
దేశంలోని ప్రతి వ్యవస్థ కుళ్లిపోయినట్లే న్యాయ వ్యవస్థ సైతం కుళ్లి కంపుకొడుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరిచి న్యాయ వ్యవస్థను సంస్కరించాలి. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు సైతం అవినీతికి పాల్పడటమే కాదు మహిళల శీలాన్ని హరించే స్థాయికి ఎదిగిపోయారనేందుకు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి గంగూలీ ఉదంతమే నిదర్శనం. సుప్రీం కోర్టు న్యాయ దేవత ఆలయంగా కొనసాగేబదులు అవినీతి, అక్రమాలకు నిలయంగా మారుతోంది. అత్యున్నత న్యాయ స్థానంలో కొందరు న్యాయవాదులు చేస్తున్న లీలలు సిగ్గుపడేలా ఉన్నాయి. న్యాయ స్థానాల్లో న్యాయం విక్రయానికి గురి అవుతున్నా పాలకులు సైతం మొద్దు నిద్ర నుండి మేల్కొనటం లేదు.
ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి సుప్రీం కోర్టులోని తమ చాంబర్‌లో ఒక మహిళా న్యాయవాదితో జరిపిన రాసలీల కొంత కాలం క్రితం సంచలనం సృష్టించటం తెలిసిందే. సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఏ.కె.గంగూలీపై ఒక యువ న్యాయవాది చేసిన ఆరోపణలు గత రెండు నెలల నుండి పత్రికల్లో ప్రముఖంగా ప్రచురితవౌతున్నాయ. ఒక స్టార్ హోటల్‌లో తనపై ఆయన అత్యాచారానికి యత్నించాడని యువ న్యాయవాది చేసిన ఆరోపణలు చివరకు నిజమని తేలటం మన న్యాయ వ్యవస్థలో పేరుకుపోయిన కుళ్లు, అవినీతి, అక్రమాలకు అద్దం పడుతోంది. నిర్భయ దారుణ ఉదంతం జరిగిన తరువాత కూడా ఒక సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఇలా వ్యవహరించటం మన వ్యవస్థకు పట్టిన చెదను రుజువు చేస్తోంది. వివాదాల్లో చిక్కుకుపోయిన వారికి న్యాయం చేయవలసిన న్యాయవాదులు, న్యాయమూర్తులు ఇలా అవినీతి, అక్రమాలకు పాల్పడటం క్షమించరాని నేరం.
ఐదు సంవత్సరాల క్రితం కొల్‌కతా న్యాయమూర్తి సౌమిత్ర సేన్‌ను అవినీతికి పాల్పడినందుకు రాజ్యసభ అభిశంసించింది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సేయిల్),షిప్పింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాకు మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు సౌమిత్రసేన్‌ను రిసీవర్‌గా నియమిస్తే ఆయన దాదాపు ముప్పై లక్షల రూపాయలను స్వాహా చేశారు. ముగ్గురు న్యాయమూర్తుల విచారణ కమిటీ ఆయన తప్పుచేసినట్లు నిర్దారించగా అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కె.జి.బాలకృష్ణన్ ఆయనను అభిశంసించాలని ప్రధాన మంత్రికి సిఫారసు చేశారు. లోక్‌సభ తనను అభిశంసించకముందే సౌమిత్రసేన్ న్యాయమూర్తి పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు చేసే అవినీతి, అక్రమాలతో పోలిస్తే సేన్ మింగింది చాలా తక్కువే కావచ్చు. కానీ న్యాయం చేయవలసిన బాధ్యత గత న్యాయమూర్తి ఇలా అన్యాయం, అక్రమాలకు పాల్పడితే ఇక వ్యవస్థ గతేమిటి?
సౌమిత్రసేన్‌ను అభిశంసించాలని సిఫారసు చేసిన కె.జి.బాలకృష్ణన్‌పై ఆ తరువాత అవినీతి ఆరోపణలు రావటం అందరికి తెలిసిందే. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి నుండి రిటైర్ అయిన తరువాత జాతీయ మానన హక్కుల కమీషన్ అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న బాలకృష్ణన్ కుటుంబ సభ్యులు లెక్కికు మించిన ఆస్తులు సంపాదించుకున్నారనే ఆరోపణలు వచ్చాయ. అవినీతి ఆరోపణలు వచ్చినందున జాతీయ మానవ హక్కుల కమీషన్ అధ్యక్ష స్థానం నుండి తప్పుకోవాలని పలువురు న్యాయ కోవిదులు సూచించినా బాలకృష్ణన్ మాత్రం పట్టించుకోలేదు. ఆదాయం పన్ను, విజిలెన్స్ విభాగం, అవినీతి నిరోధక శాఖల్లో బాలకృష్ణన్ అవినీతిపై పిటిషన్లు దాఖలయ్యాయి. కామన్ కాజ్ అనే ఎన్.జి.ఓ గత సంవత్సరం సుప్రీం కోర్టులో ఒక కేసు దాఖలు చేసింది. బాలకృష్ణన్‌పై దాఖలైన కేసుపై విచారణ జరపాలా? వద్దా? అని కోర్టు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. కేంద్ర ప్రభుత్వం అనుమతి లభిస్తే బాలకృష్ణన్‌పై కూడా విచారణ జరుగుతుంది. న్యాయ వ్యవస్థలో అత్యంత కీలక పదవులు నిర్వహించిన వారు అవినీతికి పాల్పడటం మన వ్యవస్థలో పేరుకుపోయిన కుళ్లుకు అద్దం పడుతోంది.
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన షామిత్ ముఖర్జీని పది సంవత్సరాల క్రితం సి.బి.ఐ అరెస్టు చేసింది. ప్రభుత్వ భూమిపై నిర్మించిన హోటల్ యజమానికి ఇంటిరిం బెయిల్ ఇచ్చేందుకు ముడుపులు పుచ్చుకున్నారని సి.బి.ఐ ఆరోపించింది. బెయిల్‌పై బైటికి వచ్చిన ముఖర్జీపై ఇప్పుడు కేసు కొనసాగుతోంది. రెండు సంవత్సరాల క్రితం సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన పి.డి.దినకరన్ అవినీతి ఆరోపణల మూలంగా తన పదవి నుండి తప్పుకోవలసి వచ్చింది. భారత బార్ కౌన్సిల్‌కు చెందిన పలువురు సభ్యులు దినకరన్‌పై అవినీతి ఆరోపణలు చేయటంతో రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ ఆయనపై వచ్చిన ఆవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ దర్యాప్తులో అవినీతి ఆరోపణల్లో నిజమున్నట్లు వెల్లడైంది దినకరన్‌ను అభిశంసించాలనుకున్నారు అయితే ప్రమాదాన్ని గుర్తించిన దినకరన్ తనంత తానే న్యాయమూర్తి పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు.
పంజాబ్,హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన నిర్మల్ యాదవ్ పై కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆమెపై దర్యాప్తు చేసిన సి.బి.ఐ గత సంవత్సరం చార్జిషీట్ దాఖలు చేసింది. ఇవి న్యాయమూర్తుల అవినీతి, అక్రమాలకు సంబంధంచిన కొన్ని మచ్చుతనకలు మాత్రమే. ధైర్యం, నిజాయితీ ఉన్న కొందరు న్యాయవాదులు, న్యాయమూర్తులు విలువలకు నిలబడటం వలన ఇవి వెలుగులోకి వచ్చాయి. ఇంకా వెలుగులోకి రాని కేసులు వందలు కాదు వేలల్లో ఉంటాయి. ప్రజలకు పోలీసు వ్యవస్థపై విశ్వాసం ఎప్పుడో ఆవిరైపోయింది. అదే విధంగా న్యాయ వ్యవస్థపై కూడా ప్రజల విశ్వాసం సన్నగిల్లుతోంది. న్యాయ స్థానాల్లో సైతం న్యాయం జరగదు అనే అభిప్రాయం పాతుకుపోతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మొత్తం వ్యవస్థ కుప్పకూలుతుంది.