* తండ్రిని లెక్కపెట్టని ప్రహ్లాదుడు ‘‘పితృదేవో భవ’’ అన్న వాక్యాన్ని తప్పినట్లే కదా! మరి అతనిని మహాభాగవత శిఖామణి - అని ఎలా అన్నారు?
- ఎం. పుష్పవల్లి, ఆమనగల్లు
తండ్రి పతితుడై, పుత్రుడ్ణిగూడా పతితుడయ్యేటట్లు ప్రయత్నం చేస్తున్నపుడు, అలాంటి తండ్రిని అనుసరించరాదని ధర్మశాస్త్రాలలో వివరణ వున్నది. ప్రహ్లాదుడు తండ్రిని అనుసరించలేదు. గానీ, ఎక్కడా ఎప్పుడూ నిందించలేదు, ద్వేషించలేదు. వీడు ఇలా తనను ద్వేషించకుండా ఎలా వుండగలుగుతున్నాడని హిరణ్యకశిపుడే ఆశ్చర్యపోయాడని భాగవతంలో వుంది. అందుచేత ప్రహ్లాదుడు ఉత్తమ భక్తుడనటంలో సందేహం లేదు.
* ఆలస్యమైపోతే సంధ్యావందనం మానేయాలా? - గిరిజామనోహరి, వరంగల్లు
సంధ్యావందనాన్ని ఎట్టి పరిస్థితిలోనూ మానేసే వీలులేదు. మధ్యాహ్న కాలం గూడా దాటిపోయేదాకా ప్రాతస్సంధ్యావందనం కుదరకపోతే, మొదట మధ్యాహ్నికం చేసి, ఆ వెనువెంటనే ప్రాతస్సంధ్యా వందనాన్ని ప్రాయశ్చిత్త పూర్వకంగా చేయాలి. సాయం సమయంగూడా దాటిపోతే, ముందు సాయంసంధ్యావందనం చేసి, ఆ తరువాత మధ్యాహ్నసంధ్య, ఆ తరువాత ప్రాస్సంధ్య చేయాలి. రాత్రి పనె్నండు గంటలు దాటిపోతే మర్నాడు తెల్లవారాక, ఆనాటి ప్రాతస్సంధ్య ముందు చేసి, నిన్నటివన్నీ తరువాత చేసుకుంటూ రావాలి.
* వినాయకునికి సిద్ధిబుద్ధి అను ఇరువురితో ఏక కాలంలో వివాహం ఎందుకు జరిగింది? - వి.బాలకేశవులు, గిద్దలూరు
సిద్ధిబుద్ధి అనేవారు విశ్వరూపుడనే మహర్షి పుత్రికలు. ఆ మహర్షికి ఇచ్చిన వరంవల్ల వినాయకుడు వారిద్దరినీ వరించాడు. సిద్ధి అంటే సంకల్పసిద్ధి, బుద్ధి అంటే ఆత్మజ్ఞానము. ఈ రెండూ ఎల్లప్పుడూ కలిసే వుంటాయి.
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8, అలకాపురి,
హైదరాబాద్-500 035. vedakavi@serveveda.org