుడు బాగా చీకటి పడింది. అప్పుడాయన ఈ ఆలయంలో విశ్రమించాడు. అది అప్పుడు అరణ్య ప్రదేశం. పరశురాముడు ఆ ప్రదేశంలో సంచరిస్తున్నప్పుడు, ఏదో ఒక విష కీటకం పరశురాముడిని కుట్టింది. ఆ బాధ తీవ్రమై ఆయన కదలలేకపోయాడు. బాధను భరించలేక తల్లడిల్లిపోసాగాడు. ఆ సమయంలో ఒక యువకుడు పరశురాముని వద్దకు వచ్చి, తన చేతిలో ఉన్న పాత్రను ఆయనకు అందులో ఉన్న అమృతం లాంటి ద్రవాన్ని త్రాగమని చెప్పాడు. పరశురాముడు, ఆ విధంగా చేయగా ఆయన బాధ వెంటనే తొలగిపోయింది. ఆ రాత్రి సుఖంగా నిద్రించాడు పరశురాముడు. పరశురాముని స్వప్నంలో అయ్యప్పస్వామి ఆయనకు దర్శనమిచ్చారు. ఉదయం నిద్ర లేవగానే, పరశురాముడు స్వప్నంలో తనకు సాక్షాత్కరించిన అయ్యప్పస్వామి, ఆయన దేవేరులిద్దరితో విగ్రహాలను ప్రతిష్ఠించి, పూజలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. అయితే, ఈ ఆలయం కేరళ సాంప్రదాయ పద్ధతి ప్రకారంగా కాకుండా తమిళ సాంప్రదాయ రీతిలో నిర్మించబడింది.
4) శబరిమల-
కేరళలోని కొట్టాయం నుంచి 70 కి.మీ. దూరంలో శబరిమల క్షేత్రం నెలవై ఉంది. మణికంఠుడు రాజ్యాన్ని త్యజించి, తాను వానప్రస్థానాన్ని స్వీకరిస్తానని, తాను వదలిన శరం ఎక్కడ నేలను తాకితే,ఆ ప్రాంతాన తనకు గుడి కట్టించమని తండ్రికి చెప్పాడు. పుత్రుని కోరిక ప్రకారంగా, వందళరాజు, ఆ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మింపచేసాడు. ఆ ఆలయంలో అయ్యప్పస్వామి తపోముద్ర భంగిమలో కొలువై ఉంటాడు.
5. కాంతమలై
ఈ ప్రాంతంలో కొలువై ఉన్న అయ్యప్పస్వామిని దర్శించటానికి భక్తులకు ప్రవేశం లేదు. మకర సంక్రాంతినాడు స్వామివారు జ్యోతి రూపాన భక్తులకు దర్శనమిస్తారు. స్థల పురాణాన్నిబట్టి, కాంతమలై విశ్వకర్మచేత నిర్మింపబడిన స్వర్ణాలయంగా తెలుస్తోంది. ఈ ఆలయంలో జ్ఞానపీఠంపైన స్వామివారు ఆశీనులై ఉన్నారు. దేవతలు స్వయంగా ఈ స్వామికిపూజలు జరుపుతారు. ఇక్కడి గుడి కేవలం దేవతలకు మాత్రమే కనిపిస్తుందని, ఏ మానవులకు కనిపించదని స్థల పురాణ గాథ ద్వారా తెలుస్తోంది.
స్వామి అయ్యప్ప ఈ క్షేత్రంలో భక్తులకు దూరంగా ఏకాంతంగా ఉంటాడు. కేరళ రాష్ట్రంలోనే నిర్మింపబడిన ఈ నాలుగు క్షేత్రాలలోని అయ్యప్పస్వామిని దర్శించి, ‘మకరజ్యోతి’ని దర్శించి, పంచ క్షేత్రాలను దర్శించిన భక్తులు పునీతులవుతారు. మకర జ్యోతిని దర్శించడం అయిదో క్షేత్రాన్ని దర్శించినట్లుగా భక్తులు భావించవచ్చు. జ్ఞానాన్ని, భక్తినీ, ఆధ్యాత్మిక భావాన్నీ, పవిత్రతను, ప్రశాంతతనూ, పుణ్యఫలాన్ని పొందుతారు, అయ్యప్పస్వామి భక్తులు. ‘స్వామియే శరణం అయ్యప్పా.’

మోహిని వేషధారియైన శ్రీహరికి, శివునకు కల్గిన దైవం అయ్యప్ప.
english title: 
a
author: 
- కె. నిర్మల

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>